మట్టితో నిండిన ఎంఎంటీఎస్ రైల్వే ఫ్లాట్‌ఫారం
ఘట్‌కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్‌కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్‌కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్‌కేసర్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం.
మరింత ఆలస్యం..
సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
నిరాశలో ప్రయాణికులు...
ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు
అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు
పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి.
–పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment