చేప పిల్లల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
గత ప్రభుత్వంలో తప్పుడు రికార్డులతో నాణ్యత లేకుండా సరఫరా
ఈ నేపథ్యంలో సంఘాలకు నేరుగా డబ్బులివ్వాలని కోరుతున్న మత్స్యకారులు
ఈసారి పథకానికి రూ.100 కోట్లు అవసరం
ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందోనని చర్చ
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే నెల చివరికి వస్తున్నా ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా? లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించడానికి ఏ విధమైన పథకాన్ని తీసుకువస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది.
చేప పిల్లల పంపిణీపై గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న ఆందోళన మత్స్యకారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26,700 చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు.
అందుకోసం ఏప్రిల్‌లోనే టెండర్లు పిలిచి.. జూన్‌లో టెండర్లు ఖరారు చేశారు. ఈ పథకం అమలు విషయంలో గతంలో అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా? లేక మత్స్యకారులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందా అన్న చర్చ మత్స్యకార సంఘాల్లో జరుగుతోంది.
సమయం సరిపోదన్న భావనలో...
గతంలోలాగా పథకాన్ని కొనసాగిస్తే ఈసారి రూ. 100 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప పిల్లల సమీకరణకు కనీసం రెండు నెలల సమయం పడుతుందంటున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిస్తే చేపపిల్లల సేకరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, మత్స్యకారులకు చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
గత ప్రభుత్వంలో పలు ఆరోపణలు...
ఉచిత చేప పిల్లల పథకంపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. చెరువుల్లో అధికశాతం నాసిరకం చేప పిల్లలను వదిలారన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతలేని చేపపిల్లలను వదిలి తప్పుడు రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పలు గ్రామాల్లోని మత్స్యకారులు తమ చెరువుల్లో చేప పిల్లలు వదలొద్దని స్పష్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పథకం కింద సరఫరా చేసిన చేపలు సరిగా ఎదగలేదని అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం తిరస్కరించడం గమనార్హం.
ఉచిత చేప పిల్లల కంటే చేయూత ఇవ్వడం మంచిది. మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేస్తే నచ్చిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ఇలా చేయడం వలన నాణ్యతతో పాటు ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలను వదులుకోవాలనే నిర్ణయం కూడా మాదే ఉంటుంది. – శంకర్, మత్స్యకారుడు
Comments
Please login to add a commentAdd a comment