fish seed
-
చేప పిల్లలా? చేయూతా?
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే నెల చివరికి వస్తున్నా ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా? లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించడానికి ఏ విధమైన పథకాన్ని తీసుకువస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. చేప పిల్లల పంపిణీపై గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న ఆందోళన మత్స్యకారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26,700 చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు. అందుకోసం ఏప్రిల్‌లోనే టెండర్లు పిలిచి.. జూన్‌లో టెండర్లు ఖరారు చేశారు. ఈ పథకం అమలు విషయంలో గతంలో అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా? లేక మత్స్యకారులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందా అన్న చర్చ మత్స్యకార సంఘాల్లో జరుగుతోంది. సమయం సరిపోదన్న భావనలో... గతంలోలాగా పథకాన్ని కొనసాగిస్తే ఈసారి రూ. 100 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప పిల్లల సమీకరణకు కనీసం రెండు నెలల సమయం పడుతుందంటున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిస్తే చేపపిల్లల సేకరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, మత్స్యకారులకు చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో పలు ఆరోపణలు... ఉచిత చేప పిల్లల పథకంపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. చెరువుల్లో అధికశాతం నాసిరకం చేప పిల్లలను వదిలారన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతలేని చేపపిల్లలను వదిలి తప్పుడు రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పలు గ్రామాల్లోని మత్స్యకారులు తమ చెరువుల్లో చేప పిల్లలు వదలొద్దని స్పష్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పథకం కింద సరఫరా చేసిన చేపలు సరిగా ఎదగలేదని అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం తిరస్కరించడం గమనార్హం. ఉచిత చేప పిల్లల కంటే చేయూత ఇవ్వడం మంచిది. మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేస్తే నచ్చిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ఇలా చేయడం వలన నాణ్యతతో పాటు ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలను వదులుకోవాలనే నిర్ణయం కూడా మాదే ఉంటుంది. – శంకర్, మత్స్యకారుడు -
ట్యూనా చేపకు ఫుల్ డిమాండ్.. ఆ దేశ సైనికుల కోసం దిగుమతి
విదేశీ రక్షణ దళాల్లో ట్యూనా పేరు తరచూ వినిపిస్తోంది. అలాగని.. ఇదేమీ సైనికులు వినియోగించే ఆయుధం కాదు. వివిధ దేశాల్లోని సైనికులు లొట్టలేసుకుని తినే ఆహారం. బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే లభించే ట్యూనా చేప దేశ సరిహద్దులు దాటుతోంది. ఎక్కువ పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం కావడంతో వివిధ దేశాలు సైనికుల కోసం వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ట్యూనా చేపలను ప్రాసెస్ చేసిన కేన్డ్ ప్రొడక్ట్స్ (మాంసంగా తయారుచేసి డబ్బాల నుంచి నేరుగా తినేసేలా–రెడీ టు ఈట్)ను విదేశాల్లోని జవాన్ల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ట్యూనా చేప బోర్డర్ దాటుతోంది. ట్యూనా ఏమిటి.. బోర్డర్ దాటడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అన్ని సముద్రాలలో ట్యూనా చేపలు లభిస్తున్నా.. మన సముద్ర జలాల్లో లభించే ట్యూనా చేపలకుæ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. రుచితోపాటు పోషకాలు ఎక్కువ ఉండటంతో బలవర్ధక ఆహారంగా ట్యూనా చేపల్ని ఇతర దేశాలు ఎగరేసుకుపోతున్నాయి. నరాల పటుత్వం కోసం వినియోగించే.. కొలె్రస్టాల్ లేని అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ట్యూనా ప్రత్యేకత. 100 నుంచి 150 నాటికల్ లోతు జలాల్లో మెకనైజ్డ్ బోట్ల ద్వారా ప్రత్యేక వలలు, లాంగ్ లైన్(హుక్స్, గేలం)లకు మాత్రమే ట్యూనాలు చిక్కు తాయి. సముద్ర జలాల్లో ఎక్కువ.. ట్యూనా 20 నుంచి 80 కేజీల వరకు ఉంటుంది. వీటిపై 2012–15 మధ్య రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి వాటి ఉనికి, రాకపోకలను గుర్తించాయి. ఇంకోయీస్, సీఎంఎఫ్ఆర్ఐ సంస్థలు బంగాళాఖాతంలోని విశాఖపట్నం, కాకినాడ, పసిఫిక్ మహాసముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతాల్లో రాడార్ల సాయంతో ఉపగ్రహాల ద్వారా ట్యూనాల గమనం, ఉనికి, దూరం, ఏ సమయాల్లో లోతు జలాల నుంచి పైకి వస్తున్నాయనేది గుర్తించాయి. అప్పటినుంచే ట్యూనా చేపలు మన సముద్ర జలాల్లో ఎక్కువగా పట్టుకుంటున్నారు. ముద్దుపేరు సీ చికెన్.. స్కాంబ్రిడే కుటుంబానికి చెందిన ట్యూనా శాస్త్రీయ నామం థున్నుస్ ఆల్బాకేర్. సాధారణంగా వీటిని వాడుక భాషలో సూరలు అని కూడా పిలుస్తారు. ఐదు రకాల ట్యూనాలు ఉన్నా మన సముద్ర జలాల్లో లభించే రెక్క సూర (ఎల్లో ట్యూనా) అంటే విదేశీయులు లొట్టలేస్తారు. ట్యూనాలో ఉండే ఒకే ఒక ముల్లు తీసేస్తే మటన్ (మేక మాంసం) కంటే రుచిగా ఉండటమే కాకుండా.. తినడానికి వీలుగా ఉంటుంది. అందుకే ట్యూనాకు సీ చికెన్ అని మరో ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ట్యూనా చేప మాంసంలో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటంతో రక్తపోటు తగ్గించడంలో క్రియాశీలకంగా ఉంటుంది. ఫుల్ ప్రొటీన్స్.. అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలతో కూడిన కొవ్వు ఉండటంతో నరాలు పటుత్వం, శరీరంలో అవయవాలు బలీయంగా ఉండటానికి దోహదపడతాయి. వీటిలో విటమిన్ బి, బి–12, విటమిన్ సీ అధికంగా ఉండటంతో రోగనిరోధకత పెరుగుతుంది. పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి రెండు రోజులు ట్యూనాను తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరోగ్యానికి బలవర్ధక ఆహారంగా వైద్యులు నిర్ధారించడంతోనే విదేశీయులు మన సముద్ర జలాల్లోని ట్యూనాలను దిగుమతి చేసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అండమాన్, లక్షద్వీప్ నుండి ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతుల్లో రెండో స్థానం ట్యూనా చేపల ఎగుమతుల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానం మన దేశానిదే. ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు లేదా, మాంసంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2021–22 ఎంపెడా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో పట్టుకునే ట్యూనాలను మత్స్యకారులు రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులకు చేర్చి అక్కడి నుంచి చెన్నై, కేరళ రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతోంది. ఇక్కడ కిలో రూ.1,200 నుంచి రూ.1,500 ధర పలుకుతోంది. విదేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండే సందర్భంలో కిలో రూ.3,500 కూడా పలుకుతోంది. స్థానిక ప్రజలు ట్యూనా చేపల్ని పెద్దగా ఇష్టపడరు. విదేశాల్లో మాత్రం చాలా బలవర్ధక ఆహారంగా ఆర్మీ జవాన్లకు వారానికి రెండు రోజులు కచి్చతంగా పెడుతున్నారు. అందుకే విదేశాల్లో మన ట్యూనాకు అంత డిమాండ్ ఉంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ బంగాళాఖాతంలో లభించే ట్యూనా చేపలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. క్యాన్సర్‌ను కూడా ఇది నియంత్రిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఎక్కువగా మిలట్రీలో పనిచేసే సిపాయిలకు వారం వారం క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారు. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య పరిశోధకుడు, కాకినాడ విదేశాల్లో డిమాండ్ విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నాం. బంగాళాఖాతంలో లోతైన ప్రాంతాల్లో లభిస్తున్న ట్యూనా చేపలు పట్టుకోవడానికి 120 నాటికల్స్ వరకు వెళ్లాల్సి వస్తోంది. వేటకు వెళితే వారం రోజులు నడిసంద్రంలోనే ఉంటారు. ప్రస్తుతం ట్యూనాలు రాక కొంత తగ్గినా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి వేట లాభదాయకంగానే ఉంది. కాకినాడ తీరంలోని మెకనైజ్డ్ బోట్లు ఎక్కువగా ఉండటంతో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతున్నాయి. – గోనెల వెంకటేశ్వరరావు, వ్యాపారి, కాకినాడ. ఇది కూడా చదవండి: నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..! -
ఆర్బీకేల ద్వారా చేప పిల్లలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా చేప, రొయ్య మేతలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నాణ్యమైన చేపల సీడ్‌ను కూడా సరఫరా చేయబోతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఉండగా.. ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లోని ఆర్బీకేలలో 734 మంది మత్స్య సహాయకులు సేవలందిస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వా సాగు నమోదుతో పాటు ఆక్వా చెరువులకు లైసెన్సులు సైతం జారీ చేస్తున్నారు. దిగుబడుల్లో నాణ్యత పెంచేందుకు చెరువుల్లో శాంపిల్స్ సేకరించి వాటర్ క్వాలిటీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఆక్వా సాగులో కీలకమైన ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారానే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న మత్స్య శాఖ ఆర్బీకేల ద్వారా 2,736 టన్నుల చేప, రొయ్యల మేతలను రైతులకు సరఫరా చేసింది. 54 సీడ్ ఫామ్స్‌తో అనుసంధానం ఇకపై చేపల రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన సీడ్ సరఫరా చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మత్స్య సహాయకులకు ఇచ్చిన ట్యాబ్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసింది. ఈ–మత్స్యకార యాప్ ద్వారా రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌ను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సాగునీటి వనరుల్లో నాణ్యమైన మత్స్య దిగుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌లో పెద్దఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని ఆర్బీకేల ద్వారా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఆర్బీకేల ద్వారా బుకింగ్ చేసి జిల్లాల వారీగా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఫిష్ ఫామ్స్‌తో పాటు రైతుల ద్వారా 10.13 కోట్ల సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1,817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉండగా.. వాటికి 10.10 కోట్ల సీడ్ అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 3.09 కోట్ల ఫిష్ సీడ్‌ను ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. వీటిని ఆయా ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన మత్స్యకారులు వేటసాగిస్తూ జీవనోపాధి పొందనున్నారు. మలి దశలో రైతులకు కావాల్సిన ఫిష్ సీడ్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాణ్యమైన చేప పిల్లల సరఫరాయే లక్ష్యం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నాం. మలిదశలో రైతులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు సన్నాహాలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ -
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్‌ఫిష్’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నేచురల్ సూపర్ ఫుడ్స్ భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్ సూపర్ ఫుడ్స్ అని వరల్డ్‌ఫిష్ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్‌ఫిష్’ చెబుతోంది. విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 70 లక్షల సీడ్ ఉత్పత్తి అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో వరల్డ్‌ఫిష్ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో గల బిశ్వాల్ ఆక్వాటెక్ హేచరీతో కలిసి వరల్డ్‌ఫిష్ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మెత్తళ్ల సీడ్ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్‌లో అధిగమించటం విశేషం. 70 లక్షల మెత్తళ్లు సీడ్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్‌తో కూడిన నీటిని ఎయిరేషన్ టవర్ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! ‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. ► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. ► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్ టబ్లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. ► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి. ► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్ బ్రీడర్) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. ► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. ► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు. ► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్.ఇ.) ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ) -
చేప విత్తనాలు.. కోటి
సాక్షి, రంగారెడ్డి: చెరువులు, కుంటల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలు వేసేందుకు జిల్లా మత్స్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ సారి కోటి విత్తనాలను చెరువుల్లో వదలాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించుకుంది. చేప పిల్లల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. భారీ వర్షాలు కురిసి చేరువుల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప విత్తనాలను వందశాతం సబ్సిడీపై ఇస్తున్నారు. జిల్లాలో 90 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. వీటి పరిధిలో 5వేల మంది మత్స్యకారులు నమోదయ్యారు. సగం నీళ్లుంటేనే.. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో 116, పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 250 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలోకి నీరు చేరగానే మత్స్యశాఖ అధికారులు పరిశీలిస్తారు. చేప విత్తనాలు వదలడానికి.. చెరువుల్లో కనీసం 50 శాతం నీళ్లు ఉండాలి. ఇలా ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. సుదీర్ఘకాలం సరిపడా నీరు ఉంటేనే పిల్లలు ఎదుగుతాయి. ఇలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటి పరిమాణానికి అనుగుణంగా చేప విత్తనాలను వేస్తారు. ఏదేని చెరువులో విత్తనాలు వదలాలంటే స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుల అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధించిన తీర్మానం తీసుకున్నాకే అధికారులు విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. రెండో వారంలో శ్రీకారం.. ఈనెల 15వ తేదీలోపు జిల్లాలో కొన్ని చెరువుల్లో విత్తనాలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్, కోకాపేట, మదీనాగూడ తదితర పది చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత వీటిలో ముందుగా విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా వర్షాలు భారీగా కురిస్తే మిగిలిన చెరువుల్లోనూ వదులుతారు. కైకలూరు నుంచి విత్తనాలు.. కొన్ని రోజుల క్రితమే విత్తనాల టెండర్ పూర్తికాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. విడతల వారీగా కోటి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను రూ.60 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. 35 నుంచి 40 మి.మీ పరిమాణం గల చేప విత్తనానికి 52.50 పైసలు చొప్పున, 80 నుంచి 100 మి.మీ ఉన్న విత్తనాన్ని ఒక రూపాయి 19 పైసలకు చొప్పున సరఫరా చేయనున్నారు. నాలుగు రకాల విత్తనాలు.. ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు రకాల విత్తనాలను వేయనున్నారు. బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మోసు రకాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్ చెరువులు, ఎల్లప్పుడు నీటి లభ్యత గల చెరువులుగా విభజిస్తారు. సీజనల్ చెరువుల్లో కనీసం ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇటువంటి చెరువుల్లో బొచ్చ, రవ్వ, బంగారుతీగ విత్తనాలను 35:35:30 నిష్పత్తిలో వదులుతారు. వీటి సైజు 35 నుంచి 40 మిల్లీమీటర్లు ఉంటుంది. 9 నెలలపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో బొచ్చ, రవ్వ, మోసు రకాల విత్తనాలను 40:50:10 నిష్పత్తిలో వేస్తారు. ఇవి 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. వేసిన ఆరు నుంచి 8 నెలల్లోపు ఇవి ఎదుగుతాయి. సైజు.. చెరువును బట్టి చెరువు రకం, చేప విత్తనాలను బట్టి చెరువుల్లో వదిలే విత్తనాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. చెరువు విస్తీర్ణంలో 50 శాతం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. సీజనల్ వారీగా నీరు లభ్యత ఉండే చెరువుల్లో ఎకరానికి తక్కువ సైజు ఉన్న 3వేల చేప విత్తనాలను వదులుతారు. ఎక్కువకాలం నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ సైజు గల విత్తనాలను ఎకరానికి 2వేలు వేస్తారు. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది జిల్లాకు అవసరమైన కోటి చేప విత్తనాలను సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. టెండర్లు దక్కిన వారి నుంచి ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. చెరువుల్లోకి నీరు చేరగానే.. సానుకూలతను బట్టి విత్తనాలను వేస్తాం. విత్తనాలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే.. మత్స్యకారులకు ఈ ఏడాది మంచి రోజులు వచ్చినట్లే. – సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి -
'చేప'ట్టుకోండి!
