‘నా బంగారు హారమే కావాలి..’
బ్యాంకులో చోరీ ఘటన.. పరిహారం తీసుకునేందుకు మహిళల నిరాకరణ
ఘట్‌కేసర్: పరిహారం వద్దు.. నా పసిడి హారమే ముద్దు అంటూ చాలామంది మహిళలు పరిహారం డబ్బులు తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో ఏమీ చేయాలోపాలుపోక బ్యాంకు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఖాతాదారులకు చెందిన 4.6 కిలోల బంగారు నగలను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అసలే చోరీ జరిగి విచారంగా ఉన్న బ్యాంకు అధికారులు మహిళలు పరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తుండడం మరింత ఇబ్బందికి లోనవుతున్నారు.
చోరీకి గురైన లాకర్‌లో ఎక్కువగా మహిళలకు సంబంధించిన ఆభరణాలు ఉన్నా యి. మహిళలు ఎంతో అపురూపంగా చూసుకునే నగలు చోరీకి గురవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బ్యాంకు అధికారుల నుంచి పరిహారం తీసుకునేందుకు కొందరు మహిళలు నిరాకరిస్తున్నారు. తమకు ఇష్టమైన తమ నగలే కావాలని అధికారులకు చెబుతున్నారు. చోరీ ఘటన నేపథ్యంలో కొందరు అతివలు తమ భర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వద్దన్నా కూడా వినకుండా నగలను బ్యాంకులో తనఖా పెట్టారు.. ఇప్పుడు చోరీ అయ్యాయని పోరు పెడుతున్నారు.
కొందరు మహిళలు తమ పుట్టింటి వారు పెట్టిన నగలు.. అని బ్యాంకు అధికారులతో వాదనకు దిగుతున్నారు. ఇక చేసేదిలేక చివరకు కన్నీటిపర్యంతమవుతున్నారు. పరిహారం తీసుకొని తిరిగి చోరీకి గురైన నగల డిజైన్ చేయిస్తామని భర్తలు చెబుతున్నా మహిళలు వినడం లేదు. పరిహారం వద్దు తమకు సెంటిమెంట్‌గా ఉన్న అభరణాలే కావాలని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారని, రేపోమాపో పట్టుబడుతారని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చజెబుతున్నారు. పరిహారం అధికారులు ప్రకటించినా తీసుకునేందుకు ఖాతాదారుల స్పందన కరువైంది.