218 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | Ration Rice Seized Warangal | Sakshi
Sakshi News home page

218 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Published Wed, Dec 26 2018 11:53 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Ration Rice Seized Warangal - Sakshi

అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్‌ బియ్యంతో ఉన్న లారీని సీజ్‌ చేస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

నెల్లికుదురు (మహబూబాబాద్‌) : 218క్వింటాళ్ల రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని లారీ సీజ్‌ చేసి 15మందిపై కేసు నమోదు చేసినట్లు  ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తొర్రూర్‌ డీఎస్పీ జి.మదన్‌లాల్, సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌లతో కలసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.  నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్శింహులపేట   మండలాల్లో పోలీసులు  అలర్ట్‌గా ఉన్నప్పటికీ రేషన్‌ బియ్యం, ఇసుక అక్రమ దందాలు నిర్వహిస్తున్నారని వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు తెలిపారు.

 మండలంలోని శ్రీరామగిరి, వావిలాల, బంజర, ఆలేరు గ్రామాలల్లోని రేషన్‌ డీలర్లు  తండ్రీకొడుకులు సంద సీతయ్య, కుమారుడు సంద అనిల్‌ (ఇద్దరు), ఆవుల సంధ్యారాణి, భర్త వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, గొట్టె నర్సయ్యలతో  మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ గ్రామానికి చెందిన బానోతు రాములు, వేముల రామారావు, జంగిలిగొండకు చెందిన కొయ్యాల కొమురెల్లి,  వావిలాల గ్రామానికి చెందిన మార్త యుగేందర్, ఓ ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న గోగుల ప్రశాంత్‌(సాక్షికాదు), శామకూరి వెంకన్న, చిన్నముప్పారం గ్రామానికి చెందిన ఒబిలిశెట్టి నర్సయ్య, ఈస్ట్‌గోదావరి జిల్లా అద్దెటిగల్‌ మండల కేంద్రానికి చెందిన గొలుసు శ్రీనివాసరావులు కుమ్మకై పీడీఎస్‌ బియ్యాన్ని వివిధ గ్రామాల్లో సేకరించినట్లు తెలిపారు.

సేకరించిన బియ్యాన్ని అక్రమంగా  తరలిస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌కు వచ్చిన సమాచారంతో పోలీసు సిబ్బందితో కలసి వెళ్లి మండల కేంద్రంలోని క్రాస్‌ రోడ్‌ వద్ద వాహానాల తనిఖీ  నిర్వహిస్తుండగా 218క్వింటాళ్ళ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్, మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోతున్నారని తెలిపారు. వారిని పట్టుకుని విచారించి తనిఖీ చేయగా లారీలో రేషన్‌ బియ్యం ఉన్నట్లు తెలిపారు.   రేషన్‌ బియ్యం లోడు లారీని సీజ్‌ చేసి, 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  బానోతు రాములు, సంద అనిల్,  అవుల వెంకటనర్సయ్య (ఇద్దరు), గట్టు వేణు, బాద ఉప్పలయ్యల, ఒబిలిశెట్టి నర్సయ్య, గొలుసు శ్రీనివాసరావు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిల వారు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి రెండోసారి భారీ మొత్తంలో రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. రివార్డులు అందజేస్తామని తెలిపారు.

బియ్యం వ్యాపారంలో డీలర్లు ఉండటం విచారకరం
ప్రభుత్వ సొమ్ము తింటూ రేషన్‌ బియ్యం దందాలో  నలుగురు డీలర్లు, వారి కుటుంబ సభ్యులు ఇద్దరు ఉండడం  విచారకరమని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈ వ్యాపారంలో ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, రేషన్‌ డీలర్లపై,  అక్రమ వ్యాపారంలో అరెస్టు అయిన వారిపై పీడీయాక్టును ఉపయోగించేందుకు నివేదికను కలెక్టర్‌కు  అందిస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement