నిత్యం ఇక్కడ సందడి వాతావరణం
ఇతర రాష్ట్రాల అవతరణ దినోత్సవాల నిర్వహణ
విదేశాల నుంచి వస్తున్న బాబా భక్తులు
సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులు వస్తుండటంతో దశాబ్దాల కాలంగా ఇతర రాష్ట్రాల పండుగలు ప్రశాంతి నిలయంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేస్తుంటారు. ఏటా గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, ఆయా రాష్ట్రాల ప్రధాన పండుగలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక రాష్ట్రం నుంచి భక్తులు పర్తియాత్రగా పుట్టపర్తి వస్తున్నారు.
అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పుట్టపర్తిలో ప్రదర్శిస్తున్నారు. పుట్టపర్తి వంటకాలు, వస్త్రధారణకు విదేశీయులు సైతం ముగ్దులు కావడం విశేషం. ఇతర రాష్ట్రాల, దేశాల భక్తులు సైతం స్థానికులతో సులువుగా కలసిపోతున్నారు. ఫలితంగా దేశ, విదేశీ భాషలను స్థానికులు సులువుగా మాట్లాడగలుగుతున్నారు. చదువు రాని వారు సైతం ఆ భాషలను నేర్చుకుంటున్నారు.
విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి సంప్రదాయం వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్‌ను ఇష్టపడుతున్నారు. మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తున్నారు. సుమారు 150 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తుంటారు. వీరిలో చాలామంది భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
మనకు గర్వకారణం
మేము తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. దశాబ్దాల కాలం నుంచి విదేశీయులను చూస్తున్నాం. మన సంప్రదాయాలను వారు ఆచరిస్తుండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశస్తులు మన దుస్తులను ఇష్టపడుతున్నారు. ఇక్కడి వంటకాలు అందరినీ ఆకర్షిస్తాయి. – బాల దండపాణి, పుట్టపర్తి
సంప్రదాయాల కేంద్రం
పలు దేశాల నుంచి భక్తి భావంతో పుట్టపర్తికి వస్తుంటారు. ఇక్కడి ప్రజల సహకారం బాగుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశీయులు పాటిస్తారు. దేశ, విదేశ భేదాలు లేకుండా పరస్పర సహకారంతో మెలుగుతుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి.. సంప్రదాయాలకూ కేంద్రంగా ఉందని చెప్పొచ్చు. – ఆర్‌జే రత్నాకర్‌రాజు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు
Comments
Please login to add a commentAdd a comment