భర్త అశోక్‌రాజ్, కుమారుడితో శ్వేత (ఫైల్)
ఆస్ట్రేలియాలో హైదరాబాదీ దారుణం
మృతురాలి స్వస్థలం ఏఎస్‌రావు నగర్
కుమారుడిని నగరంలో వదిలి వెళ్లిన నిందితుడు
విక్టోరియా పోలీసులకు లొంగిపోయిన వైనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వివాహిత శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. పాయింట్ కుక్ ప్రాంతంలోని మిర్కా వేలో ఇటీవల ఈ దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన చెత్త డబ్బాలో ఉన్న మృతదేహాన్ని విక్టోరియా పోలీసులు గుర్తించారు. తర్వాత హతురాలి భర్తే వచ్చి లొంగిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నేత బాల్‌శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ వాసే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లిని ఇరుపక్షాల కుటుంబాలూ అంగీకరించలేదని సమాచారం.
కత్తితో పొడిచి, బెడ్‌షీట్‌లో చుట్టి..
వివాహానంతరం అశోక్‌రాజ్, శ్వేత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమ ఇంట్లోనే శ్వేతను కత్తితో పొడిచి చంపిన అశోక్ శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. తన వాహనంలో ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మానుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు.
బాలుడిని తమ ఇంట్లో వదిలేసి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానాస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే హతురాలు శ్వేత అని, ఆమె భర్త తన కుమారుడితో కలిసి ఇటీవలే హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారు అశోక్‌ను అరెస్టు చేశారు.
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా..
శ్వేత మృతదేహంతో కూడిన డబ్బా పడున్న మార్గం పెద్దగా వినియోగంలో ఉండదని, రోజుకు కేవలం రెండుమూడు వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉంటాయని బిక్లీలోని స్థానికులు అక్కడి మీడియాకు చెప్తున్నారు. మిర్కా వే ప్రాంతంలో తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్వేత... ఇరుగుపొరుగు వారికి అవసరమైనప్పుడు, కీలక రోజుల్లో భోజనం తదితరాలను అందజేసేదని తెలుస్తోంది. దీంతో ఆమె హత్య విషయం తెలిసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. శ్వేత వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే అవకాశం లేదని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment