చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలే | Free supply of baby fish not even exceeding 40 percent | Sakshi
Sakshi News home page

చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలే

Published Mon, Dec 16 2024 3:27 AM | Last Updated on Mon, Dec 16 2024 3:27 AM

Free supply of baby fish not even exceeding 40 percent

90 కోట్ల చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ నిర్ణయం 

ఆ దిశగా అడుగులు వేయని అధికారులు 

40 శాతం కూడా దాటని ఉచిత చేప పిల్లల సరఫరా  

సాక్షి, హైదరాబాద్‌ : ఈ ఏడాది 90 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. అయినా అందులో సగం లక్ష్యాన్ని కూడా చే రుకోలేకపోయారు అధికారులు. టెండర్లు ఆలస్యంగా ఖరారు కావడమే దీనికి ప్రధాన కారణం. 

అక్టోబర్‌ నెలలోనే ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రా రంభించినా, డిసెంబర్‌ నెలలో సగం రోజులు పూర్తవుతున్నా పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఆశయానికి కాంట్రాక్టర్లు, మత్స్యశాఖ అధికారులు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

లెక్క ఎట్లా..? 
మొదట ఒక గ్లాస్‌లో ఎన్ని చేప పిల్లలు పడతాయో లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ గ్లాస్‌ను నింపుతూ ప్లాస్టిక్‌ కవర్లలో పోస్తారు. అంటే మొదట ఎన్ని వచ్చాయో అన్నే ఉన్నాయని కాంట్రాక్టర్ల లెక్క అన్నమాట. గ్లాస్‌లో తక్కువ నింపుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 

వాస్తవంగా చేప పిల్లల పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండేలా వీడియో, ఫొటోలు తీయాలి. ఆ నిబంధనలేమీ పాటించకుండా పోశామా.. ఇచ్చామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సమయం మించిపోవడంతో వచి్చంది చాలులే అన్నట్టుగా మత్స్యకారులు తీసుకుంటున్నారు.  

90 కోట్ల చేప పిల్లల పంపిణీ ఎక్కడ?  
2024–25 సంవత్సానికి 34 వేల చెరువుల్లో విడతల వారీగా 90 కోట్ల ఉచిత చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌లో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో టెండర్లు దాఖలు చేయలేదు. 

మూడుసార్లు టెండర్లు పిలిచినా, ఎవరూ రాకపోవడంతో మత్స్యశాఖ స్వయంగా రంగంలోకి దిగి కాంట్రాక్టర్లను ఒప్పించింది. ఎట్టకేలకు సెపె్టంబర్‌ చివరి నాటికి టెండర్లు ఖరారు చేసి, అక్టోబర్‌లో చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడాది భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువులు నిండినా, సరైన సమయంలో చేప పిల్లలు వదలలేదు.  

ఏడాది చివరిలో వదిలే చేప పిల్లలకు వృద్ధి ఉండదు  
ఏడాది చివరిలో వదిలే ఏ రకమైన చేప పిల్లలైన ఎదుగుదల సరిగా ఉండదు. డిసెంబర్‌ ఆ తర్వాత వదిలే చేప పిల్లలు బక్కచిక్కి బరువు తక్కువగా ఉంటాయి. వీటికి వినియోగదారులు కొనడానికి ఇష్టపడరు. చేపలు పట్టడానికి కూలీ, రవాణా ఖర్చు మత్స్యకారులపై పడి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.  

ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి 
ప్రభుత్వం విడుదల చేసే ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి. వచ్చే ఏడాది ముందుగానే టెండర్లు పిలిచి సకాలంలో చేపలను చెరువుల్లోకి వదలాలి. లేకుంటే మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై మత్స్యశాఖ దృష్టి సారించాలని, ఆ దిశగా అడుగులు వేయాలి.  – మత్స్యకారులు సుదర్శన్, గౌటే గణేష్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement