Part Time Jobs for Students in USA and Canada | Internship Jobs in Abroad | Australia, UK, New Zealand - Sakshi
Sakshi News home page

విదేశాల్లో చదువుకుంటూనే సంపాదన కావాలా?

Published Wed, Nov 3 2021 9:06 AM | Last Updated on Wed, Nov 3 2021 10:50 AM

Part Time Jobs For Students In Abroad - Sakshi

స్టడీ అబ్రాడ్‌.. లక్షల మంది భారతీయ విద్యార్థుల స్వప్నం! విదేశీ యూనివర్సిటీ పట్టా చేతిలో ఉంటే.. అంతర్జాతీయంగా అవకాశాలు అందుకోవచ్చనే భావన!! స్వదేశానికి తిరిగొచ్చినా..కార్పొరేట్‌ ప్రపంచంలో ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు. కాని విదేశీ విద్య అంటే రూ.లక్షల్లో ఖర్చు. అమెరికా మొదలు ఆస్ట్రేలియా వరకూ.. ఇదే పరిస్థితి! దీంతో.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలంటే.. చాలామంది విద్యార్థులు జంకుతున్నారు. ఇలాంటి వారికిæకొంత ఉపశమన మార్గం.. పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!! అంటే.. విదేశీ యూని వర్సిటీల్లో  అడుగుపెట్టిన విద్యార్థులు.. చదువుకుంటూనే.. ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి ఖర్చుల మేరకైనా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం స్టడీ అబ్రాడ్‌కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఆయా దేశాల్లో పార్ట్‌ టైమ్‌ వర్క్‌ విధానాలు, నిబంధనలపై ప్రత్యేక కథనం... 

Part Time Jobs For Students

$ అమెరికాలో ఎంఎస్, ఇతర పీజీ కోర్సులు చదవాలంటే.. సగటున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ట్యూషన్‌ ఫీజు.
$ యూకేలో పీజీ కోర్సులకు రూ.పది లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ట్యూషన్‌ ఫీజు.
$ ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లోనూ ట్యూషన్‌ ఫీజులు లక్షల్లోనే! 
వీటికితోడు అదనంగా 30నుంచి 40 శాతం మేర నివాస ఖర్చులు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చులు భరించడం ఎవరికైనా కష్టమే! దాంతో ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌ టైమ్‌ వర్క్‌తో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఫీజులు కాకున్నా.. నివాస ఖర్చులకు సరిపడే స్థాయిలోనైనా సంపాదించుకునే వీలుంది. 

Student Part Time Jobs
అమెరికా.. పార్ట్‌ టైమ్‌ వర్క్‌
$    స్టడీ అబ్రాడ్‌ అనగానే మన విద్యార్థుల తొలి గమ్యం అమెరికా. కాని ఇక్కడ ట్యూషన్‌ ఫీజులు భారీగా ఉంటాయి. నివాస ఖర్చులు కూడా ఎక్కువే. అమెరికా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌ టైమ్‌ వర్క్‌ సౌలభ్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ దేశంలో అమలవుతున్న విధానం ప్రకారం– విదేశాలకు చెందిన విద్యార్థులు రెండు మార్గాల్లో పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ చేసే అవకాశం ఉంది. 
$    కోర్సు మొదటి సంవత్సరంలో ఆన్‌లైన్‌ లేదా ఆన్‌–క్యాంపస్‌ విధానంలో పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేస్తూ సంపాదించుకోవచ్చు.
$    రెండో మార్గం–ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) విధానంలో 12 నుంచి 24 నెలల పాటు క్యాంపస్‌ వెలుపల కంపెనీల్లో పని చేసే అవకాశం. దీని ప్రకారం–ప్రీ కంప్లీషన్‌ ఓపీటీ విధానంలో విద్యార్థులు కోర్సు చదువుతున్న సమయంలోనే వారానికి 20 గంటలపాటు, సెలవు రోజుల్లో పూర్తి సమయం పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేయొచ్చు. ఇది సదరు విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుకు సంబంధించిన విభాగానికి చెందిన కంపెనీల్లోనే ఉండాలి. ఇలా పార్ట్‌ టైమ్‌ వర్క్‌ ద్వారా నెలకు కనిష్టంగా 800 వందల డాలర్ల వరకూ సంపాదించొచ్చు. 

Internships in Canada
యూకేలో.. వారానికి 20 గంటలు
విదేశీ విద్య పరంగా మన విద్యార్థుల మరో ముఖ్య గమ్యం.. యూకే. ఇక్కడ కూడా పార్ట్‌ టైమ్‌ వర్క్‌ అవకాశం అందుబాటులో ఉంది. యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం–టైర్‌–4 స్టూడెంట్‌ వీసా కేటగిరితో ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండే కోర్సుల్లో చేరిన విద్యార్థులు వారానికి కనిష్టంగా పది గంటలు, గరిష్టంగా 20 గంటలు పని చేయొచ్చు. అలాగే సెలవు రోజుల్లో వారానికి 40 గంటలు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇలా.. వారానికి 120 నుంచి 150 పౌండ్ల వరకు సంపాదించుకునే వీలుంది. 

Part time jobs in UK
ఆస్ట్రేలియా... ఇలా
ఆస్ట్రేలియాలో పార్ట్‌ టైమ్‌ వర్క్‌ నిబంధనల ప్రకారం–స్టూడెంట్‌ వీసాతో అడుగు పెట్టిన విదేశీ విద్యార్థులు.. వారానికి 20 గంటలు లేదా రెండు వారాలకు గరిష్టంగా 40 గంటలు వర్క్‌ చేయొచ్చు. అదేవిధంగా సెలవు రోజుల్లో పూర్తి సమయం పని చేసుకొని సంపాదించుకోవచ్చు. అలా వారానికి 300 నుంచి 400 వరకు ఆస్ట్రేలియా డాలర్లు ఆర్జించే అవకాశం ఉంది. 

అక్కడా ఇరవై గంటలు
కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్‌ తదితర దేశాలు కూడా విదేశీ విద్యార్థులకు పార్ట్‌ టైమ్‌ వర్క్‌ అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడ కూడా వారానికి ఇరవై గంటలు పని చేసే అవకాశం ఉంది. కెనడా, సింగపూర్‌లలో పని గంటల ప్రాతిపదికగా వేతనం చెల్లిస్తారు. ఆయా దేశాల కరెన్సీలలో గంటకు కనిష్టంగా పది డాలర్లు, గరిష్టంగా 20 డాలర్లు సంపాదించుకోవచ్చు. సింగపూర్‌లో వారానికి 150 డాలర్ల వరకు ఆదాయం పొందొచ్చు. 

ఇంటర్న్‌షిప్‌తోనూ ఆర్జన
ప్రస్తుతం పలు దేశాల్లో విదేశీ విద్యార్థులకు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్స్‌ అవకాశం అందుబాటులో ఉంది. ఆయా కోర్సుల వ్యవధిని బట్టి ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు.. తమ యూనివర్సిటీ అనుమతితో అక్కడి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎంపికైతే సదరు సంస్థలు పెయిడ్‌ ఇంటర్న్‌గా గరిష్టంగా మూడు నెలల కాలానికి నియమించుకుంటున్నాయి. ఈ సమయంలో మన కరెన్సీలో నెలకు గరిష్టంగా రూ.50వేల వరకు వేతనంగా పొందొచ్చు. 

Internship Jobs in canada

రీసెర్చ్‌ అసిస్టెన్స్‌
విదేశీ విద్య విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ వర్క్‌ పరంగా అందుబాటులో ఉన్న మరో విధానం.. రీసెర్చ్‌ అసిస్టెన్స్‌షిప్‌. అంటే..విద్యార్థులు తాము చదువుకుంటున్న యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రీసెర్చ్‌ చేస్తుంటే.. వారికి సహాయకులుగా ఉండొచ్చు. సదరు ప్రొఫెసర్లు రీసెర్చ్‌ అసిస్టెన్స్‌షిప్‌ పేరిట ఆర్థిక తోడ్పాటు అందిస్తారు. ఇది కూడా గంటల ప్రాతిపదికన ఉంటుంది. ఈ విధానంలోనూ వారానికి కనీసం రూ.40వేల వరకు అందుకోవచ్చు. 

ఎక్కువగా వీటిలోనే
ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న రిటెయిల్‌ స్టోర్స్, రెస్టారెంట్స్, ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్స్, ఫుడ్‌ స్టోర్స్, కెఫెటేరియాల్లో ఎక్కువగా పార్ట్‌టైమ్‌ వర్క్‌ అవకాశాలు లభిస్తున్నాయి. తాము చదువుకుంటున్న విభాగానికి చెందిన రంగంలో పనిచేస్తే.. ఇటు ఆదాయంతోపాటు అటు అనుభవం సైతం సొంతమవుతుంది. అందుకే యూనివర్సిటీ రీసెర్చ్‌ ప్రొఫెసర్స్‌ వద్ద టీచింగ్‌ అసిస్టెంట్స్, రీసెర్చ్‌ ఇంటర్న్స్‌గా కుదురుకునే విధంగా వారిని మెప్పించాలి. ఇలా టీచింగ్‌ అసిస్టెంట్స్‌గా చేరిన వారికి సదరు రీసెర్చ్‌ ప్రొఫెసర్‌ స్టయిపెండ్‌ అందిస్తారు. దీనివల్ల విద్యార్థులకు తమ చదువుపై ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లభించడమే కాకుండా.. ఖర్చులకు కొంత ఆదాయం కూడా సమకూరుతుంది.

పార్ట్‌ టైమ్‌ టు ఫుల్‌ టైమ్‌
పార్ట్‌ టైమ్‌ వర్క్‌ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే.. అది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగంగా మారే అవకాశం ఉంది. విద్యార్థి పనితీరు నచ్చితే.. సదరు సంస్థలోనే ఫుల్‌ టైమ్‌ జాబ్‌ ఇచ్చి.. ఇమిగ్రేషన్‌ అనుమతి కూడా లభించేలా ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత మేరకు విద్యార్థులు పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ను తమ అకడమిక్స్‌ సంబంధిత విభాగాల్లోనే చేయడం మేలు. 

అన్వేషణకు మార్గాలు
విదేశాల్లో విద్యనభ్యసిస్తూ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీల స్థాయిలో సపోర్ట్‌ సెంటర్స్‌ సహకరిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉన్న పార్ట్‌ టైమ్‌ జాబ్‌ అవకాశాలను విద్యార్థులకు తెలియజేస్తున్నాయి. అదే విధంగా స్థానిక విద్యార్థి సంఘాలు, ఆయా యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల సంఘాలు కూడా చేయూత అందిస్తున్నాయి. దాంతోపాటు విద్యార్థులు లోకల్‌ జాబ్‌ సెంటర్స్‌లో తమ వివరాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు పేర్కొని.. అందుకు తగిన ఉద్యోగం కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులకు ఆయా జాబ్‌ సెంటర్స్‌ ఉద్యోగావకాశాల వివరాలను తెలియజేస్తాయి. 

రెజ్యుమేకు అదనపు బలం
విద్యార్థులు తమ అకడమిక్స్‌కు సంబంధించిన విభాగాల్లో పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేస్తే.. అది రెజ్యుమేకు అదనపు బలం చేకూరుస్తుంది. కోర్సు పూర్తయ్యాక.. ఆయా దేశాల్లో పోస్ట్‌ స్టడీ వర్క్‌ అన్వేషణ సమయంలో సంస్థల నుంచి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి అనుభవం ఉన్న విద్యార్థుల తరఫున ఇమిగ్రేషన్‌ పిటిషన్లు లేదా స్పాన్సర్‌షిప్‌ లెటర్లు ఇవ్వడానికి సదరు సంస్థలు ఆసక్తి చూపుతాయి. ఫలితంగా విద్యార్థులు ఆ దేశంలోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.

అకడమిక్స్‌కు ఆటంకం లేకుండా
పార్ట్‌ టైమ్‌ వర్క్‌ చేయాలనుకుంటున్న విద్యార్థులు అకడమిక్స్‌కు ఆటంకం కలగకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లోని పలు వర్సిటీల్లో క్లాసులు, లేబొరేటరీస్, ప్రాక్టికల్స్‌.. ఇలా అన్నింటికీ కలిపి సాయంత్రం ఆరేడు గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా నైట్‌ షిఫ్ట్‌ జాబ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరుసటి రోజు తరగతులు వినడం, నేర్చుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులు తరగతి బోధనతోపాటు స్వీయ అభ్యసనానికి ఆటంకం లేని పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ ఎంచుకోవాలి. 


స్టడీ అబ్రాడ్‌–పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌–ముఖ్యాంశాలు
* అమెరికాలో వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్‌ వర్క్‌కు అవకాశం. కోర్సు రెండో ఏడాది నుంచి ప్రీ–కంప్లీషన్‌ ఓపీటీ విధానంలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసే అవకాశం. 
* యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో వారానికి ఇరవై గంటలు.. సెలవుల్లో పూర్తి సమయం పని చేసుకోవచ్చు.
* ప్రొఫెసర్స్, రీసెర్చర్స్‌ వద్ద అసిస్టెంట్స్‌గా పని చేస్తే ఆదాయంతోపాటు స్టడీస్‌ పరంగా ప్రాక్టికల్‌ నైపుణ్యాలు మెరుగవుతాయి. 
* ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా ఆయా సంస్థల్లో శాశ్వత ఉద్యోగానికి స్పాన్సర్‌షిప్‌ పొందొచ్చు.


సమతుల్యత ప్రధానం – శ్రీకర్, డైరక్టర్, గ్లోబల్‌ ట్రీ అకాడమీ
విదేశీ విద్యలో చేరిన విద్యార్థులు అకడమిక్స్‌కు, వర్క్‌కు మధ్య సమతుల్యత పాటించాలి. ఖర్చుల భారం తగ్గించుకుందామని పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టడం సరికాదు. నిర్ణీత వ్యవధి కంటే ఎక్కువ సమయం పని చేసేందుకు ఆయా దేశాల ఇమిగ్రేషన్‌ చట్టాలు కూడా అనుమతించవు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement