చేప విత్తనాల కోసం రూ. 200 కోట్లు | Rs. 200 crores for fish seeds | Sakshi
Sakshi News home page

చేప విత్తనాల కోసం రూ. 200 కోట్లు

Published Sat, Nov 22 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

చేప విత్తనాల కోసం రూ. 200 కోట్లు

చేప విత్తనాల కోసం రూ. 200 కోట్లు

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, చేప విత్తనాల కోసం రూ.200 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కల్యాణ మండపంలో శుక్రవారం తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ ‘డీ’లో నుంచి ‘ఏ’లోకి మార్చాలని ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు బాగుపడితే మొదటగా లాభపడేది మత్స్యకారులేనని ఆయన స్పష్టం చేశారు. 10 ఫీట్‌ల లోపు చెరువులను తవ్వితే మత్స్య పరిశ్రమ వ్యవసాయం కంటే తీసిపోదని అన్నారు.

వచ్చే బడ్జెట్‌లో మత్స్యకారుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తానని చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి మండల కార్యాలయంలో చేపల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జార్ఖండ్‌లో మాదిరిగా కేజీ కల్చర్‌ను ప్రవేశ పెట్టి 90 శాతం సబ్సిడీతో మత్స్యకారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండా ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్,  ప్రొఫెసర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయాలి: దత్తాత్రేయ
తెలంగాణ ప్రభుత్వం వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటుకు చొరవ చూపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన సిఫార్సులు ప్రభుత్వానికి అందడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటుకు త్వరలో  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ముదిరాజ్ కులస్తులను బీసీ డీ నుంచి ఏ గ్రూపులోకి తేవడానికి కేంద్ర మంత్రిగా తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు.

చెరువుల అభివృద్ధికి కేంద్రం తరఫున నిధులు మంజూరు చేయిస్తానని దత్తాత్రేయ వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ 50 శాతం జనాభా ఉన్న బీసీ కులాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 2వేల కోట్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి పొచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంకటేష్, జీ. మల్లయ్య ముదిరాజ్ తదితరులు మాట్లాడారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement