Ranga reddy distrct
-
కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్: బండి సంజయ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మూడోసారి సీఎం అయితే అంతకంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేస్తారా?.. మీకోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా?’’ అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ను తరిమి తరిమికొట్టి రామరాజ్యం తేవడమే బీజేపీ లక్ష్యం. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులంతా దండు పాళ్యం ముఠా. వాళ్లను జనం ఓడిస్తారని కేసీఆర్‌కు తెలిసిపోయింది. చివర్లో వాళ్లలో సగం మందికి బి ఫాం ఇవ్వకూడదని సీఎం ఎత్తుగడ వేసిండు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చదవండి: కేసీఆర్ ఆదేశాలతో తుమ్మలకు బుజ్జగింపులు -
ఇంటర్ ఫెయిల్.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా..
సంకల్పం ధృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు ఈ యువకుడు. ఇంటర్లో ఫెయిల్ అయినా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. కష్టపడి చదివి పాసయ్యాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒకప్పుడు అతడ్ని హేళన చేసిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఈ యువకుడి విజయ గాథ అతని మాటల్లోనే.. నా పేరు కె.రాఘవేందర్. మాది రంగారెడ్డి జిల్లా దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని. అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం పైన మార్కులు కానీ.. ఫెయిల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్‌క్లాస్ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్ ఇయర్లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్‌నగర్‌లో డీఈడీ కోచింగ్‌కు కూడా వెళ్లాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను. అయితే, ‘ఫెయిల్’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్‌కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్ అని ఉంది. ఎవరైతే నన్ను చూసి నవ్వారో.. వాళ్లే.. ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను. మా అమ్మ కళ్లలో ఆనందం చేసి.. వెంటనే మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది. ఒకసారి ఓడిపోతే.. ఇంటర్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి. చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు -
కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?
మొయినాబాద్(రంగారెడ్డి జిల్లా): మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్ పాత గేటు వద్ద హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తేల్చారు. మొయినాబాద్ నుంచి అప్పా వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓయువతి, యువకుడు అక్కడికక్కడే మరణించారు. వీరిని ఎన్.కల్యాణి(22), టి.రాజేశ్‌కుమార్(36)గా పోలీసులు గుర్తించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ములుగుంపల్లికి చెందిన కల్యాణి.. నగరంలోని ఎస్ఆర్నగర్లో ఉంటూ పంజాగుట్టలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రాజేశ్‌కుమార్ ఎస్ఆర్నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాజేశ్ జూమ్ కార్లో కారు అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరు కలిసి చేవెళ్ల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అజీజ్‌నగర్ పాత గేటు వద్ద ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కారులో ఎక్కడికి వెళ్లారు..? మృతి చెందిన కల్యాణి, రాజేశ్ కారులో ఎక్కడికి వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలల క్రితమే కల్యాణి నగరానికి వచ్చింది. ఎస్ఆర్ నగర్లోనే ఉంటున్న వీరిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది..? కారు అద్దెకు తీసుకున్న చేవెళ్ల వైపు వెళ్లారా.. వికారాబాద్ వరకు వెళ్లారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమరాలను పరిశీలిస్తే వాహనం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఈ విషయాలపై తాత్సారం చేస్తున్నారు. రాజేశ్‌కుమార్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో గోప్యత ప్రదర్శించడం అనుమాలను రేకెత్తిస్తోంది. -
డాడీ వెరీ బ్యాడ్.. నరకం చూపిస్తున్నాడు!
నందిగామ: పదో తరగతి పరీక్షలు రాయాల్సిన ఆ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. సోమవారం నుంచి పరీక్షలకు హాజరు కావాల్సిన ఆమె తన తండ్రి వేధింపులకు తాళలేక తనువు చాలించింది. ‘‘మా డాడీ వెరీ బ్యాడ్. అతడిని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోంది. నరకం చూపి స్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. నందిగామ మండలం బుగ్గోనిగూడకు చెందిన మొగిలిగిద్ద నర్సింహ భార్య గతేడాది చనిపోవడం తో కొడుకు శ్రవణ్ కుమార్, కూతురు మనీషా అలి యాస్ అనుషా (16)తో కలసి ఉంటున్నాడు. మనీషా చేగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతుండగా, శ్రవణ్ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ఎలక్ట్రికల్ స్టోర్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. నర్సింహ నిత్యం తాగొచ్చి కొడుకు, కూతురుతో గొడవ పడేవాడు. దీంతో శ్రవణ్ తాను పనిచేస్తున్నచోటనే నివాసం ఉంటు న్నాడు. ఇదే అదనుగా భావించిన నర్సింహ తన కూతురును మరింత వేధింపులకు గురిచేసేవాడు. తండ్రి వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపో యిన మనీషా ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది. రోజుమాదిరిగా తాగి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా పడి ఉండటంతో కొడుక్కి ఫోన్ చేశాడు. శ్రవణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి వేధింపులు భరించలేక, అవమానాలను తట్టుకోలేకనే చెల్లి ఆత్మహత్య చేసుకుందని శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. ఆత్మహత్య లేఖలో ఏముందంటే.. ఘటనాస్థలంలో లభించిన నోటుపుస్తకంలో ఆత్మ హత్యకు గల కారణాలను మనీషా స్పష్టంగా పేర్కొంది. ‘ఐ హేట్ మై డాడ్’అని నాలుగుసార్లు, మా నాన్న మంచివాడు కాదు, దరిద్రుడు, గలీజో డు. నాన్న అని పిలవడానికి కూడా చాలా అస హ్యం వేస్తోంది. నాన్నను చంపాలని ఉంది. లేదా నేనన్నా చావాలని ఉంది. ఐ యాం వెయింటింగ్ ఫర్ డెత్’ అని రాసి ఉన్న లేఖ అక్కడ లభించింది. కాగా, నిందితుడు నర్సింహను పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీకి పలువురు ముఖ్య నేతల తనయులు సై అంటున్నారు. గతంలో ఉమ్మ డి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలే కా కుండా.. ప్రస్తు తం కీలక పదవు ల్లో ఉన్న వారి తన యులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీరిలో కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. వీరితో పాటు మరికొంత మంది యువ నాయకులు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికలకు ఏడాదిపైగా ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాల్లోనే కాదు బంధువులు, కార్యకర్తలు, సామాజిక వర్గం ప్రజలు, అభిమానులు ఇలా ఎవరి ఇళ్లలో ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధిష్టానాల వద్ద పావులు కదుపుతున్నారు. మాస్ టు క్లాస్.. శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ ఈసారి ఎన్నికల్లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది క్రితం ఈయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. విద్యార్థి, యువజన నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. తరచూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాడు. అటు మాస్‌తో పాటు ఇటు క్లాస్ పీపుల్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పట్నం’పై ప్రశాంత్ కన్ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సుదీర్ఘ కాల ఎమ్మెల్యేగా పని చేయడం, వయసు మీదపడటంతో తన స్థానంలో కుమారుడిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌కు కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉంది. షాద్‌నగర్‌లో పాగా కోసం.. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు ఏపీ మిథున్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గతంలో ఆయన తండ్రి టీఆర్ఎస్ ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తండ్రితో పాటు ఆయన కూడా బీజేపీ గూటికి చేరాడు. షాద్‌నగర్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తండ్రి బాటలో రవీంద్రుడు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పెద్ద కుమారుడు వై.రవీందర్ యాదవ్ కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేశంపేట్ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి స్థానంలో తరచూ నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే.. పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా.. మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్‌రెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నారు. 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన శివారులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. బయటకు కనిపించకపోయినా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 111జీవో ఎత్తివేత అంశంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేశాడు. ఈసారైనా దీవిస్తారా.. మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి చేవేళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు. -
ఐదో రోజు ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర ఐదో రోజు ముగిసింది. ఐదోరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. కొత్తతండా, డబీల్ గూడ, మన్సాన్ పల్లి, కొత్వాల్ తండా మహేశ్వరం వరకు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు చేవెళ్ల నుంచి మహేశ్వరం వరకు 60 కిలో మీటర్లు పాదయాత్ర సాగింది. మహేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్ ఫాం హౌస్ కోసమే కాళేశ్వరం నీళ్లు అంటూ విమర్శలు గుప్పించారు. విద్యా శాఖమంత్రి ఇలాకాలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. -
ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన ఎన్టీఆర్.. ఆ భూమి కొనేందుకేనట!
Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్ పనుల కోసం ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్‌తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్‌తో పాటు రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు తారక్. త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. -
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి, ఏం జరిగిందో రెండు నెలలకే..
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని రెండు నెలలు గడవక ముందే ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రీనివాస్, కర్కల్‌పహాడ్ గ్రామానికి చెందిన సంతోష(19) పెద్దలను ఒప్పించి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీనివాస్ తన అక్కను తీసుకురావడానికి కుల్కచర్లకు వెళ్లాడు. సంతోష మామ సత్తయ్య, అత్త యాదమ్మ కూలీ పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకుని సంతోష ఆత్మహత్య చేసుకుంది. కూలీ పనులకు వెళ్లిన అత్తమామలు సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి లోపలి నుంచి తలుపులు వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారితో కలిసి తలుపులను పగులగొట్టి చూడగా సంతోష ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ ఉపేందర్, ఎస్ఐ హరిశంకర్‌గౌడ్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంతోష భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
టోలీచౌకీ వాసి దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు హైదరాబాద్ నగరంలో టోలీచౌకీకి చెందిన షేక్ సల్మాన్‌గా పోలీసులు గుర్తించారు. వైరుతో గొంతు బిగించి, తలపై రాయితో కొట్టి చంపిన ఆనవాలు కనిపిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, షేక్ సల్మాన్‌ను తానే హతమార్చానని ఓ వ్యక్తి రాయదుర్గం పోలీసులకు లొంగిపోయాడు. -
మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి మరోసారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: గత నెల నాచారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న నాగమళ్ల వెంకట నరసయ్య కేసులో వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డితో పాటు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగభూషణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్లాటును అక్రమంగా మోహన్‌రెడ్డి భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సూసైడ్ నోట్ రాసి గత నెల 28 నాచారంలోని ఓ లాడ్జిలో కరీంనగర్‌కు చెందిన వెంకట నరసయ్య ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వెంకట నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నాచారం పోలీసులు తెలిపారు. -
250 కోట్లతో మెగా డెయిరీ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థ్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పశుసం వర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల అధికారు లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ఈ మెగా డెయిరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. రూ. 18.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిపల్లి లోని 55 ఎకరాల విస్తీర్ణంలో నూతన పశు పరిశోధన కేంద్రం, కృత్రిమ గర్భధారణపై రైతులకు ఆధునిక పద్ధతులలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయా లని నిర్ణయించడం జరిగిందని, దానికి కూడా శ్రావణ మాసంలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కేంద్రం గొర్రెలు, పశుసంపద అభివృద్ధికి తోడ్పడుతుందని, పశువుల గర్భధారణ పరీక్షలలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో, కృత్రిమ గర్భధారణలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. కులవృత్తులకు చేయూత ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. గడచిన 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఈ రంగాలను పట్టించుకోలేదని మంత్రి తెలిపారు. అన్ని వసతులతో షీప్ మార్కెట్లు సీఎం ప్రత్యేక చొరవ, ఆదేశాలతో గొర్రెల పెంపకం దారులు, పాడి రైతులు, మత్స్యకారుల అభివృద్ధి కోసం వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తలసాని వివరించారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 80 కోట్ల గొర్రెలను పంపిణీ చేయగా, అవి ఇప్పుడు పిల్లలతో కలుపుకొని 2 కోట్లకు చేరాయని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని అన్నారు. ఇప్పటికే 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. జీవాలకు దాణా, మరణించిన జీవాలకు ఇన్‌స్రూ?న్స్ వర్తింపచేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నామని, నాణ్యమైన మాంసాన్ని వినియోగదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేయాలని, మొబైల్ దుకాణాల ద్వారా మాంసం అందించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. అన్ని వసతులతో కూడిన షీప్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే నల్లగొండ, సిద్దిపేట జిల్లాలో మార్కెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మం, వనపర్తిలో ఒక్కోచోట 5 ఎకరాల విస్తీర్ణంలో షీప్ మార్కెట్ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించడం జరిగిందని, వాటి నిర్మాణానికిగాను ఒక్కో దానికి రూ. 25 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 వేల నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లల విడుదలకు నిర్ణయించామని చెప్పారు. ఆక్వా హబ్ ఏర్పాటులో భాగంగా మిడ్ మానేరు డ్యాం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో 62 గ్రామాలలో సర్వే జరిపామని, ఈ సర్వేలో 3,962 మంది మత్స్యకారులు, 259 మంది భూ నిర్వాసితులను గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 2,680 మంది మత్స్యకారులు, 42 మంది భూనిర్వాసితులకు చేపలు పట్టుకోవడానికి లైసెన్స్‌లు ఇచ్చినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. -
చేగూరు జల్లెడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు, దాని చుట్టుపక్కల పల్లెలను అధికారులు శనివారం జల్లెడ పట్టారు. చేగూరుకు చెందిన మహిళ కరోనా వైరస్‌తో మృతిచెందిన నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాలతో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌శాఖ అధికారులతో కూడిన 50 బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేశాయి. చేగూరు, కన్హా శాంతివనం, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, రెడ్డి కాలనీల్లోని 2,680 మంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 767 ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరందరికీ 14 రోజుల హోం క్వారంటైన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. కన్హా శాంతివనంలో పనిచేస్తున్న 800మంది కూలీల చేతులపై హోం క్వారంటైన్ స్టాంప్‌లు వేశారు. చేగూరు గ్రామంలోకి రాకపోకలు నిరోధిస్తూ పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వారంతా క్వారంటైన్ కేంద్రాలకు.. కరోనా వైరస్‌తో మరణించిన మహిళతో 43 మంది సన్నిహితంగా మెలిగారని గుర్తించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న, ఆమె బతికున్న సమయంలో దగ్గరగా మెలిగిన, ఆమె కిరాణా దుకాణానికి వచ్చిన వినియోగదారులు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు ఆమెకు వైద్యం చేసిన ఇద్దరు ఆర్ఎంపీలు, ఒక వైద్యుడిని కూడా రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు తెలిసింది. నిర్లక్ష్యం వహిస్తే కొరడా.. మహిళ మృతికి ముందు కరోనా వ్యాధి లక్షణాలున్నా.. అధికారుల దృష్టికి తేవడంలో నిర్లక్ష్యం వహించిన ఆర్ఎంపీల తీరును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మహిళకు ప్రాథమిక చికిత్స చేసిన చేగూరులోని ఆర్ఎంపీ ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్‌లోని ఆర్ఎంపీ విఠలయ్య క్లినిక్‌లను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ అనిల్ వైద్యం చేశారు. ఈ ముగ్గురిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదుతో షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్ పట్టణంలో మెడికల్ షాపులోనే వైద్యశాల నిర్వహిస్తున్న శ్రీనివాస దంత వైద్యశాల, సాయి వెంకటరమణ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ని సీజ్ చేశారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను రెవెన్యూ లేదా వైద్యాధికారులకు ఆర్ఎంపీలు, ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకులు తెలపాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ సర్క్యులర్ జారీచేశారు. కాగా, ఇటీవల రామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవాన్ని ఇటీవల కన్హా శాంతివనంలో నిర్వహించారు. దీనికి దేశవిదేశాల నుంచి 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో వైరస్ వ్యాప్తిపై స్థానికంగా ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
అలాంటి వారిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు..
సాక్షి, శంషాబాద్: చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పల్లె పగ్రతి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల అందరికి మాట్లాడే అవకాశం రాకపోతే నాయకులెవరూ బాధపడొద్దన్నారు. సభలో మాట్లాడకపోతే అవమానంగా భావించవద్దని.. గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వారిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరూపించారు.. ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీని నియమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం అంటే ఏమిటో నేడు కేసీఆర్ నిరూపించారని పేర్కొన్నారు. గతంలో రైతులు కరెంట్ కావాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగేవారని, కానీ ఇప్పుడు కరెంట్ ఎక్కువ అయ్యిందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత అధికంగా ఉండేదన్నారు. ప్రతి గ్రామం బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని.. చట్టాన్ని ప్రతి సర్పంచ్ చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి ఉండాలన్నారు. ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం గా ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ స్థలం వద్ద పహారా
సాక్షి, షాద్‌నగర్: దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో షాద్‌నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. త్రిసభ్య కమిటీ సభ్యులు దిశను దహనం చేసిన స్థలంతో పాటు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. నవంబర్ 27న దిశను హత్య చేసిన నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును నవంబర్ 29న పోలీసులు అరెస్టు చేసి అదే రోజు రాత్రి షాద్‌నగర్‌కు తీసుకొచ్చారు. షాద్‌నగర్ కోర్టులో జడ్జి అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్‌ను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి నిందితులను 30న తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. చటాన్‌పల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్ రీకన్‌క్ష్రషన్ నిమిత్తం వారిని డిసెంబర్ 6న అర్ధరాత్రి చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీçసుకువచ్చారు. నిందితులు పోలీసులపై ఎదురుదాడికి దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నిందితులు చనిపోయిన విషయం విదితమే. అప్రమత్తమైన పోలీసులు ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిటీ షాద్‌నగర్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్ జరిగి 58 రోజులు గడుస్తున్నా ఘటనా స్ధలానికి ఎవరికి వెళ్లకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లనీయకుండా దారి మూసేశారు. పోలీసులు ప్రత్యేంగా గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ (షాద్‌నగర్): ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు ఆయన మంగళవారం హాజరై రాత్రి అక్కడే బస చేశారు. వార్షికోత్సవంలో రెండోరోజైన బుధవారం ఉదయం జరిగిన ధ్యాన కార్యక్రమంలో గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా దేవ్ మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగా సాధన చేయాలని, అప్పుడే సమాజం బాగుంటుందన్నారు. అనం తరం ఆశ్రమంలో మొక్కను నాటి, రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డుకు యోగర్షి స్వామీ రాందేవ్ మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ ధ్యాన వేడుకలకు 2వరోజు 40వేల మంది హాజరైనట్లు నిర్వహకులు తెలిపారు. -
24 రోజుల తర్వాత... అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్..
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అనంతరం 24 రోజుల తర్వాత గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. ఘటన జరిగిన భవనాన్ని ఖాళీ చేసి..నూతన భవనంలో కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే ఈ నెల 4వ తేదీన హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం కార్యాలయం మూతపడింది. నేడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. చదవండి: మహిళా తహసీల్దార్ సజీవ దహనం తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్‌డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి
సాక్షి, చేవెళ్ల: టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని, ఇందుకు మంత్రి ఈటల రాజేందర్ మాటలే నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని పలుగుట్ట, దేవునిఎర్రవల్లి, ఊరేళ్ల గ్రామాల్లో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రఘునందన్‌రావుతోపాటు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, కంజర్ల ప్రకాశ్ తదితరులు ముఖ్యఅతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను అవిష్కరించి పార్టీ సభ్యత్వాలను అందజేశారు. ఈసందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ భారతీయ పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని నరేంద్రమోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే పిరంగులై పేలి కేసీఆర్ కొంపముంచడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా దేవునిఎర్రవల్లి, ఊరేళ్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున యవుకులు బీజేపీ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విఠల్‌రెడ్డి. ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్, పద్మానాభం, రాములు, పాండురంగారెడ్డి, కుంచం శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, కావాలి శ్రీనివాస్, గాంధీ, సత్యనారాయణ, సత్యం, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని రాజకీయ పెద్దలే గద్దలుగా భోంచేశారు. 170 మంది రైతులకు రూ.60.20 కోట్ల పరిహారం అందజేయగా.. ఇందులో సుమారు రూ.4 కోట్ల వరకు అనర్హుల పేర్లతో మెక్కేశారు. ఇప్పటికే 15 మంది రూ.2.6 కోట్లు అక్రమంగా నొక్కినట్లు యంత్రాంగం గుర్తించి వివరణ కోసం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదిగాక మరో రూ.2 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఎవరెవరికి.. ఎంత దక్కిందనేది విచారణలో తేలనుంది. స్థానిక సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, మాజీ సర్పంచ్‌లు జట్టుగా ఏర్పడి కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. మరణించిన మాజీ సైనికుడి పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని సర్పంచ్ సోదరుడు కొలాన్ సుధాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా రూ.45 లక్షల పరిహారాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది. సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పదేళ్ల తర్వాత సదరు భూమిని విక్రయించుకునే వీలుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా యంత్రాంగం జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉండాలి. ఎన్ఓసీ లేకుండానే ఎలా కొనుగోలు చేశారన్నది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందన్న అంశంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. అంతేగాక అసలు భూమి లేకున్నా చాలా మంది పేర్లు డిక్లరేషన్ జాబితాలో చేర్చి పరిహారం పొందారు. కాగా, తమకు న్యాయం జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడంతోపాటు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనప్రదర్శన చేశారు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. షాబాద్ (చేవెళ్ల): చందనవెళ్లి భూముల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై బాధిత రైతులు షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి పరిహారాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారని వివరించారు. చందనవెల్లి ప్రస్తుత సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, కొలన్ సుధాకర్‌రెడ్డి, శ్రీలత, బషీర్, వెంకటయ్యలపై సీఐ నర్సయ్యకు బాధిత రైతులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజు, జరినాబేగం, ఎ.సత్తమ్మ, అజహర్ ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు తెలియకుండా సర్పంచ్ కుటుంబీకులు పొందారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని గత 26 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. బాధితులకు తెలియకుండానే వారి చెక్కులను మద్యవర్తులు మార్చుకుని తమ ఖాతాల్లో వేసుకున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రూ.12లక్షలను మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటయ్య తన ఖాతాలో వేసుకుని డబ్బులు ఇవ్వనని బెదిరించాడని జరినాబేగం ఫిర్యాదులో పేర్కొంది. చందనవెల్లి భూముల పరిహారంలో జరిగిన అక్రమాలపై సరైన విచారణ జరిపించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కలెక్టర్, తన పైఅధికారు దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
చేప విత్తనాలు.. కోటి
సాక్షి, రంగారెడ్డి: చెరువులు, కుంటల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలు వేసేందుకు జిల్లా మత్స్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ సారి కోటి విత్తనాలను చెరువుల్లో వదలాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించుకుంది. చేప పిల్లల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. భారీ వర్షాలు కురిసి చేరువుల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప విత్తనాలను వందశాతం సబ్సిడీపై ఇస్తున్నారు. జిల్లాలో 90 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. వీటి పరిధిలో 5వేల మంది మత్స్యకారులు నమోదయ్యారు. సగం నీళ్లుంటేనే.. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో 116, పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 250 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలోకి నీరు చేరగానే మత్స్యశాఖ అధికారులు పరిశీలిస్తారు. చేప విత్తనాలు వదలడానికి.. చెరువుల్లో కనీసం 50 శాతం నీళ్లు ఉండాలి. ఇలా ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. సుదీర్ఘకాలం సరిపడా నీరు ఉంటేనే పిల్లలు ఎదుగుతాయి. ఇలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటి పరిమాణానికి అనుగుణంగా చేప విత్తనాలను వేస్తారు. ఏదేని చెరువులో విత్తనాలు వదలాలంటే స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుల అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధించిన తీర్మానం తీసుకున్నాకే అధికారులు విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. రెండో వారంలో శ్రీకారం.. ఈనెల 15వ తేదీలోపు జిల్లాలో కొన్ని చెరువుల్లో విత్తనాలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్, కోకాపేట, మదీనాగూడ తదితర పది చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత వీటిలో ముందుగా విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా వర్షాలు భారీగా కురిస్తే మిగిలిన చెరువుల్లోనూ వదులుతారు. కైకలూరు నుంచి విత్తనాలు.. కొన్ని రోజుల క్రితమే విత్తనాల టెండర్ పూర్తికాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. విడతల వారీగా కోటి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను రూ.60 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. 35 నుంచి 40 మి.మీ పరిమాణం గల చేప విత్తనానికి 52.50 పైసలు చొప్పున, 80 నుంచి 100 మి.మీ ఉన్న విత్తనాన్ని ఒక రూపాయి 19 పైసలకు చొప్పున సరఫరా చేయనున్నారు. నాలుగు రకాల విత్తనాలు.. ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు రకాల విత్తనాలను వేయనున్నారు. బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మోసు రకాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్ చెరువులు, ఎల్లప్పుడు నీటి లభ్యత గల చెరువులుగా విభజిస్తారు. సీజనల్ చెరువుల్లో కనీసం ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇటువంటి చెరువుల్లో బొచ్చ, రవ్వ, బంగారుతీగ విత్తనాలను 35:35:30 నిష్పత్తిలో వదులుతారు. వీటి సైజు 35 నుంచి 40 మిల్లీమీటర్లు ఉంటుంది. 9 నెలలపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో బొచ్చ, రవ్వ, మోసు రకాల విత్తనాలను 40:50:10 నిష్పత్తిలో వేస్తారు. ఇవి 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. వేసిన ఆరు నుంచి 8 నెలల్లోపు ఇవి ఎదుగుతాయి. సైజు.. చెరువును బట్టి చెరువు రకం, చేప విత్తనాలను బట్టి చెరువుల్లో వదిలే విత్తనాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. చెరువు విస్తీర్ణంలో 50 శాతం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. సీజనల్ వారీగా నీరు లభ్యత ఉండే చెరువుల్లో ఎకరానికి తక్కువ సైజు ఉన్న 3వేల చేప విత్తనాలను వదులుతారు. ఎక్కువకాలం నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ సైజు గల విత్తనాలను ఎకరానికి 2వేలు వేస్తారు. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది జిల్లాకు అవసరమైన కోటి చేప విత్తనాలను సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. టెండర్లు దక్కిన వారి నుంచి ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. చెరువుల్లోకి నీరు చేరగానే.. సానుకూలతను బట్టి విత్తనాలను వేస్తాం. విత్తనాలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే.. మత్స్యకారులకు ఈ ఏడాది మంచి రోజులు వచ్చినట్లే. – సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి -
అప్పు తీర్చలేకే హత్య
సాక్షి, ఇబ్రహీంపట్నం: అప్పు ఇచ్చిన వ్యక్తిని అతి కిరాతకంగా అంతమొందించాడో ఓ కిరాతకుడు. హత్య చేసి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. హత్య కేసును యాచారం పోలీసులు ఛేదించి, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడ్తాల్ మండలం పల్లెచెల్కతండాకు చెందిన జెర్పుల బిచ్చానాయక్(40) ఎల్బీనగర్ సమీపంలోని గాంధీనగర్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కిట్టిగౌరి రవి(33) గత కొన్నేళ్ళుగా ఎల్బీనగర్లోని శివమ్మనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రవి కూడా ఆటో నడుపుతూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. గత రెండేళ్ల క్రితం బిచ్చానాయక్, రవిల మధ్య పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరి నెలలో రవి వద్ద బిచ్చానాయక్ రూ. 3లక్షల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తేస్తుండటంతో.. రవిని ఎలాగైనా అంతమొందించాలని బిచ్చానాయక్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న రవికి మద్యం తాగించి హత్య చేయాలని వేసిన పథకం విఫలమైంది. దీంతో 21వ తేదీన హత్యకు మరోసారి పథకం రూపొందించాడు. దీని ప్రకారం కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని తిరుమల వైన్స్‌లో రవికి బిచ్చానాయక్ మద్యం తాగించాడు. అక్కడి నుంచి సాగర్‌రింగ్‌రోడ్డులోని ఓంకార్ నగర్‌కు ఆటోలో తీసుకొచ్చి మద్యం మత్తులో ఉన్న రవి తలపై రాయితో దాడి చేసి, నైలాన్ తాడును మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని కుర్మిద్దకు తీసుకువచ్చి.. హత్య చేసిన అనంతరం రవి మృతదేహాన్ని యాచారం మండలం కుర్మిద్ద గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంగా ఉండే తాటికుంట మైసమ్మ టెంపుల్ దారిలో పడేసిన బిచ్చానాయక్ పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అక్కడి నుంచి నగరంలోని చంద్రాయణగుట్ట ఆటో గ్యారేజిలో ఆటోను పార్కు చేసి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్న యాచారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే సమయంలో ఎల్బీనగర్ పీఎస్‌లో 21వ తేదీ నుంచి రవి కనిపించడంలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కుటుంబసభ్యులు హత్యకు గురైన వ్యక్తి రవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా హత్య చేసిన అనంతరం సొంత గ్రామం పల్లెచల్కతండాకు పారిపోయిన బిచ్చానాయక్‌ను æపట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా రవిని తానే హత్యచేసినట్లు బిచ్చానాయక్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బిచ్చానాయక్‌ను యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన రవికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. -
‘ఎస్ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’
సాక్షి, రంగారెడ్డి : 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారనే ఆవేదనతో.. జంగయ్య అనే రైతు మంగళవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. పాల్గుట్ట గ్రామనికి చెందిన రైతు జంగయ్య తన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాక తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. భూమి దగ్గరకు వెళ్లకుండా ఎస్ఐ రేణుకా రెడ్డి తనను బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి తనకు దక్కదనే భయంతో ఆర్డీవో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు జంగయ్య. -
‘వాల్మీకి’ సినిమా టైటిల్ మార్చాలి
సాక్షి, తాండూరు: వాల్మీకి మహర్షి పేరును ఓ ఫ్యాక్షన్ సినిమాకు పెట్టడం సరికాదని, వెంటనే సినిమా టైటిల్ మార్చాలని తాండూరు వాల్మీకి సంఘం నాయకులు ఆదివారం తాండూరు డీఎస్పీ రామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. వాల్మీకి సినిమా టైటిల్ ఉపయోగించి ఫ్యాక్షన్ సినిమాను తీస్తున్న తెలుగు సినిమా డైరక్టర్, హీరో, నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్మీకి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమిళ సినిమా ‘జిగర్తాండ’ను తెలుగులో అనువాదం చేస్తున్నారని, సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ తో ఉందని, ఇలాంటి సినిమాకు వాల్మీకి మహర్షి పేరు పెట్టడం సరికాదన్నారు. వెంటనే సినిమా పేరు మార్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కథలప్ప, నర్సింలు, తిరుపతి, మహేష్ బోయ లక్ష్మణ్, బోయ అశోక్‌కుమార్, గోపాల్, అనిల్ తదితరులున్నారు. -
ఆవిరైన ఆశలు
షాద్‌నగర్‌రూరల్: కన్న కూతురుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు.. విద్యాబుద్దులు నేర్చి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలుస్తుందని కలలు కన్నారు.. కానీ ఆ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భవిష్యత్తును తేల్చే పరీక్షలను రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబలించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శనివారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకంది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండలం పర్వతాపూర్‌కు చెందిన మంగలి శ్రీనివాసులు, అనురాధ దంపతుల కూతురు మంగలి స్రవంతి(17) షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ పర్వతాపూర్ నుంచి షాద్‌నగర్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా శనివారం విశ్వభారతీ జూనియర్ కళాశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాలనీ మీదుగా బస్టాండ్‌కు బయలుదేరింది. మోర్ సూపర్ మార్కెట్ ఎదుట నుంచి ఆర్టీసీ కాలనీకి వెళ్లే మార్గంలో ఇనుప రాడ్డులతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యార్థిని స్రవంతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇనుప లోడుతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ స్రవంతి తలపై నుంచి వెళ్లడంతో తల పూర్తిగా చిట్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్రవంతి మృతదేహన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
పొట్టకూటికొచ్చి ప్రాణాలొదిలారు
ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబాలను పోషించాల్సిన కుటుంబ పెద్దలు రైస్‌మిల్ యాజమానుల నిర్లక్ష్యానికి ఇద్దరు కూలీలు బలయ్యారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైస్‌మిల్లులో గోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ప్రమాదానికి సం బంధించి ప్రత్యక్షసాక్షుల, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామా నికి చెందిన గిరమోని శ్రీనివాస్(40), కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన గౌర బీరప్ప(42). వీరిద్దరూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధిలో గల శ్రీలక్ష్మీ గణపతి రైస్‌మిల్లులో హమాలీలుగా పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రోజుమాదిరిగానే శుక్రవారం ఉదయం పనికోసం రైస్‌మిల్ వద్దకు వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో మిల్లోంచి వస్తున్న బియ్యాన్ని తొ క్కుతుండగా బియ్యం ఆపేందుకు అడ్డంగా కట్టిన గోడ కూలిపోయింది. గోడ కూలడంతో శ్రీనివాస్, బీరప్పలు బియ్యంలో మునిగిపోయారు. దీంతో గమనించిన తోటివారు ఆరగంట పాటు శ్రమించి బియ్యంలో కూరుకుపోయిన ఇద్దరిని బయటకు తీశారు. అప్పటికే వీరిద్దరి పరిస్థితి విషమించడం తో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించా రు. గోడ కూలి బియ్యంలో పడి ప్రమాదానికి గురయ్యారనే సమాచారం యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మృతులిద్దరికీ భార్య, పిల్లలున్నారు. మృతుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకోవాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, సీపీఎం నాయకులు పగడాల యాదయ్య, సీఐటీయూ నాయకులు బడ్డు నర్సింహా, జగదీష్‌లు డిమాండ్ చేశారు. సాగర్‌రోడ్డుపై రాస్తారోకో.. ఇద్దరు హమాలీల కుటుంబాలకు న్యాయం చేయాలని శనివారం ఉదయం రైస్‌మిల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం వరకు యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు ఒక్కసారిగా సాగర్‌రోడ్డుపై మండుటెండలో రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల సీఐలు స్వామి, గోవింద్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పే సమయంలో కూలీలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతిపరిచారు. సాగర్రహదారిపై రాస్తారోకో చేస్తున్న కూలీలు -
చిన్నారులను మింగిన నీటిగుంత
మహేశ్వరం : నీటి నిల్వ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దుబ్బచర్ల గ్రామానికి చెందిన బండ శ్రీశైలం, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నీటి నిల్వ కోసం పొలం వద్ద పెద్ద గుంత తీసి బోరు నీటిని నింపుతున్నారు. పాఠశాలలకు సెలవు కావడంతో తల్లి లక్ష్మీతో కలిసి కుమారులు బండ చరణ్‌తేజ(9), జశ్వంత్(7), మణి(5)లు పొలం వద్దకు వెళ్లారు. తల్లి గొర్రెలను పొలం వద్ద మేపుతుండగా చిన్నారులు ఇద్దరు కాళ్లు చేతులు కడుక్కునేందుకు గుంత వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడిపోయారు. వీరిలో చిన్నవాడు ఇద్దరు అన్నలు గుంతలో పడిన విషయాన్ని చూసి భయంతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెప్పాడు. వెంటనే తల్లి నీటిగుంత వద్ద వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు నీటి మునిగి దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని భర్త శ్రీశైలం, గ్రామస్తులకు తెలపడంతో సంఘటన స్థలానికి గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. గ్రామంలో విషాదఛాయలు.. ఇద్దరి చిన్నారులు నీటిగుంతలో పడి మరణిం చడంతో తల్లిదండ్రులు, బంధువులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరున విలపించా రు. విషయం తెలుసుకున్న మహేశ్వరం పోలీసు లు గ్రామానికి చేరుకొని ఇద్దరి మృతికి గల కారణాలను బాధిత తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారు తవ్విన గుంతలో వారి పిల్లలు ప డి దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీటి గుంతలో పడి చనిపోవడం విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల ను పీసీసీ సభ్యుడు కొరుపోలు రఘుమారెడ్డి, గ్రా మ సర్పంచ్ కోమటమ్మ, నాయకులు హనుమానాయక్, బాలరాజ్ పలువురు మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అనంతగిరి : జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్‌నగర్‌కు చెందిన నాగేందర్‌రెడ్డి(22) బెంగుళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా గత రెండు సంవత్సరాలు క్రితం తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరిగా మానసికంగా కుంగిపోయిన నాగేందర్‌రెడ్డి ఉద్యోగం చేయడం ఆసక్తి లేదని కొద్దిరోజుల క్రితం ఫోన్ ద్వారా తాతకు సమాచారం అందించాడు. ఈ నెల 9న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు ఎంతకీ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వికారాబాద్‌లోని లాలాగూడ సమీపంలోని బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి తాత నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
పరీక్షలో ఒకరి స్థానంలో మరొకరు
పెద్దఅంబర్‌పేట : వేర్వేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న బీటెక్ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథ«నం ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన అరుణ్‌కుమార్, ఒడిషాకు చెందిన దుర్గాచరణ్ మిశ్రా దేశ్‌ముఖ్‌లోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. అయితే, అరుణ్‌కుమార్‌కు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తాజాగా జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు అవంతి ఇంజనీరింగ్ కశాశాలలో రాస్తున్నాడు. మంగళవారం జరిగిన పరీక్షకు అరుణ్‌కుమార్ స్థానంలో అతని స్నేహితుడు దుర్గాచరణ్మిశ్రా హాజరయ్యాడు. గమనించిన ఇన్విజిలేర్ అతన్ని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో ఇద్దరు... బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్, మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. అయితే మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ తృతీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు తప్పాడు. అయితే, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ స్థానంలో రాహుల్ వచ్చాడు. అతడిని పట్టుకున్న ఇన్విజిలేటర్లు పోలీసులకు అప్పగించారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. -
కల్యాణం.. కమనీయం
సాక్షి, రంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చూడముచ్చటైన సీతారాముల జంటను చూడటానికి చిన్నాపెద్దా తరలివచ్చారు. పూజారులు స్వామివార్లను పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. సీతమ్మవారికి తాళి బొట్టు కట్టే సమయం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. మేళతాళాలతో ఆ అందమైన దృశ్యాన్ని చూసి తరించారు. చలువ పందిళ్ల నీడలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తృప్తి పొందారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ఆలయ పూజారులు సీతారాముల కథను కళ్లకు కట్టినట్టుగా వినిపించారు. రామాయణంలోని కీలక ఘట్టాలను భక్తుల ముందు ఆవిష్కరింపజేశారు. -
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
-
ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
రారా..కృష్ణయ్య..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బలమైన సామాజికవర్గం నేతలపై కాంగ్రెస్ కన్నేసింది. ఫలించిన గుజరాత్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిన పార్టీ ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాల నాయకులతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ తాజాగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కూడా సంప్రదించినట్లు తెలిసింది. 2014 ఎన్నికల సమయంలో రాజకీయ అరంగ్రేటం చేసిన కృష్ణయ్య ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. టీడీపీ శిబిరం దాదాపుగా ఖాళీ కాగా.. కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ గూటికి చేరినా..ఆయన మాత్రం సాంకేతికంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. బలహీనవర్గాల్లో గట్టి పట్టున్న కృష్ణయ్యతో చేతులు కలపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అంతేగాకుండా.. ఇటీవల ఆ పార్టీ అంతర్గత సర్వేలలోను కృష్ణయ్యకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నట్లు తేలింది. మూడు నెలల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో సామాజిక సమీకరణలు బాగా పనిచేసినందున.. ఇదే సిద్ధాంతాన్ని మన రాష్ట్రంలోను అమలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల్లో బలమైన నేతలుగా పేరెన్నికగన్న నేతలకు గాలం వేస్తోంది. కుంతియా మంతనాలు..! ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర కాంగ్రెస్ వ్వవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఇటీవల కృష్ణయ్యను కలుసుకొని సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తమతో చేతులు కలిపితే బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగైనందున.. కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో బీసీలను ఏకతాటి మీదకు తేవడం ద్వారా బీజేపీ గట్టి పోటీ ఇచ్చామని, ఇదే ఎత్తుగడ తెలంగాణలోను అవలంభిస్తామని కుంతియా స్పష్టం చేశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం తమ పార్టీలో లేదని, ముందే ప్రకటిస్తే.. మొదట్నుంచి పార్టీని ఆదరిస్తున్న బలమైన సామాజికవర్గం దూరమయ్యే అవకాశముందని కూడా చెప్పినట్లు సమాచారం. రాజ్యసభ సీటు వద్దనుకుంటే చేవెళ్ల లోక్‌సభను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కుంతియా ఆఫర్లపై నోరుమెదపని కృష్ణయ్య.. కాంగ్రెస్‌లో చేరే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతనివ్వలేదని సమాచారం. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
రంగా రెడ్డి : మంచాల మండలం ఎల్లమ్మతండాలో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అఖిల ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఆరు నెలలుగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు, అఖిలతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ వ్యవహారం ఇరుపక్షాల తల్లిదండ్రులకు నాలుగు రోజుల క్రితం తెలిసింది. పెళ్లి చేసేందుకు రూ.6 లక్షల కట్నకానుకలు ఇవ్వాలని అబ్బాయి తరపు తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అంతా మాట్లాడుకున్న తర్వాత శ్రీకాంత్, అఖిలకు ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇస్తే గానీ మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకునేలా లేరని, ఇద్దరం పురుగుల మందు తాగి చనిపోదామని ఫోన్ చేసి చెప్పాడు. ఇద్దరూ చనిపోదామని నిర్ణయించుకుని ఇంట్లో పురుగుల మందు తాగారు. ఇద్దరినీ ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
ఐదు నెలల చిన్నారి కిడ్నాప్
రంగారెడ్డి, శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : రక్తం పంచుకు పుట్టిన ఆ చిన్నారి తల్లిదండ్రులకు భారమైంది.. పుట్టిన 10 రోజులకే పరాయి మహిళ ఒడికి చేరింది.. అక్కడి నుంచి మరో తల్లి ఒడికి.. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆ చిన్నారిని తీసుకొని ఓ వ్యక్తితో కలిసి పరారైంది.. రెండు రోజులుగా పోలీసులు చిన్నారి జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలం నాగారం పంచాయతీ అనుబంధ గ్రామం పెద్దతండాకు చెందిన కేతావత్ మోహన్, జ్యోతి దంపతులకు మే 24న కూతురు పుట్టింది. కూలి పని చేసుకునే ఈ దంపతులకు అప్పటికే ఓ కూతురు ఉండగా.. రెండో సారి పుట్టిన కూతురును పోషించే స్తోమత, ఆసక్తి లేకుండా పోయాయి. ఈ క్రమంలో జ్యోతి తండ్రి హన్మ కూరగాయలు అమ్మడానికి శంషాబాద్ మార్కెట్‌కు వచ్చే తరుణంలో అక్కడ కూరగాయాల వ్యాపారం చేసే చారి నగర్ వాసి రాణితో పరిచయం ఏర్పడింది. తన కూతురు జ్యోతికి పుట్టిన చిన్నారిని ఎవరైనా పెంచుకుంటే ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో పది రోజులకు ఆ చిన్నారిని రాణికి ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. పట్టణంలోని కాపుగడ్డ బస్తీలో నివాసముండే రాణి అమ్మగారి ఇంటి పక్కన పద్మ అనే మహిళ అమ్మగారు ఇల్లు ఉంది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో నివాసముండే పద్మకు పిల్లలు లేరు. దీంతో ఈ చిన్నారిని పెంచుకుంటానని చెప్పడంతో రాణి ఆ పాపను వారికి ఇచ్చేసింది. కాపుగడ్డలోనే తల్లిగారింటి వద్ద ఉంటూ నెల రోజుల పాటు పద్మ ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకుంది. అయితే పద్మ ఆరోగ్యం, మానసిక ప్రవర్తన బాగా లేకపోవడంతో చిన్నారిని సాకడానికి వీలుకాదని నెల కిందట రాణికి ఇచ్చేశారు. అçప్పటి నుంచి రాణి వద్దనే ఉంటున్న చిన్నారికి షైని అనే పేరు పెట్టి బాగోగులు చూస్తుంది. దసరా పండగ సందర్భంగా రాణి చిన్నారిని తీసుకుని వారం కిందట సిద్దంతిలోని తన అక్క విజయం ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నందిగామ మండలం మేకగూడలో ఉండే పద్మ చెల్లెలు హంసకు రాణితో ఉన్న పరిచయంతో సెప్టెంబరు 29న సిద్దంతిలోని విజయం ఇంటికి వచ్చింది. పాపకు పండగ కోసం కొత్త దుస్తులు ఇప్పిస్తానని చెప్పగా.. విజయ తన కూతురు హైనాను తోడుగా ఇచ్చి స్కూటీపై పంపించింది. కొద్ది దూరం వెళ్లగానే వర్షం పడుతుండడంతో.. ఇక్కడ రోడ్డుపై అన్ని గుంతలు ఉన్నాయి.. స్కూటీపై వెళ్లడం కష్టం కదా.. నేను పాపను ఎత్తుకుని వస్తాను.. నీవు వెళ్లి షాపు వద్ద నిలబడు అని హంస చెప్పడంతో హైనా వీరిని వదిలేసి షాపు వద్దకు వెళ్లింది. ఎంతకీ హంస షాపు వద్దకు రాకపోవడంతో ఇంటికి వచ్చి విషయం చెప్పింది. వెంటనే వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగలు, నగదు మాయం.. చిన్నారితో పరారైన హంస తన అత్తగారింట్లో నుంచి 25 తులాల బంగారు నగలు, రూ.25వేల నగదును తీసుకొన్ని వెళ్లిందని ఆమె భర్త అంజయ్య చెబుతున్నాడు. తన కూతురు పెళ్లి కోసం భూమి అమ్మి నగలు కొన్నామని, దసరా బోనస్‌గా వచ్చిన డబ్బులను ఇంట్లోని అల్మారాలో భద్రపర్చానని చెప్పాడు. తనకు తెలియకుండా భార్య ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయిందని అంజయ్య పోలీసులకు వివరించాడు. మరో వైపు బుద్వేల్‌కు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తితో కలిసి చిన్నారిని తీసుకుని హంస వెళ్లిపోయినట్లు తెలిసింది. ఫోన్లు స్విచ్ఆఫ్.. చిన్నారిని తీసుకెళ్లిన హంస, చంద్రకాంత్‌ల సెల్ఫోన్లు స్విచ్ఆఫ్ అయిపోయాయి. దీంతో పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం సవాలుగా మారింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారించి కేసు పురోగతి సాధించడానికి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ముగ్గురి మృతి
సాక్షి, హైదరాబాద్: మోటార్ సైకిల్‌పై వేగంగా వస్తూ డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం..ఉపేందర్ (23), మోహిన్ (35), జకీర్ (40)లు స్నేహి తులు. వీరు టైలరింగ్ పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం బైక్‌పై చాంద్రా యణగుట్ట నుంచి దుర్గానగర్ చౌరస్తా వైపు వస్తుండగా ముత్తూట్ ఫైనాన్స్ వద్ద డివైడర్ పైనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఉపేందర్ అక్కడికక్కడే చనిపోగా, మోహిన్, జకీర్‌లు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఉపేందర్‌కు పుట్టుకతోనే పోలియోతో కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇతర పనులు చేయలేని క్రమంలో టైలరింగ్ వృత్తినే ఎంచుకొని బిహార్ రాష్ట్రం నుంచి వచ్చి బాబుల్‌రెడ్డినగర్‌లో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. ఉస్మానియా ఆస్పత్రి లో పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ మృతదేహాన్ని బిహార్‌కు తరలించారు. మోహిన్, జకీర్ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
బైక్ కొనివ్వలేదని తల్లిని చంపేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని రామయ్య గూడలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. బైకు అడిగితే కొనివ్వలేదని ఓ యువకుడు ఆగ్రహించి కన్నతల్లిపై కర్రతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి మరణించింది. దాంతో ఆమె కుమారుడు అక్కడి నుంచి పరారైయాడు. స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.