Crores Lotted in the Name of Part-Time Jobs - Sakshi
Sakshi News home page

100 ఖాతాలు.. రూ.400 కోట్లు!

Published Mon, Aug 21 2023 2:45 AM | Last Updated on Mon, Aug 21 2023 7:54 PM

Crores lotted in the name of part-time jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఈ–క్రిమినల్స్‌ ఫైనాన్షియల్‌ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్‌ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.  

వ్యాపారం సాగక అడ్డదారి.. 
ముంబైకి చెందిన రోనక్‌ భరత్‌ కుమార్‌ కక్కడ్‌ వృత్తిరీత్యా డిజిటల్‌ మార్కెటింగ్‌ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్‌ మీడియా ద్వారా ప్రమోట్‌ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్‌ మార్కెట్, బ్లాక్‌ వే డిజిటల్‌ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు.

వీటి పేర్లతో కరెంట్‌ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్‌ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్‌ లిన్, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఇరీన్‌ పరిచయమయ్యారు. 

20% కమీషన్‌తో.. 
తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్‌ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్‌.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు.

ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్‌ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్‌ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్‌ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్‌ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు.  

క్రిప్టో కరెన్సీగా మార్చి..
దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్‌ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్‌ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్‌/ట్రాన్స్‌ఫర్‌ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్‌ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్‌ తైవాన్‌లో ఉండే స్వాంగ్‌ లిన్‌కు పంపేవాడు.

బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు  భరత్‌కుమార్, ప్రశాంత్‌ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్‌ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్‌ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement