అప్పు తీర్చలేకే హత్య  | Police Department Find Dead Body In Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చలేకే హత్య 

Published Fri, Aug 2 2019 11:10 AM | Last Updated on Fri, Aug 2 2019 12:09 PM

Police Department Find Dead Body In Ibrahimpatnam - Sakshi

రవి మృత దేహం , వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ యాదగిరిరెడ్డి, చిత్రంలో యాచారం సీఐ మధు

సాక్షి, ఇబ్రహీంపట్నం: అప్పు ఇచ్చిన వ్యక్తిని అతి కిరాతకంగా అంతమొందించాడో ఓ కిరాతకుడు. హత్య చేసి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. హత్య కేసును యాచారం పోలీసులు ఛేదించి, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు. కడ్తాల్‌ మండలం పల్లెచెల్కతండాకు చెందిన జెర్పుల బిచ్చానాయక్‌(40) ఎల్బీనగర్‌ సమీపంలోని గాంధీనగర్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కిట్టిగౌరి రవి(33) గత కొన్నేళ్ళుగా ఎల్బీనగర్‌లోని శివమ్మనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

రవి కూడా ఆటో నడుపుతూ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. గత రెండేళ్ల క్రితం బిచ్చానాయక్, రవిల మధ్య పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరి నెలలో రవి వద్ద బిచ్చానాయక్‌ రూ. 3లక్షల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తేస్తుండటంతో.. రవిని  ఎలాగైనా అంతమొందించాలని బిచ్చానాయక్‌ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న రవికి మద్యం తాగించి హత్య చేయాలని వేసిన పథకం విఫలమైంది. దీంతో 21వ తేదీన హత్యకు మరోసారి పథకం రూపొందించాడు. దీని ప్రకారం కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలోని తిరుమల వైన్స్‌లో రవికి బిచ్చానాయక్‌ మద్యం తాగించాడు. అక్కడి నుంచి సాగర్‌రింగ్‌రోడ్డులోని ఓంకార్‌ నగర్‌కు ఆటోలో తీసుకొచ్చి మద్యం మత్తులో ఉన్న రవి తలపై రాయితో దాడి చేసి, నైలాన్‌ తాడును మెడకు బిగించి హత్య చేశాడు.
 
మృతదేహాన్ని కుర్మిద్దకు తీసుకువచ్చి.. 
హత్య చేసిన అనంతరం రవి మృతదేహాన్ని యాచారం మండలం కుర్మిద్ద గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంగా ఉండే తాటికుంట మైసమ్మ టెంపుల్‌ దారిలో పడేసిన బిచ్చానాయక్‌ పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అక్కడి నుంచి నగరంలోని చంద్రాయణగుట్ట ఆటో గ్యారేజిలో ఆటోను పార్కు చేసి వెళ్లిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్న యాచారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే సమయంలో ఎల్బీనగర్‌ పీఎస్‌లో 21వ తేదీ నుంచి రవి కనిపించడంలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కుటుంబసభ్యులు హత్యకు గురైన వ్యక్తి రవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా హత్య చేసిన అనంతరం సొంత గ్రామం పల్లెచల్కతండాకు పారిపోయిన బిచ్చానాయక్‌ను æపట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా రవిని తానే హత్యచేసినట్లు బిచ్చానాయక్‌ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బిచ్చానాయక్‌ను యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన రవికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement