ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బలమైన సామాజికవర్గం నేతలపై కాంగ్రెస్ కన్నేసింది. ఫలించిన గుజరాత్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిన పార్టీ ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాల నాయకులతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ తాజాగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కూడా సంప్రదించినట్లు తెలిసింది. 2014 ఎన్నికల సమయంలో రాజకీయ అరంగ్రేటం చేసిన కృష్ణయ్య ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టారు.
ఆ తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. టీడీపీ శిబిరం దాదాపుగా ఖాళీ కాగా.. కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్ గూటికి చేరినా..ఆయన మాత్రం సాంకేతికంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. బలహీనవర్గాల్లో గట్టి పట్టున్న కృష్ణయ్యతో చేతులు కలపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
అంతేగాకుండా.. ఇటీవల ఆ పార్టీ అంతర్గత సర్వేలలోను కృష్ణయ్యకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నట్లు తేలింది. మూడు నెలల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో సామాజిక సమీకరణలు బాగా పనిచేసినందున.. ఇదే సిద్ధాంతాన్ని మన రాష్ట్రంలోను అమలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల్లో బలమైన నేతలుగా పేరెన్నికగన్న నేతలకు గాలం వేస్తోంది.
కుంతియా మంతనాలు..!
ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర కాంగ్రెస్ వ్వవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా ఇటీవల కృష్ణయ్యను కలుసుకొని సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తమతో చేతులు కలిపితే బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగైనందున.. కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో బీసీలను ఏకతాటి మీదకు తేవడం ద్వారా బీజేపీ గట్టి పోటీ ఇచ్చామని, ఇదే ఎత్తుగడ తెలంగాణలోను అవలంభిస్తామని కుంతియా స్పష్టం చేశారు.
పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం తమ పార్టీలో లేదని, ముందే ప్రకటిస్తే.. మొదట్నుంచి పార్టీని ఆదరిస్తున్న బలమైన సామాజికవర్గం దూరమయ్యే అవకాశముందని కూడా చెప్పినట్లు సమాచారం. రాజ్యసభ సీటు వద్దనుకుంటే చేవెళ్ల లోక్‌సభను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కుంతియా ఆఫర్లపై నోరుమెదపని కృష్ణయ్య.. కాంగ్రెస్‌లో చేరే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతనివ్వలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment