delars
-
అక్కడి కొనుగోలుదారులకు పండగే.. రివోల్ట్ కొత్త డీలర్షిప్స్ షురూ!
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 'రివోల్ట్ మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో మూడు డీలర్‌షిప్‌లను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్లను ఇండోర్, గౌహతి, హుబ్లీ ప్రాంతాల్లో ప్రారభించింది. రివోల్ట్ మోటార్స్ ప్రారంభించిన ఈ మూడు కొత్త డీలర్‌షిప్‌లతో కలిపి కంపెనీ డీలర్‌షిప్‌ల సంఖ్య 35కి చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని డీలర్‌షిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇటీవలే రివోల్ట్ మోటార్స్‌లో 100 శాతం వాటాను పొందింది. భారతదేశంలో 70కి పైగా కొత్త స్టోర్లను ప్రారంభించాలానే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన ఫ్లాగ్షిప్ మోడల్ RV400 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీలను 2023 మార్చి 31 నాటికి పొందవచ్చు. ఇప్పటికే ఈ బైక్ విరివిగా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతోంది. రివోల్ట్ ఆర్వి400 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. రివోల్ట్ ఆర్వి400 గంటకు ఎకో మోడ్‌లో 45 కిమీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 75 శాతం, 4.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్ బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది. -
218 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నెల్లికుదురు (మహబూబాబాద్) : 218క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తొర్రూర్ డీఎస్పీ జి.మదన్‌లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట మండలాల్లో పోలీసులు అలర్ట్‌గా ఉన్నప్పటికీ రేషన్ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్ డీలర్లు తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి, వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్‌గోదావరి జిల్లా అద్దెటిగల్ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు. సేకరించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం లోడు లారీని సీజ్ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బానోతు రాములు, సంద అనిల్, అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు. బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్ బియ్యం దందాలో నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్ డీలర్లపై, అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. -
డీలర్ల భర్తీకి కసరత్తు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల్లో డీలర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా కిరోసిన్ హాకర్ ఉండి రేషన్ డీలర్ లేకుంటే వారికే స్థానికత ఆధారంగా రేషన్ దుకాణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా 53 షాపులకు డీలర్లు లేరు. వీటిలో ఖమ్మం డివిజన్లో 38ఉండగా కల్లూరు డివిజన్ పరిధిలో 15ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాం తాల్లోని ఇతర రేషన్ డీలర్లకు ఇన్చార్జి అపగించారు. దీంతో సరుకులు పంపిణీలో స్థానికం గా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డీలర్ల భర్తీకి ప్రభుత్వం ఉపక్రమించింది. 1994 నుంచి ఉన్నవారికే ప్రాధాన్యం.. జిల్లాలో కిరోసిన్ హాకర్లను రాష్ట్ర ప్రభుత్వం 1994వ సంవత్సరంలో నియమించింది. ఆ ప్రాతిపదికన నాటి నుంచి అనేక మంది హాకర్లు వచ్చే కొద్ది గొప్పో ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వారికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 53 రేషన్ దుకాణాల్లో 1994వ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న వారికి మాత్రమే ఖాళీగా ఉన్న ప్రాంతంలో రేషన్ దుకాణాన్ని అప్పగించనున్నారు. దరఖాస్తు ఇలా.. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలను ఆర్డీవోల పరిధిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కిరోసిన్ హాకర్ ఉండి రేషన్ డీలర్ లేకుంటే హాకరే దరఖాస్తు చేసుకుంటే రేషన్ దుకాణం రానున్నది. 53దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో స్థానికంగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతనివ్వనున్నారు. హాకర్లు ఆయా ప్రాంతాల్లోని డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే జిల్లా పౌరసరఫరాల శాఖలో ఎవరైనా దరఖాస్తును అందిస్తే వారు సైతం ఆర్డీవోకు పంపిస్తారు. ఎంపిక పారదర్శకత జిల్లాలో రేషన్ డీలర్లను భర్తీ చేసేందుకు ఆర్డీవోలు పారదర్శకతతో వ్యవహరించనున్నారు. ఖమ్మం ఆర్డీవోగా సబ్ కలెక్టర్ ఉన్న దృష్ట్యా పారదర్శకంగా రేషన్ దుకాణానికి డీలర్‌గా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భర్తీ చేసే 53దుకాణాల్లో కిరోసిన్ హాకర్లు నియమ నిబంధనల ప్రకారం లేకుంటే ఎన్నికల అనంతరం కొత్తగా నోటిఫికేషన్లు వేసి కొత్త డీలర్లను ఎంపిక చేయనున్నారు. నిబంధనలిలా... 1994వ సంవత్సరం నుంచి కిరోసిన్ హాకర్‌గా ఉండాలి. 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. వయసు నిబంధన లేదు. హాకర్లకే రేషన్ దుకాణాలు జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 53రేషన్‌దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ కిరోసిన్ హాకర్ ఉంటే వారి సమీపంలోని ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం అక్కడి అధికారులు డీలర్లను ఎంపిక చేస్తారు. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం -
రేషన్ టెన్షన్
సాక్షి, మెదక్: రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టడంతో జిల్లాలో రేషన్ పంపిణీపై ఉత్కంఠ నెలకొంది. డీలర్లను భయపెట్టి దారిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం యత్నం ఫలించడం లేదు. జిల్లాలో మెజార్టీ డీలర్లు డీడీలు కట్టకపోవటంతో సమ్మె సాగుతోంది. డీలర్ల సస్పెన్షన్ వేటుపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సరుకుల కోసం డీడీలు చెల్లించని డీలర్లను సస్పెండ్ చేస్తామంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే ఆలోచనను మాత్రం విరమించుకున్నట్లు సమాచారం. సస్పెన్షన్ల అంశం పక్కనబెట్టి లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో అధికారులు సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. రేషన్ డీలర్లు గౌరవ వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీలర్లకు రూ.20 కమీషన్ వస్తోంది. కమీషన్‌ను రూ.70 పెంచాలని, రూ.30వేల గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేస్తున్నారు ఇద్దరు మాత్రమే.. ఈ–పాస్ విధానంతో రేషన్ డీలర్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ పాస్ విధానంతో వారి అదనపు ఆదాయం పడిపోయింది. దీంతో డీలర్లు దుకాణాలను నడపటం కష్టం అవుతోంది. దీంతో డీలర్లు కమీషన్ పెంచాలని, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జూలై మాసానికి 28 తేదీలోగా డీడీలు కట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం జిల్లాలో కేవలం ఇద్దరు డీలర్లు మాత్రమే డీడీలు కట్టారు. దీంతో కలెక్టర్ ధర్మారెడ్డి స్వయంగా డీలర్లు వెంటనే డీడీ కట్టాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా రేషన్ డీలర్లు స్పందించడం లేదు. ఇప్పటికీ 519 మంది డీలర్లు డీడీలు కట్టలేదు. దీంతో కలెక్టర్ డీలర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు జిల్లాలోని 519 మంది రేషన్ డీలర్లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చాలా మంది డీలర్లు షోకాజ్ నోటీసులు అందుకునేందుకు విముఖత చూపారు. దీంతో రెవెన్యూ సిబ్బంది షోకాజ్ నోటీసులను రేషన్ షాపులకు దగ్గర అతికించారు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా రేషన్ డీలర్లు డీడీలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. దీంతో రేషన్ డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ మొదట నిర్ణయించారు. అయితే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయవద్దని సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం సూచించటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రత్యామ్నాయ చర్యలు షురూ రేషన్‌డీలర్లు డీడీలు చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక గ్రూపుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందుకోసం సోమ, మంగళవారం రెండు రోజులు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఐకేపీ సంఘాలకు రేషన్ సరుకుల పంపిణీపై శిక్షణ ఇవ్వనున్నారు. సరుకుల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 499 సహాయ సంఘాలను, పట్టణాల్లో 20 మెప్మా గ్రూప్‌లను గుర్తించారు. సరుకులను ఉంచడానికి 417 గ్రామ పంచాయతీ భవనాలు, 46 ఐకేపీ భవనాలు, 10 కమ్యూనిటీ హాల్స్‌ను, 46 వేరొక భవనాలను గుర్తించారు. ఈ పాస్ విధానంలో ఐకేపీ సంఘాలు సరుకుల పంపిణీ చేపడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఐకేపీ సంఘాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏవైన ఫిర్యాదులుంటే 9985390891 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
ముగ్గురు రేషన్ డీలర్ల లైసెన్స్‌లు రద్దు
సిరిసిల్ల : సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లోని ముగ్గురు రేషన్ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు సిరిసిల్ల ఆర్డీవో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బుధవారం తెలిపారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన రేషన్ డీలర్లు బి.లక్ష్మి, ఎస్.స్వామి, వేములవాడకు చెందిన ఎస్.నాగభూషణం డీలర్ షిప్‌లను రద్దు చేశామని ఆర్డీవో వివరించారు. పౌరసరఫరాల సరుకులను సక్రమంగా ప్రజలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు వారి లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని ఆర్డీవో తెలిపారు. డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.