118 మందికి క్లీన్ ‘చీట్’
సాక్షి, హైదరాబాద్: అక్రమార్జన మరిగిన అవినీతి అధికారుల గుట్టు రట్టు చేస్తూ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇస్తున్న నివేదికలు వృథాగా మారిపోతున్నాయి. సాక్ష్యాధారాల మేరకు అక్రమాధికారులపై చర్యలు తీసుకోవలసిన తెలుగుదేశం ప్రభుత్వం... అవినీతిపరుల కొమ్ము కాస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చేస్తోంది. సర్కారు కళ్లకు గంతలు కట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోగా క్లీన్‌చిట్‌లు ఇస్తుండడం అధికారులను నివ్వెరపరుస్తోంది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గే అవినీతి అధికారులకు సర్కారు అండగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే 49 కేసుల్లో నిందితులైన 118 మంది అవినీతి అధికారులకు క్లీన్ చిట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ కేసుల్లో నిందితులైన అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పి.. తమపై చర్యలు తీసుకోకుండా వారిచేత ఒత్తిడి చేయిస్తున్నారని వినిపిస్తోంది. ఆ ఒత్తిళ్లకు తలొగ్గుతోన్న ప్రభుత్వం అక్రమాధికారులకు క్లీన్ చిట్ ఇచ్చేస్తోంది. ఇందుకు ఉదాహరణలెన్నో...
** మంత్రి కె.మృణాళిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తోన్న ఎ.రామకృష్ణారావు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో డీఈఈగా పనిచేస్తోన్న సమయంలో బలిజపేట మండలంలో పనికి ఆహార పథకం పనుల్లో భారీ ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు మే 28, 2012న విజిలెన్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామకృష్ణారావుపై కఠిన చర్యలు తీసుకుని, మింగేసిన రూ.75 లక్షలను వసూలు చేయాలని సిపార్సు చేశారు. కానీ.. కీలక మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం రామకృష్ణారావుకు శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది.
** నెల్లూరులో సహాయ సాంఘిక సంక్షేమ అధికారులుగా పనిచేసిన ఎ.పటేల్, ఉదయగిరితో పాటు ఆత్మకూరు మండలంలో ఏఎస్‌డబ్ల్యూవోగా పనిచేసిన పి.విజయలక్ష్మి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఉపకార వేతనాలను భారీ ఎత్తున కాజేసినట్లు ఫిబ్రవరి 2, 2008న ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదించింది. విజిలెన్స్ నివేదిక మేరకు ఆ ఇద్దరు ఏఎస్‌డబ్ల్యూవోలపై కఠిన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ డిసెంబర్ 3, 2013న సర్కారుకు సూచించారు. కానీ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో ప్రభుత్వం ఆ ఇద్దరు ఏఎస్‌డబ్ల్యూవోలకూ ఈనెల 13న క్లీన్ చిట్ ఇచ్చింది.
** అనంతపురం జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ పథకం కింద టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కొనుగోళ్లలో 2003 నుంచి 2007 వరకూ ఏపీసీలు మురళీధర్, పి.రామ్మోహన్, సూపరిండెంట్ బీజే పుష్ఫరాజ్, ఏఏవో వెంకటేష్‌నాయక్‌లు అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రభుత్వానికి రూ.2.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జూన్ 4, 2008న ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై విచారణ జరిపిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్.. అక్రమాలకు పాల్పడిన నలుగురు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్చి 21, 2014న ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కానీ.. అనంతపురం జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి ఒత్తిళ్లకు తొలగ్గిన ప్రభుత్వం ఆ నలుగురు అధికారులకు ఈ నెల 3న క్లీన్ చిట్ ఇచ్చింది.
విజిలెన్స్ విభాగం పనంతా వృథా..
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధ్యయనం చేసి, అక్రమాలు చోటుచేసుకుని ఉంటే వాటిని ససాక్ష్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. విజిలెన్స్ నివేదికలను.. ఆయా శాఖల కార్యదర్శుల పరిశీలనకు ప్రభుత్వం పంపుతుంది. అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరణను తీసుకుని.. వాటిని విజిలెన్స్ నివేదికతో సరిపోల్చి, శాఖాపరమైన విచారణతో వాటిని రూఢీ చేసుకుని ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఆయా శాఖల కార్యదర్శులపై ఉంటుంది.
విజిలెన్స్ నివేదిక, ఆయా శాఖల కార్యదర్శుల ప్రతిపాదనల ఆధారంగా అక్రమాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ.. చంద్రబాబు సర్కారు తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. విజిలెన్స్ నివేదికలను నీరుగార్చుతూ.. అక్రమాధికారులకు ‘క్లీన్ చిట్’ ఇస్తోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం బలహీన పడుతోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వాపోయారు.