సాక్షి, వరంగల్ : మహారాష్ట్ర గొండియా సమీపంలోని ఓ రైసుమిల్లుకు తరలిస్తున్న 184 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఈనెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ రేషన్ బియ్యం డాన్.. బినామీ పేరిట మహారాష్ట్రలో మిల్లు నడుపుతున్నాడు. ఆ మిల్లుకే బియ్యం పంపిస్తుండగా పట్టుకున్నారు. అయితే, ఆ డాన్ చేసే దందా మొత్తం రెండు రాష్ట్రాల అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా.. అప్పుడప్పుడు ఇలా సీజ్ చేస్తున్నారని చెబుతున్నారు.
సరిగ్గా నెల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ శివారు రాంచంద్రాపూర్ జడల్‌పేట గ్రామాల మధ్య అక్రమంగా తరలిస్తున్న 278 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, పరకాలకు చెందిన కొందరు సిండికేట్‌గా మారి దళారుల నుంచి ఈ బియ్యాన్ని సేకరించినట్లు తేలింది. ఈ బియ్యం కూడా మహారాష్ట్రలోని సదరు మిల్లుకే వెళ్తున్నట్లు వెల్లడైంది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 1,425 క్వింటాళ్ల రేషన్ బియ్యం వివిధ ప్రభుత్వశాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని హుజూరాబాద్, ఎల్కతుర్తి, కమలాపూర్, పరకాల, హన్మకొండ, నర్సంపేట కేంద్రాలుగా... వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న దళారులు రూ.లక్షలు గడిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారి మహారాష్ట్రలో బినామీ పేరుతో ఏర్పాటు చేసిన రైసుమిల్లుకు ఈ బియ్యం తరలిస్తున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు వరంగల్, కరీంనగర్ జిల్లాల అధికారులకు ఇదంతా తెలిసినా.. మొక్కుబడి దాడులతో ‘మమ’ అనిపిస్తుండడంతో దందా యథేచ్ఛగా సాగుతుండగా.. మరో పక్క అధికారులకు కాసులు కురిపిస్తోంది.
బియ్యానికి పాలిష్ పెట్టి...
బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.35 నుంచి రూ.48 వరకు పలుకుతుండటంతో రేషన్ బియ్యానికి గిరాకీ పెరుగుతోంది. సంచులు మార్చి.. పాలిష్ పెడుతున్న దళారులు ఎల్లలు దాటిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల చివరి గ్రామాల అడ్డాలుగా కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన ద్వారా మహారాష్ట్రలోని గొండియాకు తరలిస్తున్నారు. ఇలా గొండియాకు తరలిస్తున్న రెండు లారీల(400 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన మరచిపోకముందే ఈ నెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో రూ.16.15 లక్షల విలువైన 184 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బియ్యం కూడా సైతం గతంలో రెండు లారీల బియ్యం తరలింపు కేసులో నిందితుడుగా ఉన్న హుజూరాబాద్‌కు చెందిన సాయిల్ల రాజు, ఆయన అనుచరులకు చెందినవిగా గుర్తించారు. జమ్మికుంట మండలం ఇల్లంతకుంట నుంచి పంగిడిపల్లి, వంగపల్లి ద్వారా భూపాలపల్లి, కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందు వరంగల్ నుంచి మహారాష్ట్రకు లారీ(సీజీ 04 జేసీ 0996)లో 200 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా మహదేవపూర్ మండలం కుదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వ్యాపారి సాదుల నవీన్, అతని గుమస్తా సదానందం, లారీ డ్రైవర్ భూపేంద్ర కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో మరో 50 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి జిల్లా అధికారులు పట్టుకోగా, హుజూరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీ, 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో బాగోతం బయటపడింది.
ఈ వ్యవహారంలోనూ సాయిళ్ల రాజుతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా 184 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి మహారాష్ట్రకు బియ్యం తరలింపు దందా నిత్యకృత్యంగా సాగుతున్నట్లు తేలింది. ఇలా బియ్యాన్ని తరలించే క్రమంలో హుజూరాబాద్, పరకాల నుంచి కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్ర వరకు ఉండే ప్రతీ పోలీసుస్టేషన్, రెవెన్యూ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులకు కొందరు లెక్క ప్రకారం నెల నెల మామూళ్లు ఇస్తున్నట్లు వ్యాపారులే ప్రచారం చేస్తున్నారు. కాగా, బియ్యం పట్టుబడిన సమయంలో కేవలం 6ఏ కేసులతో సరిపుచ్చుతున్న అధికారులు.. పదే పదే దొరుకుతున్న సదరు వ్యాపారులపై ‘పీడీ’ అస్త్రం ప్రయోగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మరో మోసానికి తెరతీసే యత్నం
రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ ఖరీఫ్ కొనుగోళ్లకు ముందే ‘రేషన్ బియ్యం’ సూత్రధారి మరో మోసానికి తెరతీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బినామీల పేరిట మిల్లులు నడుపుతున్న సదరు వ్యాపారి ఇక్కడ దళారుల నుంచి క్వింటాకు రూ.1500 నుంచి రూ.1600 చొప్పున చెల్లించి కొనుగోలు చేశాక మహారాష్ట్ర ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ.2100 చొప్పున ముందస్తు లెవీగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
దీని ద్వారా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 నుంచి రూ.600 వరకు లబ్ధి జరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కో లారీ(200 క్విం టాళ్లపై) రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కాగా, రైసు మి ల్లు ద్వారా చెల్లించే ఒక ఏ.సీ.కే.(270 క్వింటాళ్లు) బియ్యం కింద మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని తిరిగి ఇస్తుంది. అంటే తొలుత 270 క్వింటాళ్లపై రూ.1,35,000 నుంచి రూ. 1,62,000 వరకు సంపాదించిన వ్యాపారులు ప్రభుత్వం ఇచ్చే 400 క్వింటాళ్ల ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 చొప్పున విక్రయించి రూ.7.20 లక్షల వరకు సంపాదించనున్నారు. ఇలా చేయడం ద్వారా నెలలో కనీసం 15 నుంచి 20 ఏ.సీ.కే.ల టర్నోవర్ చేస్తున్న సదరు వ్యాపారులు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గడించే ఎత్తుగడతో ముందుకెళ్తుండగా.. కొన్నిచోట్ల బియ్యం పట్టుబడిన క్రమంలో వారి పన్నాగం బయటపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment