రేషన్‌ టెన్షన్‌ | Ration Rice Epass Distribution Not Working In Medak | Sakshi
Sakshi News home page

రేషన్‌ టెన్షన్‌

Published Mon, Jul 2 2018 10:37 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

Ration Rice Epass Distribution Not Working In Medak - Sakshi

సాక్షి, మెదక్‌: రేషన్‌ డీలర్లు సమ్మె బాట పట్టడంతో జిల్లాలో రేషన్‌ పంపిణీపై ఉత్కంఠ నెలకొంది. డీలర్లను భయపెట్టి దారిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం యత్నం ఫలించడం లేదు.  జిల్లాలో మెజార్టీ డీలర్లు డీడీలు కట్టకపోవటంతో సమ్మె సాగుతోంది. డీలర్ల సస్పెన్షన్‌ వేటుపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.  జిల్లాలో సరుకుల కోసం డీడీలు చెల్లించని డీలర్లను సస్పెండ్‌ చేస్తామంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసే ఆలోచనను మాత్రం విరమించుకున్నట్లు సమాచారం.

సస్పెన్షన్ల అంశం పక్కనబెట్టి లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. రేషన్‌ డీలర్లు గౌరవ వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం డీలర్లకు రూ.20 కమీషన్‌ వస్తోంది. కమీషన్‌ను రూ.70 పెంచాలని, రూ.30వేల గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేస్తున్నారు

ఇద్దరు మాత్రమే..
ఈ–పాస్‌ విధానంతో రేషన్‌ డీలర్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ పాస్‌ విధానంతో వారి అదనపు ఆదాయం పడిపోయింది. దీంతో డీలర్లు దుకాణాలను నడపటం కష్టం అవుతోంది. దీంతో డీలర్లు కమీషన్‌ పెంచాలని, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  జూలై మాసానికి 28 తేదీలోగా డీడీలు కట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం జిల్లాలో కేవలం ఇద్దరు డీలర్లు మాత్రమే డీడీలు కట్టారు. దీంతో కలెక్టర్‌ ధర్మారెడ్డి స్వయంగా డీలర్లు వెంటనే డీడీ కట్టాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా రేషన్‌ డీలర్లు స్పందించడం లేదు.  ఇప్పటికీ 519 మంది డీలర్లు డీడీలు కట్టలేదు. దీంతో కలెక్టర్‌ డీలర్లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు జిల్లాలోని 519 మంది రేషన్‌ డీలర్లకు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. చాలా మంది డీలర్లు షోకాజ్‌ నోటీసులు అందుకునేందుకు విముఖత చూపారు. దీంతో రెవెన్యూ సిబ్బంది షోకాజ్‌ నోటీసులను రేషన్‌ షాపులకు దగ్గర అతికించారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా రేషన్‌ డీలర్లు డీడీలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. దీంతో రేషన్‌ డీలర్లకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్‌ మొదట నిర్ణయించారు. అయితే సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయవద్దని సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం సూచించటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్రత్యామ్నాయ చర్యలు షురూ 
రేషన్‌డీలర్లు  డీడీలు చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక గ్రూపుల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయిస్తున్నారు.  ఇందుకోసం సోమ, మంగళవారం రెండు రోజులు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఐకేపీ సంఘాలకు రేషన్‌ సరుకుల పంపిణీపై శిక్షణ ఇవ్వనున్నారు.

సరుకుల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 499 సహాయ సంఘాలను, పట్టణాల్లో 20 మెప్మా గ్రూప్‌లను గుర్తించారు. సరుకులను ఉంచడానికి 417 గ్రామ పంచాయతీ భవనాలు,  46 ఐకేపీ భవనాలు, 10 కమ్యూనిటీ హాల్స్‌ను, 46 వేరొక భవనాలను గుర్తించారు. ఈ పాస్‌ విధానంలో ఐకేపీ సంఘాలు  సరుకుల పంపిణీ చేపడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఐకేపీ సంఘాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏవైన ఫిర్యాదులుంటే 9985390891 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement