జన ధన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతీ ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘జన ధన యోజన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడమే కాకుండా, రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, మొదటి ఆరు నెలలు ఖాతాను సక్రమంగా వినియోగించిన వారికి రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్‌ను ఇస్తున్నామని తెలిపారు.
గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు తెలంగాణలో జన ధన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక బ్యాంకు శాఖతో పాటు, కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు ఖాతా ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సామాన్యునికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రూ. 5,000 నుంచి రూ.10,000కి, బీమా రక్షణను రెండు లక్షలకు పెంచాల్సిందిగా వెంకయ్యకు సూచించారు.
ఒక్క రోజులో 5 లక్షల ఖాతాలు
తెలంగాణ రాష్ట్రంలో జన ధన యోజనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్క రోజులోనే ఈ పథకం కింద సుమారు 5 లక్షల ఖాతాలను ప్రారంభించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు.
ప్రతీ 5 కిలోమీటర్లకు బ్యాంక్ శాఖ: వెంకయ్య
Published Fri, Aug 29 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement