విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు.
అగ్రభాగాన ఏపీ
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు)
2020లో తగ్గిపోయిన విద్యార్థులు..
2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి.
ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ)
Comments
Please login to add a commentAdd a comment