నేటి నుంచే చెరువుల్లోకి చేపపిల్లలు జిల్లావ్యాప్తంగా 686 చెరువులు, కుంటల్లోకి విడుదల 5 కోట్ల చేపపిల్లల పెంపకంపై అధికారుల కసరత్తు మత్స్యకారులకు ఊరట.. 38 వేల మందికి ఉపాధి మెదక్: ఎట్టకేలకు మత్స్యకారులకు ఊరట లభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండటంతో ఉపాధి దొరికింది. దీంతో ఈ నెల 3 నుంచి జిల్లాలో నెలరోజుల పాటు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలను వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రూ.4 కోట్ల ఖర్చుతో... గడిచిన రెండేళ్లలో తీవ్ర కరువుతో నీరు వనరులు వట్టిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబ మాసంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 686 చెరువులు, కుంటలు, మూడు రిజర్వాయర్లు చేప పిల్లల పెంపకానికి సిద్ధమయ్యాయి. వీటితో పాటు సింగూర్ ప్రాజెక్టు నిజామాబాద్, మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు, హల్దీ ప్రాజెక్టులలో రూ.4 కోట్లు వెచ్చించి 5 కోట్ల చేప పిల్లలను పెంచనున్నారు. ఈ నెల 3వ తేది నుంచి నెలరోజుల పాటు అన్ని చెరువు, కుంటల్లో చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకోసం ఇటీవలే కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆన్లైన్ టెండర్ దక్కించుకున్నట్లు తెలిసింది. చేప పిల్లల పెంపకంతో జిల్లావ్యాప్తంగా 475 సంఘాలకు చెందిన 38,650 మంది మత్స్యకార్మికులు లబ్ధిపొందనున్నారు. ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు చెరువుల్లో నీరు నిల్వ ఉంటే చేపపిల్లలు సమృద్ధిగా ఎదిగి.. దిగుబడి బాగా వస్తుందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. నిండుకుండల్లా చెరువులు చెరువులన్నీ నిండుకుండల్లా మారడంతో రెండేళ్ల పాటు నీరు నిల్వ ఉంటుందని, చేపలు ఆశించిన మేర కంటే ఎక్కువగా ఎదిగి మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉన్నందున మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు ఏటా ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా వర్షాలు పడి చెరువు, కుంటలు నిండితేనే జీవనాధారం. కాగా, 2014-15 సంవత్సరంలో తీవ్ర కరవు పరిస్థితులతో చెరువు, కుంటలన్నీ వట్టిపోయాయి. చుక్కనీరు లేక నెర్రలు బారడంతో మత్స్యకారులకు పనులు లేకుండాపోయాయి. ఈక్రమంలో అనేకమంది వలస వెళ్లారు. ఈ ఏడు ఖరీఫ్ ఆఖరి సమయమైన సెప్టెంబ నెలలో భారీ వర్షాలు కురవడంతో చెరువు, కుంటలు నిండాయి. ఫలితంగా వలసలు వెళ్లిన మత్స్యకార్మికులు స్వగ్రామాలకు తిరిగి చేరుకున్నారు. నాణ్యమైన సీడ్ ఎంపిక ఈ నెల 3 నుంచి నెలరోజుల పాటు జిల్లాలోని 686 చెరువు, కుంటల్లో 5 కోట్ల చేప పిల్లలను వదులుతున్నాం. కాబట్టి అధికారులు సైతం కొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు తెచ్చే చేప పిల్లల్లో నాణ్యమైన వాటిని పరిశీలించి తీసుకోవాలి. - సత్యనారాయణ, ఏడీ, మత్స్యశాఖ -
చేప విత్తనాల కోసం రూ. 200 కోట్లు
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, చేప విత్తనాల కోసం రూ.200 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కల్యాణ మండపంలో శుక్రవారం తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ ‘డీ’లో నుంచి ‘ఏ’లోకి మార్చాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు బాగుపడితే మొదటగా లాభపడేది మత్స్యకారులేనని ఆయన స్పష్టం చేశారు. 10 ఫీట్ల లోపు చెరువులను తవ్వితే మత్స్య పరిశ్రమ వ్యవసాయం కంటే తీసిపోదని అన్నారు. వచ్చే బడ్జెట్లో మత్స్యకారుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తానని చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి మండల కార్యాలయంలో చేపల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జార్ఖండ్‌లో మాదిరిగా కేజీ కల్చర్‌ను ప్రవేశ పెట్టి 90 శాతం సబ్సిడీతో మత్స్యకారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్, ప్రొఫెసర్ రాములు తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయాలి: దత్తాత్రేయ తెలంగాణ ప్రభుత్వం వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటుకు చొరవ చూపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన సిఫార్సులు ప్రభుత్వానికి అందడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటుకు త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ముదిరాజ్ కులస్తులను బీసీ డీ నుంచి ఏ గ్రూపులోకి తేవడానికి కేంద్ర మంత్రిగా తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. చెరువుల అభివృద్ధికి కేంద్రం తరఫున నిధులు మంజూరు చేయిస్తానని దత్తాత్రేయ వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ 50 శాతం జనాభా ఉన్న బీసీ కులాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 2వేల కోట్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి పొచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంకటేష్, జీ. మల్లయ్య ముదిరాజ్ తదితరులు మాట్లాడారు.