పంపిణీకి సిద్ధంగా చేప పిల్లలు
నేటి నుంచే చెరువుల్లోకి చేపపిల్లలు
జిల్లావ్యాప్తంగా 686 చెరువులు, కుంటల్లోకి విడుదల
5 కోట్ల చేపపిల్లల పెంపకంపై అధికారుల కసరత్తు
మత్స్యకారులకు ఊరట.. 38 వేల మందికి ఉపాధి
మెదక్: ఎట్టకేలకు మత్స్యకారులకు ఊరట లభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండటంతో ఉపాధి దొరికింది. దీంతో ఈ నెల 3 నుంచి జిల్లాలో నెలరోజుల పాటు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేపలను వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
రూ.4 కోట్ల ఖర్చుతో...
గడిచిన రెండేళ్లలో తీవ్ర కరువుతో నీరు వనరులు వట్టిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబ మాసంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 686 చెరువులు, కుంటలు, మూడు రిజర్వాయర్లు చేప పిల్లల పెంపకానికి సిద్ధమయ్యాయి. వీటితో పాటు సింగూర్ ప్రాజెక్టు నిజామాబాద్, మెదక్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు, హల్దీ ప్రాజెక్టులలో రూ.4 కోట్లు వెచ్చించి 5 కోట్ల చేప పిల్లలను పెంచనున్నారు.
ఈ నెల 3వ తేది నుంచి నెలరోజుల పాటు అన్ని చెరువు, కుంటల్లో చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకోసం ఇటీవలే కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ టెండర్ దక్కించుకున్నట్లు తెలిసింది. చేప పిల్లల పెంపకంతో జిల్లావ్యాప్తంగా 475 సంఘాలకు చెందిన 38,650 మంది మత్స్యకార్మికులు లబ్ధిపొందనున్నారు. ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు చెరువుల్లో నీరు నిల్వ ఉంటే చేపపిల్లలు సమృద్ధిగా ఎదిగి.. దిగుబడి బాగా వస్తుందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.
నిండుకుండల్లా చెరువులు
చెరువులన్నీ నిండుకుండల్లా మారడంతో రెండేళ్ల పాటు నీరు నిల్వ ఉంటుందని, చేపలు ఆశించిన మేర కంటే ఎక్కువగా ఎదిగి మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉన్నందున మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు ఏటా ఖరీఫ్ సీజన్‌లో పుష్కలంగా వర్షాలు పడి చెరువు, కుంటలు నిండితేనే జీవనాధారం. కాగా, 2014-15 సంవత్సరంలో తీవ్ర కరవు పరిస్థితులతో చెరువు, కుంటలన్నీ వట్టిపోయాయి.
చుక్కనీరు లేక నెర్రలు బారడంతో మత్స్యకారులకు పనులు లేకుండాపోయాయి. ఈక్రమంలో అనేకమంది వలస వెళ్లారు. ఈ ఏడు ఖరీఫ్ ఆఖరి సమయమైన సెప్టెంబ నెలలో భారీ వర్షాలు కురవడంతో చెరువు, కుంటలు నిండాయి. ఫలితంగా వలసలు వెళ్లిన మత్స్యకార్మికులు స్వగ్రామాలకు తిరిగి చేరుకున్నారు.
నాణ్యమైన సీడ్ ఎంపిక
ఈ నెల 3 నుంచి నెలరోజుల పాటు జిల్లాలోని 686 చెరువు, కుంటల్లో 5 కోట్ల చేప పిల్లలను వదులుతున్నాం. కాబట్టి అధికారులు సైతం కొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు తెచ్చే చేప పిల్లల్లో నాణ్యమైన వాటిని పరిశీలించి తీసుకోవాలి. - సత్యనారాయణ, ఏడీ, మత్స్యశాఖ