సాక్షి, రంగారెడ్డి: చెరువులు, కుంటల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలు వేసేందుకు జిల్లా మత్స్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ సారి కోటి విత్తనాలను చెరువుల్లో వదలాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించుకుంది. చేప పిల్లల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. భారీ వర్షాలు కురిసి చేరువుల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప విత్తనాలను వందశాతం సబ్సిడీపై ఇస్తున్నారు. జిల్లాలో 90 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. వీటి పరిధిలో 5వేల మంది మత్స్యకారులు నమోదయ్యారు.
సగం నీళ్లుంటేనే..
జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో 116, పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 250 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలోకి నీరు చేరగానే మత్స్యశాఖ అధికారులు పరిశీలిస్తారు. చేప విత్తనాలు వదలడానికి.. చెరువుల్లో కనీసం 50 శాతం నీళ్లు ఉండాలి. ఇలా ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. సుదీర్ఘకాలం సరిపడా నీరు ఉంటేనే పిల్లలు ఎదుగుతాయి. ఇలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటి పరిమాణానికి అనుగుణంగా చేప విత్తనాలను వేస్తారు. ఏదేని చెరువులో విత్తనాలు వదలాలంటే స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుల అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధించిన తీర్మానం తీసుకున్నాకే అధికారులు విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు.
రెండో వారంలో శ్రీకారం..
ఈనెల 15వ తేదీలోపు జిల్లాలో కొన్ని చెరువుల్లో విత్తనాలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్, కోకాపేట, మదీనాగూడ తదితర పది చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత వీటిలో ముందుగా విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా వర్షాలు భారీగా కురిస్తే మిగిలిన చెరువుల్లోనూ వదులుతారు.
కైకలూరు నుంచి విత్తనాలు..
కొన్ని రోజుల క్రితమే విత్తనాల టెండర్ పూర్తికాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. విడతల వారీగా కోటి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను రూ.60 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. 35 నుంచి 40 మి.మీ పరిమాణం గల చేప విత్తనానికి 52.50 పైసలు చొప్పున, 80 నుంచి 100 మి.మీ ఉన్న విత్తనాన్ని ఒక రూపాయి 19 పైసలకు చొప్పున సరఫరా చేయనున్నారు.
నాలుగు రకాల విత్తనాలు..
ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు రకాల విత్తనాలను వేయనున్నారు. బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మోసు రకాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్ చెరువులు, ఎల్లప్పుడు నీటి లభ్యత గల చెరువులుగా విభజిస్తారు. సీజనల్ చెరువుల్లో కనీసం ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇటువంటి చెరువుల్లో బొచ్చ, రవ్వ, బంగారుతీగ విత్తనాలను 35:35:30 నిష్పత్తిలో వదులుతారు. వీటి సైజు 35 నుంచి 40 మిల్లీమీటర్లు ఉంటుంది. 9 నెలలపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో బొచ్చ, రవ్వ, మోసు రకాల విత్తనాలను 40:50:10 నిష్పత్తిలో వేస్తారు. ఇవి 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. వేసిన ఆరు నుంచి 8 నెలల్లోపు ఇవి ఎదుగుతాయి.
సైజు.. చెరువును బట్టి
చెరువు రకం, చేప విత్తనాలను బట్టి చెరువుల్లో వదిలే విత్తనాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. చెరువు విస్తీర్ణంలో 50 శాతం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. సీజనల్ వారీగా నీరు లభ్యత ఉండే చెరువుల్లో ఎకరానికి తక్కువ సైజు ఉన్న 3వేల చేప విత్తనాలను వదులుతారు. ఎక్కువకాలం నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ సైజు గల విత్తనాలను ఎకరానికి 2వేలు వేస్తారు.
అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది
జిల్లాకు అవసరమైన కోటి చేప విత్తనాలను సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. టెండర్లు దక్కిన వారి నుంచి ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. చెరువుల్లోకి నీరు చేరగానే.. సానుకూలతను బట్టి విత్తనాలను వేస్తాం. విత్తనాలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే.. మత్స్యకారులకు ఈ ఏడాది మంచి రోజులు వచ్చినట్లే.
– సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి
Comments
Please login to add a commentAdd a comment