
కడప అర్బన్ : కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న పెనుగొండ రవికుమార్ భార్య ప్రసూన (35) ఈనెల 8న ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన జరిగిన వెంటనే ఆమెను కడపలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో వైద్యసేవల కోసం చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి గైక్వాడ్ వీరోజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ ఎస్‌ఐ జి. అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.
వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పెనుగొండ రవికుమార్‌కు, తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన గైక్వాడ్ వీరోజీరావు కుమార్తె ప్రసూనకు 2011లో వివాహమైంది. 2012 బ్యాచ్‌కు చెందిన రవికుమార్ శిక్షణను పూర్తి చేసుకుని 2014 ప్రారంభంలో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జైన శ్రీపాద (8), స్పోహిత (6) ఉన్నారు. వీరు ప్రస్తుతం కడపలోని ఓంశాంతినగర్‌లో ఉంటున్నారు. రవికుమార్ ప్రస్తుతం కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో ఎస్‌ఐగా విధులను నిర్వహిస్తున్నారు. ప్రసూన అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఆసుపత్రులకు తిరిగేవారమని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెడ్‌రూంలో ఎస్‌ఐ రవికుమార్ ఉండగా, మరో బెడ్‌రూంలోకి ప్రసూన వెళ్లింది. తలుపునకు గడియపెట్టుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రవికుమార్ బెడ్‌రూం వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపు బద్దలుకొట్టాడు. వెళ్లిచూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. వెంటనే కిందకు దించి ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.