కె.రాఘవేందర్
సంకల్పం ధృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు ఈ యువకుడు. ఇంటర్‌లో ఫెయిల్ అయినా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. కష్టపడి చదివి పాసయ్యాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒకప్పుడు అతడ్ని హేళన చేసిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఈ యువకుడి విజయ గాథ అతని మాటల్లోనే..
నా పేరు కె.రాఘవేందర్. మాది రంగారెడ్డి జిల్లా దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని.
అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం పైన మార్కులు కానీ.. ఫెయిల్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్‌క్లాస్ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్ ఇయర్‌లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్‌నగర్‌లో డీఈడీ కోచింగ్‌కు కూడా వెళ్లాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను. అయితే, ‘ఫెయిల్’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్‌కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్ అని ఉంది.
ఎవరైతే నన్ను చూసి నవ్వారో.. వాళ్లే..
ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను.
మా అమ్మ కళ్లలో ఆనందం చేసి..
వెంటనే మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్‌లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్‌లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది.
ఒకసారి ఓడిపోతే..
ఇంటర్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి.
చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
Comments
Please login to add a commentAdd a comment