Janadhana Yojana
-
ప్రతీ 5 కిలోమీటర్లకు బ్యాంక్ శాఖ: వెంకయ్య
జన ధన పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతీ ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘జన ధన యోజన’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడమే కాకుండా, రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, మొదటి ఆరు నెలలు ఖాతాను సక్రమంగా వినియోగించిన వారికి రూ. 5,000 ఓవర్ డ్రాఫ్ట్‌ను ఇస్తున్నామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు తెలంగాణలో జన ధన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకూ ఒక బ్యాంకు శాఖతో పాటు, కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు ఖాతా ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. సామాన్యునికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రూ. 5,000 నుంచి రూ.10,000కి, బీమా రక్షణను రెండు లక్షలకు పెంచాల్సిందిగా వెంకయ్యకు సూచించారు. ఒక్క రోజులో 5 లక్షల ఖాతాలు తెలంగాణ రాష్ట్రంలో జన ధన యోజనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, ఒక్క రోజులోనే ఈ పథకం కింద సుమారు 5 లక్షల ఖాతాలను ప్రారంభించామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ తెలిపారు. -
జనధన యోజనకు నేడు శ్రీకారం
సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో లాంఛనంగా ప్రారంభం జాతీయ బ్యాంకుల్లో కుటుంబానికి రెండు ఖాతాలు రూ-పే డెబిట్ కార్డ్ ఉంటే ఇంటిళ్లపాదికి లక్ష రూపాయల ప్రమాద బీమా మచిలీపట్నం : ప్రధానమంత్రి జన ధన యోజన పథకం జిల్లాలో నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. అన్ని జాతీయ బ్యాంకుల్లో కుటుంబానికి రెండు ఖాతాల చొప్పున ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి జనధన యోజన పథకాన్ని విజయవంతంగా చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి అన్ని జాతీయ బ్యాంకుల అధికారులకు బుధవారం లేఖలు అందాయి. దీంతో పాటు టెలీకాన్ఫరెన్స్,వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచే ప్రధాన మంత్రి జనధన యోజన పథకం ద్వారా ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. అయినప్పటికీ ఈ పథకంపై ప్రజల్లో విసృ్తతంగా అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు ఆర్వి.నరసింహారావు, ఎస్బీఐ మచిలీపట్నం ఏజీఎం బి.వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు విజయవాడలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాన మంత్రి సందేశం ఉంటుందన్నారు. ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో గ్రామాల్లో నడుస్తున్న కష్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీఎస్పీ సెంటరులో ఉన్న బిజినెస్ కరస్పాండెంట్లతో పాటు ఆయా శాఖల అధికారులు బ్యాంకు ఖాతాలు తెరిచే కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని బ్రాంచ్‌ల వద్ద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు విసృ్తత ప్రచారం నిర్వహించటంతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తూర్పు కృష్ణాజిల్లాలో 4వేల ఖాతాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్బీఐ మచిలీపట్నం ఏజీఎం తెలిపారు. ఇప్పటికే 1500 ఖాతాలు ఎస్బీఐ ద్వారా తెరచినట్లు ఆయన చెప్పారు. ఖాతా తెరిచేదిలా : ప్రధాన మంత్రి జనధన యోజన పథకం ద్వారా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, గ్రామ సర్పంచి జారీ చేసిన పత్రం ఇస్తే సరిపోతుంది. వీటితో పాటు రెండు ఫొటోలు ఇవ్వాలి. ఆధార్ కార్డు లేకున్నా రేషన్‌కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతా తెరుస్తారు. ఆరు నెలల్లోపు ఆధార్ కార్డు నంబరును ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఒక్క రూపాయి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా ఖాతా తెరిస్తే రూ-పే డెబిట్ కార్డు ఇస్తారు. ఈ కార్డు వీసా, మాస్టర్ కార్డు మాదిరిగా ఉపయోగపడుతుంది. ప్రయోజనాలివే.... ప్రధాన మంత్రి జన ధన యోజన పథకంలో బ్యాంకు ఖాతా తెరిస్తే సంబంధిత కుటుంబంలోని సభ్యులందరికీ లక్ష రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ లభిస్తుంది. రూ-పే డెబిట్ కార్డు ద్వారా దేశంలో ఎక్కడి ఏటీఎంలో నుంచైనా నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకు ఖాతాలో కనీస మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడికైనా డబ్బు సులభంగా పంపే వెసులుబాటు. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాల ద్వారా నగదు బదిలీకి అవకాశం. పెన్షన్, బీమా తదితరాల నగదును ఈ ఖాతాల ద్వారా తీసుకోవచ్చు.