సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా చేప, రొయ్య మేతలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నాణ్యమైన చేపల సీడ్‌ను కూడా సరఫరా చేయబోతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఉండగా.. ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లోని ఆర్బీకేలలో 734 మంది మత్స్య సహాయకులు సేవలందిస్తున్నారు.
ఈ–ఫిష్ ద్వారా ఆక్వా సాగు నమోదుతో పాటు ఆక్వా చెరువులకు లైసెన్సులు సైతం జారీ చేస్తున్నారు. దిగుబడుల్లో నాణ్యత పెంచేందుకు చెరువుల్లో శాంపిల్స్ సేకరించి వాటర్ క్వాలిటీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఆక్వా సాగులో కీలకమైన ఇన్‌పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారానే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న మత్స్య శాఖ ఆర్బీకేల ద్వారా 2,736 టన్నుల చేప, రొయ్యల మేతలను రైతులకు సరఫరా చేసింది.
54 సీడ్ ఫామ్స్‌తో అనుసంధానం
ఇకపై చేపల రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన సీడ్ సరఫరా చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మత్స్య సహాయకులకు ఇచ్చిన ట్యాబ్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ–మత్స్యకార యాప్ ద్వారా రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌ను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు.
సాగునీటి వనరుల్లో నాణ్యమైన మత్స్య దిగుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌లో పెద్దఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని ఆర్బీకేల ద్వారా లైసెన్స్‌డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో ఆర్బీకేల ద్వారా బుకింగ్ చేసి జిల్లాల వారీగా లైసెన్స్‌డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వ ఫిష్ ఫామ్స్‌తో పాటు రైతుల ద్వారా 10.13 కోట్ల సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1,817 లైసెన్స్‌డ్ రిజర్వాయర్లు ఉండగా.. వాటికి 10.10 కోట్ల సీడ్ అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 3.09 కోట్ల ఫిష్ సీడ్‌ను ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. వీటిని ఆయా ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన మత్స్యకారులు వేటసాగిస్తూ జీవనోపాధి పొందనున్నారు. మలి దశలో రైతులకు కావాల్సిన ఫిష్ సీడ్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నాణ్యమైన చేప పిల్లల సరఫరాయే లక్ష్యం
ఆర్బీకేల ద్వారా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నాం. మలిదశలో రైతులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు సన్నాహాలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment