abroad studies
-
విదేశాల్లో చదువు : ఫన్ అన్నారు, అంట్లు కడిగితే తప్పేంటి?
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవడం ఒకప్పుడు కాస్ట్లీ వ్యవహారంగా ఉండేది.అది గొప్పోళ్లకే సొంతం అన్నట్టు ఉండేది. కానీ చాలామంది బ్యాంకు లోన్లు తీసుకొని మరీ చదువు కోవడానికి అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఇలా పలుదేశాలకి ఎగిరిపోతున్నారు. తీరా అక్కడికెళ్లాక చాలామంది విద్యార్థులు కల్చర్ పరంగా, ఆర్థికంగా ఇలా రక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్వతంత్రంగా, భద్రంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అన్ని నిబంధనలూ, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఒక పక్క చదువుకుంటూనే ఏదో ఒక జాబ్ చేస్తూ కష్టపడాలి. మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. కానీ అపుడు మాత్రమే, అక్కడి ఖర్చులు లోన్లు రెండిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు విద్యార్థులు. కొందరు చదువుతున్న కాలేజీల్లోనే అసిస్టెంట్లుగా పనిచేస్తారు. పనికొందరు మాత్రం వంట చేయడం, గిన్నెలు కడగటం, పిల్లల సంరక్షణా కేంద్రాలు, మొదలు పెట్రోలు బంక్, ఇతర దుకాణాల్లో పనిచేస్తారు. తాజాగా భారతీయ విద్యార్థి ఒకరు ఇలా అంట్లు కడుగుతున్న వీడియో నొక దాన్ని ఒకరు షేర్ చేశారు. విద్యార్థి నాన్-స్టిక్ పాన్‌ను కడుగుతున్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశాడు. ‘‘విదేశాలకి స్టడీకోసంవెళ్లండి, సరదాగా ఉంటుంది అన్నారు." క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను సానుకూలంగా అర్థం చేసుకోగా, మరికొందరు మాత్రం అంట్లు కడిగితే తప్పేంటి, చిన్న చిన్న పనులైనా నేర్చుకుని ఉండాలి అంటూ మండి పడ్డారు. విదేశాల్లో అయినా ఇండియాలో అయినా ఎవరో ఒకరు అంట్లు కడగాల్సిందే.. వాటంతట అవి శుభ్రపడవు. కాకపోతే నువ్వు ఇంటికొచ్చాక ఇంకొకరు చేస్తారు. లేదా పెళ్లి అయ్యాక నీకోసం ఆ పనులు మరొకరు చేయాలని భావిస్తావ్.. అంతే తేడా. దీన్ని ఫన్‌గా అనుకోకుండా, జీవితమంతా ప్రతిరోజూ మీకోసం మీరు పనులు చేసుకోవాలని అర్థం చేసుకోండి అని కమెంట్ చేయడం గమనార్హం. go study abroad it’ll be fun they said pic.twitter.com/3yoj19uKyC — Dew (@itmedew) March 19, 2024 -
విదేశాల్లో చదువుకుంటున్నారా? కేంద్రం భారీ షాక్!
విదేశాల్లు చదువుకునే విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు కేంద్రం భారీ షాకిచ్చింది. యూనియన్ బడ్జెట్-2023 లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఏడాది జులై నుంచి విదేశాల్లో చదువుకు ఇతర ఖర్చుల కోసం పంపించే డబ్బుపై కేంద్రం ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) ట్యాక్స్‌ను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సరళీకృత చెల్లింపుల పథకం (liberalised remittance scheme – LRS) కింద వసూలు చేసేవిదేశీ ప్రయాణాలు,పెట్టుబడులు, నగదు ట్రాన్స్‌ఫర్‌పై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌లో ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపే మనీ.. వారి కాలేజీ ఫీజు సంబంధిత ఖర్చులకు కిందకు రావు. విదేశీ విద్యకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చెల్లిస్తే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ కింద ఎడ్యూకేషన్ లోన్ తీసుకొని విదేశాల్లో చదువు నిమిత్తం పంపే డబ్బు రూ.7లక్షలు దాటితే 0.5 శాతం ట్యాక్స్ కట్టాలి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇతర లోన్లు తీసుకొని విదేశాలకు రూ.7లక్షలకు మించి పంపితే 5శాతం ట్యాక్స్ పడుతుంది. ఇతర ఖర్చులపై 20శాతం ట్యాక్స్ విదేశాలకు చెందిన కాలేజీ క్యాంపస్‌లోని హాస్టల్స్ ఉండి చదువుకునే పిల్లలకు హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపించాలి. అలా కాకుండా రోజువారీ ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఏ-2 ఫామ్ తప్పని సరి ఎల్ఆర్ఎస్ విధానంలో భాగంగా విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నామో తెలుపుతూ బ్యాంకులో ఏ-2 ఫామ్ నింపాలి. అందులో ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో తెలుపుతూ డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాలి. అక్కడ మీరు మీ పిల్లల విద్యావసరాలకు కాకుండా ఇతర అవసరాల కోసం డబ్బులు పంపుతున్నారని తేలితే 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. -
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోసు!
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాలు, క్రీడలు, అధికారిక, వ్యాపార కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కరోనా టీకా బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం త్వరలోనే అనుమతిచ్చే అవకాశముందని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దీన్ని ప్రైవేట్ కేంద్రాల్లో ఇవ్వాలా, ఉచితంగానా, రుసుముతోనా అనేదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించాయి. 60 ఏళ్లు దాటిన వారితోపాటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసుఇస్తున్నారు. కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకున్నవారినే దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఆదివారం నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విదేశాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పాలంటే సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. -
స్కాలర్షిప్లు అందిస్తోన్న ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ
రాబోయే విద్యాసంవత్సరానికి సంబందించి తమ సంస్థలో చదువుకోదల్చిన అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తామని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఏయూ) ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ నాలుగేళ్లు లేదా ఎనిమిది సెమిస్టర్ల పాటు అందుతుంది. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా కోర్సు పూర్తయ్యేలోపు 24 వేల డాలర్ల స్కాలర్షిప్ అందుతుంది. ఈ ఉపకార వేతనం అందడం ద్వారా విద్యార్థులకు చదుకు కోసం అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఎఫ్ఏయూ స్కాలర్షిప్ పొందాలంటే.. విద్యార్థులు తప్పనిసరిగా మే 1 నాటికి దరఖాస్తు పూర్తి చేసి ఉండాలి. - జీపీఏ స్కోర్ యూఎస్ గ్రేడింగ్ స్కేల్ పై కనీసం 3.5 నుంచి 4.0 వరకు ఉండాలి. అప్లికేషన్ మెటీరియల్స్ అన్నీ స్వీకరించిన తరువాత, అది సమగ్రంగా ఉందని యూనివర్సిటీ భావించిన తరువాత, నాలుగు వారాల్లోగా స్కాలర్ షిప్ సెలెక్షన్స్ తెలియజేస్తామని యూనవర్సిటీ ప్రతినిధులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు పొందే భారతీయ విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్కాలర్ షిప్స్ కూడా పొందే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో 170కిపైగా డిగ్రీలతో ఉన్న ఎఫ్ఎయూతో స్టడీ గ్రూప్ భాగస్వామ్యం భారతీయ విద్యార్థుల విద్య, కెరీర్ ఆకాంక్షలను మరింత బలోపేతం చేస్తుందని స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ ఇండియా శ్రీ కరణ్ లలిత్ -
మెడిసిన్ విదేశాల్లోనే ఎందుకు?
-
అలాంటప్పుడు విదేశాల్లో ఎందుకు చదువుతున్నారు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్ అయితేనే వారికి భారత్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో తామకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. -
విదేశీ చదువుల్లో ఏపీ దూకుడు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు. అగ్రభాగాన ఏపీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు) 2020లో తగ్గిపోయిన విద్యార్థులు.. 2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ) -
విదేశాల్లో చదువుకుంటూనే సంపాదన కావాలా?
స్టడీ అబ్రాడ్.. లక్షల మంది భారతీయ విద్యార్థుల స్వప్నం! విదేశీ యూనివర్సిటీ పట్టా చేతిలో ఉంటే.. అంతర్జాతీయంగా అవకాశాలు అందుకోవచ్చనే భావన!! స్వదేశానికి తిరిగొచ్చినా..కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. కాని విదేశీ విద్య అంటే రూ.లక్షల్లో ఖర్చు. అమెరికా మొదలు ఆస్ట్రేలియా వరకూ.. ఇదే పరిస్థితి! దీంతో.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలంటే.. చాలామంది విద్యార్థులు జంకుతున్నారు. ఇలాంటి వారికిæకొంత ఉపశమన మార్గం.. పార్ట్ టైమ్ జాబ్స్!! అంటే.. విదేశీ యూని వర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి ఖర్చుల మేరకైనా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం స్టడీ అబ్రాడ్‌కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఆయా దేశాల్లో పార్ట్ టైమ్ వర్క్ విధానాలు, నిబంధనలపై ప్రత్యేక కథనం... $ అమెరికాలో ఎంఎస్, ఇతర పీజీ కోర్సులు చదవాలంటే.. సగటున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ట్యూషన్ ఫీజు. $ యూకేలో పీజీ కోర్సులకు రూ.పది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ట్యూషన్ ఫీజు. $ ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ట్యూషన్ ఫీజులు లక్షల్లోనే! వీటికితోడు అదనంగా 30నుంచి 40 శాతం మేర నివాస ఖర్చులు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చులు భరించడం ఎవరికైనా కష్టమే! దాంతో ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్ టైమ్ వర్క్‌తో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఫీజులు కాకున్నా.. నివాస ఖర్చులకు సరిపడే స్థాయిలోనైనా సంపాదించుకునే వీలుంది. అమెరికా.. పార్ట్ టైమ్ వర్క్ $ స్టడీ అబ్రాడ్ అనగానే మన విద్యార్థుల తొలి గమ్యం అమెరికా. కాని ఇక్కడ ట్యూషన్ ఫీజులు భారీగా ఉంటాయి. నివాస ఖర్చులు కూడా ఎక్కువే. అమెరికా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు పార్ట్ టైమ్ వర్క్ సౌలభ్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో అమలవుతున్న విధానం ప్రకారం– విదేశాలకు చెందిన విద్యార్థులు రెండు మార్గాల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేసే అవకాశం ఉంది. $ కోర్సు మొదటి సంవత్సరంలో ఆన్లైన్ లేదా ఆన్–క్యాంపస్ విధానంలో పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ సంపాదించుకోవచ్చు. $ రెండో మార్గం–ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానంలో 12 నుంచి 24 నెలల పాటు క్యాంపస్ వెలుపల కంపెనీల్లో పని చేసే అవకాశం. దీని ప్రకారం–ప్రీ కంప్లీషన్ ఓపీటీ విధానంలో విద్యార్థులు కోర్సు చదువుతున్న సమయంలోనే వారానికి 20 గంటలపాటు, సెలవు రోజుల్లో పూర్తి సమయం పార్ట్ టైమ్ వర్క్ చేయొచ్చు. ఇది సదరు విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుకు సంబంధించిన విభాగానికి చెందిన కంపెనీల్లోనే ఉండాలి. ఇలా పార్ట్ టైమ్ వర్క్ ద్వారా నెలకు కనిష్టంగా 800 వందల డాలర్ల వరకూ సంపాదించొచ్చు. యూకేలో.. వారానికి 20 గంటలు విదేశీ విద్య పరంగా మన విద్యార్థుల మరో ముఖ్య గమ్యం.. యూకే. ఇక్కడ కూడా పార్ట్ టైమ్ వర్క్ అవకాశం అందుబాటులో ఉంది. యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం–టైర్–4 స్టూడెంట్ వీసా కేటగిరితో ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండే కోర్సుల్లో చేరిన విద్యార్థులు వారానికి కనిష్టంగా పది గంటలు, గరిష్టంగా 20 గంటలు పని చేయొచ్చు. అలాగే సెలవు రోజుల్లో వారానికి 40 గంటలు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇలా.. వారానికి 120 నుంచి 150 పౌండ్ల వరకు సంపాదించుకునే వీలుంది. ఆస్ట్రేలియా... ఇలా ఆస్ట్రేలియాలో పార్ట్ టైమ్ వర్క్ నిబంధనల ప్రకారం–స్టూడెంట్ వీసాతో అడుగు పెట్టిన విదేశీ విద్యార్థులు.. వారానికి 20 గంటలు లేదా రెండు వారాలకు గరిష్టంగా 40 గంటలు వర్క్ చేయొచ్చు. అదేవిధంగా సెలవు రోజుల్లో పూర్తి సమయం పని చేసుకొని సంపాదించుకోవచ్చు. అలా వారానికి 300 నుంచి 400 వరకు ఆస్ట్రేలియా డాలర్లు ఆర్జించే అవకాశం ఉంది. అక్కడా ఇరవై గంటలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాలు కూడా విదేశీ విద్యార్థులకు పార్ట్ టైమ్ వర్క్ అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ కూడా వారానికి ఇరవై గంటలు పని చేసే అవకాశం ఉంది. కెనడా, సింగపూర్లలో పని గంటల ప్రాతిపదికగా వేతనం చెల్లిస్తారు. ఆయా దేశాల కరెన్సీలలో గంటకు కనిష్టంగా పది డాలర్లు, గరిష్టంగా 20 డాలర్లు సంపాదించుకోవచ్చు. సింగపూర్‌లో వారానికి 150 డాలర్ల వరకు ఆదాయం పొందొచ్చు. ఇంటర్న్షిప్తోనూ ఆర్జన ప్రస్తుతం పలు దేశాల్లో విదేశీ విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ అవకాశం అందుబాటులో ఉంది. ఆయా కోర్సుల వ్యవధిని బట్టి ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు.. తమ యూనివర్సిటీ అనుమతితో అక్కడి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎంపికైతే సదరు సంస్థలు పెయిడ్ ఇంటర్న్‌గా గరిష్టంగా మూడు నెలల కాలానికి నియమించుకుంటున్నాయి. ఈ సమయంలో మన కరెన్సీలో నెలకు గరిష్టంగా రూ.50వేల వరకు వేతనంగా పొందొచ్చు. రీసెర్చ్ అసిస్టెన్స్ విదేశీ విద్య విద్యార్థులకు పార్ట్‌టైమ్ వర్క్ పరంగా అందుబాటులో ఉన్న మరో విధానం.. రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్. అంటే..విద్యార్థులు తాము చదువుకుంటున్న యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రీసెర్చ్ చేస్తుంటే.. వారికి సహాయకులుగా ఉండొచ్చు. సదరు ప్రొఫెసర్లు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ పేరిట ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. ఇది కూడా గంటల ప్రాతిపదికన ఉంటుంది. ఈ విధానంలోనూ వారానికి కనీసం రూ.40వేల వరకు అందుకోవచ్చు. ఎక్కువగా వీటిలోనే ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న రిటెయిల్ స్టోర్స్, రెస్టారెంట్స్, ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్స్, ఫుడ్ స్టోర్స్, కెఫెటేరియాల్లో ఎక్కువగా పార్ట్‌టైమ్ వర్క్ అవకాశాలు లభిస్తున్నాయి. తాము చదువుకుంటున్న విభాగానికి చెందిన రంగంలో పనిచేస్తే.. ఇటు ఆదాయంతోపాటు అటు అనుభవం సైతం సొంతమవుతుంది. అందుకే యూనివర్సిటీ రీసెర్చ్ ప్రొఫెసర్స్ వద్ద టీచింగ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ ఇంటర్న్స్‌గా కుదురుకునే విధంగా వారిని మెప్పించాలి. ఇలా టీచింగ్ అసిస్టెంట్స్‌గా చేరిన వారికి సదరు రీసెర్చ్ ప్రొఫెసర్ స్టయిపెండ్ అందిస్తారు. దీనివల్ల విద్యార్థులకు తమ చదువుపై ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించడమే కాకుండా.. ఖర్చులకు కొంత ఆదాయం కూడా సమకూరుతుంది. పార్ట్ టైమ్ టు ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ వర్క్ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే.. అది ఫుల్ టైమ్ ఉద్యోగంగా మారే అవకాశం ఉంది. విద్యార్థి పనితీరు నచ్చితే.. సదరు సంస్థలోనే ఫుల్ టైమ్ జాబ్ ఇచ్చి.. ఇమిగ్రేషన్ అనుమతి కూడా లభించేలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత మేరకు విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్స్‌ను తమ అకడమిక్స్ సంబంధిత విభాగాల్లోనే చేయడం మేలు. అన్వేషణకు మార్గాలు విదేశాల్లో విద్యనభ్యసిస్తూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీల స్థాయిలో సపోర్ట్ సెంటర్స్ సహకరిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉన్న పార్ట్ టైమ్ జాబ్ అవకాశాలను విద్యార్థులకు తెలియజేస్తున్నాయి. అదే విధంగా స్థానిక విద్యార్థి సంఘాలు, ఆయా యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల సంఘాలు కూడా చేయూత అందిస్తున్నాయి. దాంతోపాటు విద్యార్థులు లోకల్ జాబ్ సెంటర్స్‌లో తమ వివరాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు పేర్కొని.. అందుకు తగిన ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఆయా జాబ్ సెంటర్స్ ఉద్యోగావకాశాల వివరాలను తెలియజేస్తాయి. రెజ్యుమేకు అదనపు బలం విద్యార్థులు తమ అకడమిక్స్‌కు సంబంధించిన విభాగాల్లో పార్ట్ టైమ్ వర్క్ చేస్తే.. అది రెజ్యుమేకు అదనపు బలం చేకూరుస్తుంది. కోర్సు పూర్తయ్యాక.. ఆయా దేశాల్లో పోస్ట్ స్టడీ వర్క్ అన్వేషణ సమయంలో సంస్థల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి అనుభవం ఉన్న విద్యార్థుల తరఫున ఇమిగ్రేషన్ పిటిషన్లు లేదా స్పాన్సర్షిప్ లెటర్లు ఇవ్వడానికి సదరు సంస్థలు ఆసక్తి చూపుతాయి. ఫలితంగా విద్యార్థులు ఆ దేశంలోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి. అకడమిక్స్‌కు ఆటంకం లేకుండా పార్ట్ టైమ్ వర్క్ చేయాలనుకుంటున్న విద్యార్థులు అకడమిక్స్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లోని పలు వర్సిటీల్లో క్లాసులు, లేబొరేటరీస్, ప్రాక్టికల్స్.. ఇలా అన్నింటికీ కలిపి సాయంత్రం ఆరేడు గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా నైట్ షిఫ్ట్ జాబ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరుసటి రోజు తరగతులు వినడం, నేర్చుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులు తరగతి బోధనతోపాటు స్వీయ అభ్యసనానికి ఆటంకం లేని పార్ట్‌టైమ్ జాబ్స్ ఎంచుకోవాలి. స్టడీ అబ్రాడ్–పార్ట్ టైమ్ జాబ్స్–ముఖ్యాంశాలు * అమెరికాలో వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్ వర్క్‌కు అవకాశం. కోర్సు రెండో ఏడాది నుంచి ప్రీ–కంప్లీషన్ ఓపీటీ విధానంలో పార్ట్ టైమ్ ఉద్యోగం చేసే అవకాశం. * యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో వారానికి ఇరవై గంటలు.. సెలవుల్లో పూర్తి సమయం పని చేసుకోవచ్చు. * ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ వద్ద అసిస్టెంట్స్‌గా పని చేస్తే ఆదాయంతోపాటు స్టడీస్ పరంగా ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగవుతాయి. * ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఆయా సంస్థల్లో శాశ్వత ఉద్యోగానికి స్పాన్సర్షిప్ పొందొచ్చు. సమతుల్యత ప్రధానం – శ్రీకర్, డైరక్టర్, గ్లోబల్ ట్రీ అకాడమీ విదేశీ విద్యలో చేరిన విద్యార్థులు అకడమిక్స్‌కు, వర్క్‌కు మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చుల భారం తగ్గించుకుందామని పార్ట్ టైమ్ జాబ్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడం సరికాదు. నిర్ణీత వ్యవధి కంటే ఎక్కువ సమయం పని చేసేందుకు ఆయా దేశాల ఇమిగ్రేషన్ చట్టాలు కూడా అనుమతించవు. -
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గందరగోళానికి గురవుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై మాట్లాడి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లోకి మార్పు చేశాయి. ఈ తరుణంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది. ► ఈ పరిస్థితుల్లో తమ చదువులు, భవిష్యత్తుపై అక్కడి తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. ► వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్‌లోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది. ► కరోనా వైరస్ కారణంగా కోర్సులను వర్సిటీలు ఆన్లైన్ మోడ్‌లోకి తాత్కాలికంగా మార్పు చేశాయని, ఇందులో తమ పొరపాటు ఏమీ లేదని, రెగ్యులర్ కోర్సుల్లో చేరిన తమకు ఇబ్బంది రాకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు, వర్సిటీల ప్రెసిడెంట్లకు విద్యార్థుల ద్వారా వినతులు ఇప్పించింది. ► జార్జియాటెక్, క్లెమ్స్‌న్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్ వర్సిటీ, డ్యూక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువ. వినతులతో కదిలిన వర్సిటీలు 36 వర్సిటీల విద్యార్థులు అందిస్తున్న వినతులతో ఆయా వర్సిటీలు ఇప్పటికే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని విన్నవిస్తూ లేఖలు రాస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తలెత్తే సమస్యలను అందులో పొందు పరిచాయి. యూఎస్‌లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశం విద్యార్థులు చైనా 3,69,548 ఇండియా 2,02,014 సౌత్‌కొరియా 52,250 సౌదీ అరేబియా 37,080 కెనడా 26,112 వియత్నాం 24,392 తైవాన్ 23,369 జపాన్ 18,105 సీఎం జగన్ చర్యలతో ధైర్యం కరోనా వైరస్ వల్ల యూఎస్ యూనివర్సిటీలు కోర్సులను తాత్కాలికంగా ఆన్లైన్ మోడ్‌లోకి మార్చాయన్న కారణంతో మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలన్న ఐసీఈ ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉన్నాం. ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు ధైర్యాన్ని ఇస్తున్నాయి. – రాజేష్ అంబవరం, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంటు సైన్స్, వర్జీనియా దిక్కుతోచని స్థితిలో ఊరట ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉన్నత విద్యనభ్యసించడానికి యూఎస్‌లోని వర్సిటీల్లో చేరాం. కరోనా వైరస్ వల్ల మా కోర్సులను ఆన్‌లైన్‌లోకి మార్పు చేసి బోధన కొనసాగిస్తున్నాయి. మా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. వైరస్ తగ్గాక మళ్లీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలనడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తూ ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు. – నాగసాయి శశాంక్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, డీఈ, యూఎస్ -
విదేశీ విద్య కలలు కల్లలేనా?
న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుకోవాలనుకొం టోన్న 48 శాతం మంది భారతీయ విద్యార్థులపై కోవిడ్ ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ విద్యాసంస్థలకు గ్లోబల్ ర్యాంకింగ్ ఇచ్చే క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) రిపోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఖరీదైన విదేశీ విద్య, కోవిడ్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లడంతో విద్యార్థులు ఇతర అవకాశాలవైపు చూడాల్సి వస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్ 2020, ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఆన్ హయ్యర్ ఎడ్యురేషన్ ఛాయిసెస్’’అన్న పేరుతో భారత దేశంలోని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలకు రేటింగ్ ఇచ్చే లండన్‌కి చెందిన క్యూఎస్ సంస్థ అధ్యయనం చేసింది. ఇటీవలికాలంలో విదేశీ విద్యనభ్యసించేందుకు సంసిద్ధమౌతోన్న 48.46 శాతం భారతీయ విద్యార్థులపై కోవిడ్ ప్రభావం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. అయితే ఇందులోని చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ యేతర విద్యార్థులు విదేశాల్లో చదువుకోవా లన్న తమ అభిప్రాయాన్ని పునఃపరిశీలించుకుంటున్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (స్టెమ్) విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలకు డిమాండ్ ఉండవచ్చుననీ, నాన్‌స్టెమ్ విద్యార్థులకు అవకాశాలు తగ్గొచ్చని రిపోర్టు తెలిపింది. విదేశీ విద్యకోసం వెళ్ళే విద్యార్థులపై ప్రభావంతో పాటు, దేశంలో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విద్యార్థులపై సైతం కోవిడ్ ప్రభావం ఉండవచ్చునని రిపోర్టు వెల్లడించింది. -
చదువుకు చలో అమెరికా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా 2 లక్షలు దాటింది. ఈ ఏడాదిలో ఏకంగా 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా బాటపట్టారు. 2014లో లక్ష మార్కు దాటిన విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి మన విద్యార్థులు మరికాస్త ఎక్కువగా అమెరికా విశ్వవిద్యాలయాలకు క్యూ కట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఏడాది అమెరికా వెళ్లిన టాప్ 5 దేశాల్లో చైనా లేకపోవడం. ఆరేడు సంవత్సరాల క్రితం దాకా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో చైనాదే అగ్ర స్థానం. దాదాపు దశాబ్దంపాటు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చైనా విద్యార్థుల హవా కొనసాగింది. మరోవైపు అమెరికా నుంచి భారత్ వస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అత్యధికులు ఆ ఐదు రాష్ట్రాలకే... ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జాబితాలో వరుసగా న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయీ రాష్ట్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకునేందుకు విద్యార్థులపై ఎక్కువ ఆర్థికభారం పడుతున్నప్పటికీ మంచి విశ్వవిద్యాలయాలు, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండటంతో చాలా మంది ఆ రాష్ట్రాన్ని రెండో ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. మరి హెచ్1బీ కోటా పెంచకపోతే... అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఏటా భారీగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి అక్కడ సాంకేతిక ఉపాధి అవకాశాలు తేలిగ్గా లభించడమే ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2014 నుంచి భారతీయ విద్యార్థులు భారీగా అగ్రరాజ్యానికి తరలివెళ్తున్నారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులను మూడేళ్లపాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై మూడేళ్లపాటు ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈలోగా హెచ్1బీ వీసా (వర్క్ వీసా) వస్తేనే ఆ దేశంలో పని చేయడానికి అనుమతిస్తారు. లేనిపక్షంలో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్1బీ వీసా కోటా (80 వేలు) పెంచకపోతే భవిష్యత్తులో భారతీయ విద్యార్థులకు కష్టాలే. ఎందుకంటే... ఉదాహరణకు 2016లో అమెరికా వెళ్లిన 1,65,919 మంది విద్యార్థులంతా ఓపీటీ అర్హత సాధించి అదే ఏడాది హెచ్1బీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటే అప్పటికే ఓపీటీపై ఉండి వీసా రాని వారు సుమారు 80 వేల మంది ఉండి ఉంటారు. ఈ లెక్కన ఒక్క భారత్‌కు చెందిన వారే సుమారు 2.46 లక్షల మంది హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకొని ఉంటారు. మొత్తం 80 వేల హెచ్1బీ వీసాల కోటాలో భారతీయులకే 75 వేలు వచ్చాయనుకుంటే ఇంకా 1.70 లక్షల మంది మిగిలిపోతారు. తదుపరి ఏడాది వచ్చేవరకూ 2017లో వెళ్లిన 1,86,267 మంది విద్యార్థులంతా ఈ ఏడాది ఓపీటీ అర్హత సాధిస్తే 2020 ఏప్రిల్‌కు హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు అవుతారు. అప్పుడు బ్యాక్లాగ్ 1.70 లక్షల మందితోపాటు తాజాగా ఓపీటీపైకి వచ్చిన 1,86,267 మందిని కలుపుకుంటే దాదాపు 3.5 లక్షల మంది అవుతారు. వారిలో 80 వేల మందికి హెచ్1బీ వీసాలు వచ్చాయనుకున్నా ఇంకా 2.7 లక్షల మంది మిగులుతారు. ఇలా ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతే 2023 నుంచి అమెరికాలో చదువుకోవడానికి ఎంత మంది వెళ్తున్నారో తిరిగి వచ్చేవారు కూడా దాదాపుగా అంతే ఉంటారని నిపుణులు అంటున్నారు. ఐదు దేశాలకు భారతీయ విద్యార్థుల ప్రాధాన్యత ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఈ ఏడాది ప్రధానంగా ఐదు దేశాలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 3,32,033 మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరగా ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ ఉన్నాయి. -
విదేశీ చదువుకు ఆగాఖాన్ అకాడమీ సాయం
ఆగాఖాన్ ఫౌండేషన్, ఆంటారియో ప్రావిన్స్ కలిసి విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ఫౌండేషన్ ఛైర్మన్ ఆగాఖాన్, ఆంటారియో ప్రావిన్సు ప్రీమియర్ కథ్లీన్ వైనీ ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ రెండింటి భాగస్వామ్యంతో విద్యతో పాటు విద్యాబోధనకు కూడా మంచి ఊతం అందుతుందని ఈ సందర్భంగా ఆగాఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే రెండు సంయుక్త ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు ఆంటారియో నుంచి ట్యూషన్ స్కాలర్షిప్పులు అందించే కార్యక్రమం వాటిలో ఒకటి. ఈ స్కాలర్షిప్పుతో ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలలో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం విద్యార్థులకు ఏర్పడుతుంది. దీంతో వాళ్ల కుటుంబాలు, సమాజం కూడా బాగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తమైంది. ఇక రెండో కార్యక్రమంలో భాగంగా.. ఆంటారియోలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఆగాఖాన్ అకాడమీలో తమ సమయాన్ని వెచ్చిస్తారు. ఇలా వివిధ దేశాల మధ్య బోధన, నేర్చుకోవడం లాంటివి పంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని కెనడాకు చెందిన లీసా గెర్వాయిస్ అనే ఉపాధ్యాయిని చెప్పారు. ప్రస్తుతం ఆమె భారత్, కెన్యాలలో ఉన్న ఆగాఖాన్ అకాడమీలలో కెనడియన్ డెవలప్మెంట్ ఎక్స్ఛేంజి కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నారు.