ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100 | RBI New Rule For Credit Bureaus And Banks to Pay Rs 100 Compensation Per Day | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100

Published Thu, Jan 9 2025 5:11 PM | Last Updated on Thu, Jan 9 2025 6:46 PM

RBI New Rule For Credit Bureaus And Banks to Pay Rs 100 Compensation Per Day

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.

బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్‌బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.

వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ఆర్‌బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం
వినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఏటీఎంల గురించి ఆర్‌బీఐ
నగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్‌లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement