విదేశీ రక్షణ దళాల్లో ట్యూనా పేరు తరచూ వినిపిస్తోంది. అలాగని.. ఇదేమీ సైనికులు వినియోగించే ఆయుధం కాదు. వివిధ దేశాల్లోని సైనికులు లొట్టలేసుకుని తినే ఆహారం. బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే లభించే ట్యూనా చేప దేశ సరిహద్దులు దాటుతోంది. ఎక్కువ పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం కావడంతో వివిధ దేశాలు సైనికుల కోసం వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ట్యూనా చేపలను ప్రాసెస్ చేసిన కేన్డ్ ప్రొడక్ట్స్ (మాంసంగా తయారుచేసి డబ్బాల నుంచి నేరుగా తినేసేలా–రెడీ టు ఈట్)ను విదేశాల్లోని జవాన్ల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ట్యూనా చేప బోర్డర్ దాటుతోంది. ట్యూనా ఏమిటి.. బోర్డర్ దాటడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అన్ని సముద్రాలలో ట్యూనా చేపలు లభిస్తున్నా.. మన సముద్ర జలాల్లో లభించే ట్యూనా చేపలకుæ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ దేశాలలో విపరీతమైన గిరాకీ ఉంది. రుచితోపాటు పోషకాలు ఎక్కువ ఉండటంతో బలవర్ధక ఆహారంగా ట్యూనా చేపల్ని ఇతర దేశాలు ఎగరేసుకుపోతున్నాయి. నరాల పటుత్వం కోసం వినియోగించే.. కొలె్రస్టాల్ లేని అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలు ట్యూనా ప్రత్యేకత. 100 నుంచి 150 నాటికల్ లోతు జలాల్లో మెకనైజ్డ్ బోట్ల ద్వారా ప్రత్యేక వలలు, లాంగ్ లైన్(హుక్స్, గేలం)లకు మాత్రమే ట్యూనాలు చిక్కు తాయి.
సముద్ర జలాల్లో ఎక్కువ..
ట్యూనా 20 నుంచి 80 కేజీల వరకు ఉంటుంది. వీటిపై 2012–15 మధ్య రెండు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసి వాటి ఉనికి, రాకపోకలను గుర్తించాయి. ఇంకోయీస్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ సంస్థలు బంగాళాఖాతంలోని విశాఖపట్నం, కాకినాడ, పసిఫిక్ మహాసముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతాల్లో రాడార్‌ల సాయంతో ఉపగ్రహాల ద్వారా ట్యూనాల గమనం, ఉనికి, దూరం, ఏ సమయాల్లో లోతు జలాల నుంచి పైకి వస్తున్నాయనేది గుర్తించాయి. అప్పటినుంచే ట్యూనా చేపలు మన సముద్ర జలాల్లో ఎక్కువగా పట్టుకుంటున్నారు.
ముద్దుపేరు సీ చికెన్..
స్కాంబ్రిడే కుటుంబానికి చెందిన ట్యూనా శాస్త్రీయ నామం థున్నుస్ ఆల్బాకేర్. సాధారణంగా వీటిని వాడుక భాషలో సూరలు అని కూడా పిలుస్తారు. ఐదు రకాల ట్యూనాలు ఉన్నా మన సముద్ర జలాల్లో లభించే రెక్క సూర (ఎల్లో ట్యూనా) అంటే విదేశీయులు లొట్టలేస్తారు. ట్యూనాలో ఉండే ఒకే ఒక ముల్లు తీసేస్తే మటన్ (మేక మాంసం) కంటే రుచిగా ఉండటమే కాకుండా.. తినడానికి వీలుగా ఉంటుంది. అందుకే ట్యూనాకు సీ చికెన్ అని మరో ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ట్యూనా చేప మాంసంలో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటంతో రక్తపోటు తగ్గించడంలో క్రియాశీలకంగా ఉంటుంది.
ఫుల్ ప్రొటీన్స్..
అధిక ప్రొటీన్లు, తక్కువ కేలరీలతో కూడిన కొవ్వు ఉండటంతో నరాలు పటుత్వం, శరీరంలో అవయవాలు బలీయంగా ఉండటానికి దోహదపడతాయి. వీటిలో విటమిన్ బి, బి–12, విటమిన్ సీ అధికంగా ఉండటంతో రోగనిరోధకత పెరుగుతుంది. పొటాషియం, మాంగనీస్, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వారానికి రెండు రోజులు ట్యూనాను తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరోగ్యానికి బలవర్ధక ఆహారంగా వైద్యులు నిర్ధారించడంతోనే విదేశీయులు మన సముద్ర జలాల్లోని ట్యూనాలను దిగుమతి చేసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, అండమాన్, లక్షద్వీప్ నుండి ఎగుమతి చేస్తున్నారు.
ఎగుమతుల్లో రెండో స్థానం
ట్యూనా చేపల ఎగుమతుల్లో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానం మన దేశానిదే. ఏటా 42 వేల టన్నుల ట్యూనా చేపలు లేదా, మాంసంగా విదేశాలకు ఎగుమతి అవుతోంది. 2021–22 ఎంపెడా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో పట్టుకునే ట్యూనాలను మత్స్యకారులు రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులకు చేర్చి అక్కడి నుంచి చెన్నై, కేరళ రాష్ట్రాలకు కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి జరుగుతోంది. ఇక్కడ కిలో రూ.1,200 నుంచి రూ.1,500 ధర పలుకుతోంది. విదేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండే సందర్భంలో కిలో రూ.3,500 కూడా పలుకుతోంది. స్థానిక ప్రజలు ట్యూనా చేపల్ని పెద్దగా ఇష్టపడరు. విదేశాల్లో మాత్రం చాలా బలవర్ధక ఆహారంగా ఆర్మీ జవాన్‌లకు వారానికి రెండు రోజులు కచి్చతంగా పెడుతున్నారు. అందుకే విదేశాల్లో మన ట్యూనాకు అంత డిమాండ్ ఉంది.
రోగ నిరోధక శక్తి ఎక్కువ
బంగాళాఖాతంలో లభించే ట్యూనా చేపలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. క్యాన్సర్‌ను కూడా ఇది నియంత్రిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఎక్కువగా మిలట్రీలో పనిచేసే సిపాయిలకు వారం వారం క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారు.
– చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్య పరిశోధకుడు, కాకినాడ
విదేశాల్లో డిమాండ్
విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నాం. బంగాళాఖాతంలో లోతైన ప్రాంతాల్లో లభిస్తున్న ట్యూనా చేపలు పట్టుకోవడానికి 120 నాటికల్స్ వరకు వెళ్లాల్సి వస్తోంది. వేటకు వెళితే వారం రోజులు నడిసంద్రంలోనే ఉంటారు. ప్రస్తుతం ట్యూనాలు రాక కొంత తగ్గినా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి వేట లాభదాయకంగానే ఉంది. కాకినాడ తీరంలోని మెకనైజ్డ్ బోట్లు ఎక్కువగా ఉండటంతో ట్యూనా చేపలు ఎక్కువగా పడుతున్నాయి.
– గోనెల వెంకటేశ్వరరావు, వ్యాపారి, కాకినాడ.
ఇది కూడా చదవండి: నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..!
Comments
Please login to add a commentAdd a comment