vigilence enforecement
-
తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ సోదాలు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో (Telangana university) మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య విబేధాలపై తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు దృష్టిసారించారు. ఇదిలా ఉంటే.. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇదీ చదవండి: జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ వర్సిటీలు డల్.. కారణం అదేనా! -
‘వంట నూనె ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వంట నూనెలను ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విజిలెన్స్ దాడులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. పాత స్టాక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమాలకు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు పెడతామని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. బ్రాండ్ల పేరుతో మోసం చేసిన 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. అక్రమాలపై 9440906254 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని శంఖబ్రత బాగ్చి సూచించారు. -
ఏం జరిగిందేమో కానీ.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
కడప అర్బన్ : కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్న పెనుగొండ రవికుమార్ భార్య ప్రసూన (35) ఈనెల 8న ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన జరిగిన వెంటనే ఆమెను కడపలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో వైద్యసేవల కోసం చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి గైక్వాడ్ వీరోజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ ఎస్ఐ జి. అమర్నాథ్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పెనుగొండ రవికుమార్‌కు, తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన గైక్వాడ్ వీరోజీరావు కుమార్తె ప్రసూనకు 2011లో వివాహమైంది. 2012 బ్యాచ్‌కు చెందిన రవికుమార్ శిక్షణను పూర్తి చేసుకుని 2014 ప్రారంభంలో ఎస్ఐగా విధుల్లో చేరారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జైన శ్రీపాద (8), స్పోహిత (6) ఉన్నారు. వీరు ప్రస్తుతం కడపలోని ఓంశాంతినగర్‌లో ఉంటున్నారు. రవికుమార్ ప్రస్తుతం కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎస్ఐగా విధులను నిర్వహిస్తున్నారు. ప్రసూన అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఆసుపత్రులకు తిరిగేవారమని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెడ్రూంలో ఎస్ఐ రవికుమార్ ఉండగా, మరో బెడ్రూంలోకి ప్రసూన వెళ్లింది. తలుపునకు గడియపెట్టుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రవికుమార్ బెడ్రూం వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపు బద్దలుకొట్టాడు. వెళ్లిచూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. వెంటనే కిందకు దించి ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమ ఉల్లిని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ఉల్లిని అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారస్తులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఉల్లి బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహాత్మగాంధీ హోల్‌సేల్ కయర్షియల్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఉల్లిని నిల్వచేసిన 100వ షాపు నెంబరుకు ఎలాంటి లైసెన్సు లేకపోవడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. స్టాక్‌లో ఉన్న ఉల్లిని బయటకు తీసుకొచ్చి మార్కెట్ ధరకు అమ్ముడయ్యేలా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. -
‘రూపాయి’పై రాబందుల కన్ను
సాక్షి, వరంగల్ : మహారాష్ట్ర గొండియా సమీపంలోని ఓ రైసుమిల్లుకు తరలిస్తున్న 184 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఈనెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ రేషన్ బియ్యం డాన్.. బినామీ పేరిట మహారాష్ట్రలో మిల్లు నడుపుతున్నాడు. ఆ మిల్లుకే బియ్యం పంపిస్తుండగా పట్టుకున్నారు. అయితే, ఆ డాన్ చేసే దందా మొత్తం రెండు రాష్ట్రాల అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా.. అప్పుడప్పుడు ఇలా సీజ్ చేస్తున్నారని చెబుతున్నారు. సరిగ్గా నెల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామ శివారు రాంచంద్రాపూర్ జడల్పేట గ్రామాల మధ్య అక్రమంగా తరలిస్తున్న 278 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, పరకాలకు చెందిన కొందరు సిండికేట్‌గా మారి దళారుల నుంచి ఈ బియ్యాన్ని సేకరించినట్లు తేలింది. ఈ బియ్యం కూడా మహారాష్ట్రలోని సదరు మిల్లుకే వెళ్తున్నట్లు వెల్లడైంది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 1,425 క్వింటాళ్ల రేషన్ బియ్యం వివిధ ప్రభుత్వశాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని హుజూరాబాద్, ఎల్కతుర్తి, కమలాపూర్, పరకాల, హన్మకొండ, నర్సంపేట కేంద్రాలుగా... వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న దళారులు రూ.లక్షలు గడిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారి మహారాష్ట్రలో బినామీ పేరుతో ఏర్పాటు చేసిన రైసుమిల్లుకు ఈ బియ్యం తరలిస్తున్నారు. అటు మహారాష్ట్ర, ఇటు వరంగల్, కరీంనగర్ జిల్లాల అధికారులకు ఇదంతా తెలిసినా.. మొక్కుబడి దాడులతో ‘మమ’ అనిపిస్తుండడంతో దందా యథేచ్ఛగా సాగుతుండగా.. మరో పక్క అధికారులకు కాసులు కురిపిస్తోంది. బియ్యానికి పాలిష్ పెట్టి... బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.35 నుంచి రూ.48 వరకు పలుకుతుండటంతో రేషన్ బియ్యానికి గిరాకీ పెరుగుతోంది. సంచులు మార్చి.. పాలిష్ పెడుతున్న దళారులు ఎల్లలు దాటిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల చివరి గ్రామాల అడ్డాలుగా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన ద్వారా మహారాష్ట్రలోని గొండియాకు తరలిస్తున్నారు. ఇలా గొండియాకు తరలిస్తున్న రెండు లారీల(400 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన మరచిపోకముందే ఈ నెల 5న కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో రూ.16.15 లక్షల విలువైన 184 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం కూడా సైతం గతంలో రెండు లారీల బియ్యం తరలింపు కేసులో నిందితుడుగా ఉన్న హుజూరాబాద్‌కు చెందిన సాయిల్ల రాజు, ఆయన అనుచరులకు చెందినవిగా గుర్తించారు. జమ్మికుంట మండలం ఇల్లంతకుంట నుంచి పంగిడిపల్లి, వంగపల్లి ద్వారా భూపాలపల్లి, కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందు వరంగల్ నుంచి మహారాష్ట్రకు లారీ(సీజీ 04 జేసీ 0996)లో 200 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా మహదేవపూర్ మండలం కుదురుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వ్యాపారి సాదుల నవీన్, అతని గుమస్తా సదానందం, లారీ డ్రైవర్ భూపేంద్ర కుమార్‌పై కేసులు నమోదయ్యాయి. ఇక వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో మరో 50 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి జిల్లా అధికారులు పట్టుకోగా, హుజూరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న లారీ, 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలోనూ సాయిళ్ల రాజుతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా 184 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి మహారాష్ట్రకు బియ్యం తరలింపు దందా నిత్యకృత్యంగా సాగుతున్నట్లు తేలింది. ఇలా బియ్యాన్ని తరలించే క్రమంలో హుజూరాబాద్, పరకాల నుంచి కాళేశ్వరం వంతెన మీదుగా మహారాష్ట్ర వరకు ఉండే ప్రతీ పోలీసుస్టేషన్, రెవెన్యూ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులకు కొందరు లెక్క ప్రకారం నెల నెల మామూళ్లు ఇస్తున్నట్లు వ్యాపారులే ప్రచారం చేస్తున్నారు. కాగా, బియ్యం పట్టుబడిన సమయంలో కేవలం 6ఏ కేసులతో సరిపుచ్చుతున్న అధికారులు.. పదే పదే దొరుకుతున్న సదరు వ్యాపారులపై ‘పీడీ’ అస్త్రం ప్రయోగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరో మోసానికి తెరతీసే యత్నం రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ ఖరీఫ్ కొనుగోళ్లకు ముందే ‘రేషన్ బియ్యం’ సూత్రధారి మరో మోసానికి తెరతీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బినామీల పేరిట మిల్లులు నడుపుతున్న సదరు వ్యాపారి ఇక్కడ దళారుల నుంచి క్వింటాకు రూ.1500 నుంచి రూ.1600 చొప్పున చెల్లించి కొనుగోలు చేశాక మహారాష్ట్ర ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ.2100 చొప్పున ముందస్తు లెవీగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. దీని ద్వారా ఒక్కో క్వింటాల్‌పై రూ.500 నుంచి రూ.600 వరకు లబ్ధి జరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కో లారీ(200 క్విం టాళ్లపై) రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కాగా, రైసు మి ల్లు ద్వారా చెల్లించే ఒక ఏ.సీ.కే.(270 క్వింటాళ్లు) బియ్యం కింద మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని తిరిగి ఇస్తుంది. అంటే తొలుత 270 క్వింటాళ్లపై రూ.1,35,000 నుంచి రూ. 1,62,000 వరకు సంపాదించిన వ్యాపారులు ప్రభుత్వం ఇచ్చే 400 క్వింటాళ్ల ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 చొప్పున విక్రయించి రూ.7.20 లక్షల వరకు సంపాదించనున్నారు. ఇలా చేయడం ద్వారా నెలలో కనీసం 15 నుంచి 20 ఏ.సీ.కే.ల టర్నోవర్ చేస్తున్న సదరు వ్యాపారులు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గడించే ఎత్తుగడతో ముందుకెళ్తుండగా.. కొన్నిచోట్ల బియ్యం పట్టుబడిన క్రమంలో వారి పన్నాగం బయటపడుతోంది. -
హల్దీ బచావో..
సాక్షి, తూప్రాన్: వెల్దుర్తి మండలంలోని హకింపేట, అచ్చంపేట, కొప్పులపల్లి, హస్తాల్పూర్, మెల్లూర్, ఉప్పులింగాపూర్, ఆరెగూడెం, పంతులుపల్లి, దామరంచ, కుకునూర్ తదితర గ్రామాల్లోని పంట పొలాలకు సాగు నీరందించే వరప్రదాయని హకింపేట శివారులోని హల్దీప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అక్రమ మట్టి, మొరం రవాణా మూడు హిటాచీ యంత్రాలు ఆరు టిప్పర్లు అన్న చందంగా తయారైంది. వాల్టా చట్టానికి విరుద్ధంగా.. ప్రతి రోజు ప్రాజెక్ట్‌లోని వెనుక భాగంలో పెద్ద పెద్ద హిటాచీ, జేసీబీ యంత్రాలతో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం, నల్లమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు స్థానికంగా భూములు కొనుగోలు చేసిన నగరంలోని బడా భూస్వాములకు తరలిస్తుండగా మరికొందరు ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా గత కొద్ది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో ప్రాజెక్ట్ వెనుకభాగంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరితే లోతు తెలీక మూగజీవాలు, పశువుల కాపరులు మృత్యువాత పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే బెదిరింపులు! అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు సమాచారం అందిస్తే అడ్డుకోవాల్సింది పోయి వారు సంబంధిత అక్రమార్కులకు తమ ఫోన్ నంబర్లు ఇస్తున్నారని, ఫలితంగా సంబంధిత వ్యక్తుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు అలవాటుపడటం వల్లే ప్రాజెక్ట్‌లో విలువైన మట్టిని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట పొలాలకు మట్టి తీసుకెళ్తే నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేసే అధికారులకు అక్రమ రవాణా కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు హల్దీ ప్రాజెక్ట్‌లో అక్రమ తవ్వకాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ అనంతరెడ్డి ఆదేశాలను కిందిస్థాయి అధికారులు పెడచెవిన పె డుతున్నారు. ప్రాజెక్ట్ శిఖం భూమిలో ఆక్రమణకు గురైన స్థలాలను సర్వే చేపట్టి కబ్జా జేసిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించినా సిబ్బంది పట్టించుకోడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నీరు వచ్చే అవకాశం.. కాళేశ్వరం కాలువ ద్వారా సాగునీరు హల్దీ ప్రాజెక్ట్‌లోకి చేరే అవకాశం ఉన్నందున, ప్రాజెక్ట్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు పూర్తిగా నిషేధించి, శిఖం ప్రాంతాన్ని పూర్తిగా సంరక్షించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. విజిలెన్స్ ఏర్పాటు చేస్తాం హల్దీ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా మొరం, మట్టి తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. రెవిన్యూ, పోలీస్ అధికారులచే విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా రవాణా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్ -
కూల్ కూల్‌గా మోసం
సాక్షి,వేపగుంట(గోపాలపట్నం (విశాఖపశ్చిమ) : నాణ్యత పాటించని ఫ్రూట్ జ్యూస్ షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. వేపగుంట సాయిమాధవనగర్‌లో పిల్లా శ్రీనివాసరావు శీతల పానీయాల తయారీ కేంద్రం కృప ఏజెన్సీస్ పేరిట నిర్వహిస్తున్నాడు. బుధవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎంనాయుడు ఆ శాఖ ఎస్ఐ రమేష్, ఆహార భద్రతాధికారులు వెంకటరత్నం, శ్రీరాములుతో అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. శీతల పానీయాల తయారీకి శుద్ధి చేసిన నీరు వాడాల్సి ఉండగా, ఇక్కడ మా త్రం బాటిళ్లలో బావిలో నీరుపోసేస్తున్నారు. అందులో మామిడి, ద్రాక్ష రసాలతో పాటు కొద్ది రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలి పేస్తున్నారు. దీంతో శ్రీనివాసరావును అరె స్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శాంపిళ్లను హై దరాబాద్ సేఫ్టీ ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. -
భారీగా గుట్కాల స్వాధీనం
రామాయంపేట(మెదక్): పట్టణంలోని ఒక కిరాణ దుకాణంపై దాడిచేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రూ. లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నారు. తను సిబ్బందితో కలిసి ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ సీఐ బాల్‌రెడ్డి చెప్పారు. సదరు వ్యాపారి దుకాణం వెనుకభాగంలో ఉన్న గోదాంలో దాచి ఉంచిన నిషేధిత గుట్కా, జర్ధా, సాగర్, షైనీ గుట్కా ప్యాకెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకుని గోదాంకు సీల్‌వేసి వెళ్లిపోయామన్నారు. శుక్రవారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి రవీందర్రావు, మరో అధికారి విద్యాకర్‌రెడ్డి, తాను గోదాంను తెరిచి తనిఖీ చేసి 30 బ్యాగుల్లో దాచి ఉంచిన ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నామన్నారు. ఈమేరకు పంచనామా నిర్వహించి దుకాణం యజమాని సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
118 మందికి క్లీన్ ‘చీట్’
సాక్షి, హైదరాబాద్: అక్రమార్జన మరిగిన అవినీతి అధికారుల గుట్టు రట్టు చేస్తూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇస్తున్న నివేదికలు వృథాగా మారిపోతున్నాయి. సాక్ష్యాధారాల మేరకు అక్రమాధికారులపై చర్యలు తీసుకోవలసిన తెలుగుదేశం ప్రభుత్వం... అవినీతిపరుల కొమ్ము కాస్తూ వారికి క్లీన్చిట్ ఇచ్చేస్తోంది. సర్కారు కళ్లకు గంతలు కట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోగా క్లీన్చిట్లు ఇస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గే అవినీతి అధికారులకు సర్కారు అండగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే 49 కేసుల్లో నిందితులైన 118 మంది అవినీతి అధికారులకు క్లీన్ చిట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ కేసుల్లో నిందితులైన అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పి.. తమపై చర్యలు తీసుకోకుండా వారిచేత ఒత్తిడి చేయిస్తున్నారని వినిపిస్తోంది. ఆ ఒత్తిళ్లకు తలొగ్గుతోన్న ప్రభుత్వం అక్రమాధికారులకు క్లీన్ చిట్ ఇచ్చేస్తోంది. ఇందుకు ఉదాహరణలెన్నో... ** మంత్రి కె.మృణాళిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తోన్న ఎ.రామకృష్ణారావు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో డీఈఈగా పనిచేస్తోన్న సమయంలో బలిజపేట మండలంలో పనికి ఆహార పథకం పనుల్లో భారీ ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు మే 28, 2012న విజిలెన్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామకృష్ణారావుపై కఠిన చర్యలు తీసుకుని, మింగేసిన రూ.75 లక్షలను వసూలు చేయాలని సిపార్సు చేశారు. కానీ.. కీలక మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం రామకృష్ణారావుకు శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ** నెల్లూరులో సహాయ సాంఘిక సంక్షేమ అధికారులుగా పనిచేసిన ఎ.పటేల్, ఉదయగిరితో పాటు ఆత్మకూరు మండలంలో ఏఎస్‌డబ్ల్యూవోగా పనిచేసిన పి.విజయలక్ష్మి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఉపకార వేతనాలను భారీ ఎత్తున కాజేసినట్లు ఫిబ్రవరి 2, 2008న ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదించింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఆ ఇద్దరు ఏఎస్డబ్ల్యూవోలపై కఠిన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ డిసెంబర్ 3, 2013న సర్కారుకు సూచించారు. కానీ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో ప్రభుత్వం ఆ ఇద్దరు ఏఎస్డబ్ల్యూవోలకూ ఈనెల 13న క్లీన్ చిట్ ఇచ్చింది. ** అనంతపురం జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ పథకం కింద టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కొనుగోళ్లలో 2003 నుంచి 2007 వరకూ ఏపీసీలు మురళీధర్, పి.రామ్మోహన్, సూపరిండెంట్ బీజే పుష్ఫరాజ్, ఏఏవో వెంకటేష్‌నాయక్‌లు అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రభుత్వానికి రూ.2.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జూన్ 4, 2008న ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై విచారణ జరిపిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్.. అక్రమాలకు పాల్పడిన నలుగురు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్చి 21, 2014న ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కానీ.. అనంతపురం జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి ఒత్తిళ్లకు తొలగ్గిన ప్రభుత్వం ఆ నలుగురు అధికారులకు ఈ నెల 3న క్లీన్ చిట్ ఇచ్చింది. విజిలెన్స్ విభాగం పనంతా వృథా.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధ్యయనం చేసి, అక్రమాలు చోటుచేసుకుని ఉంటే వాటిని ససాక్ష్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. విజిలెన్స్ నివేదికలను.. ఆయా శాఖల కార్యదర్శుల పరిశీలనకు ప్రభుత్వం పంపుతుంది. అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరణను తీసుకుని.. వాటిని విజిలెన్స్ నివేదికతో సరిపోల్చి, శాఖాపరమైన విచారణతో వాటిని రూఢీ చేసుకుని ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఆయా శాఖల కార్యదర్శులపై ఉంటుంది. విజిలెన్స్ నివేదిక, ఆయా శాఖల కార్యదర్శుల ప్రతిపాదనల ఆధారంగా అక్రమాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ.. చంద్రబాబు సర్కారు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. విజిలెన్స్ నివేదికలను నీరుగార్చుతూ.. అక్రమాధికారులకు ‘క్లీన్ చిట్’ ఇస్తోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం బలహీన పడుతోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వాపోయారు.