inter fail
-
హైదరాబాద్‌లో విషాదం.. ఇంటర్లో ఫెయిలయ్యామని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది. వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని నేరేడ్మెట్లో ఠాణా పరిధి వినాయక్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి.. -
ఇంటర్ ఫెయిల్.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా..
సంకల్పం ధృఢంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు ఈ యువకుడు. ఇంటర్లో ఫెయిల్ అయినా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. కష్టపడి చదివి పాసయ్యాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒకప్పుడు అతడ్ని హేళన చేసిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఈ యువకుడి విజయ గాథ అతని మాటల్లోనే.. నా పేరు కె.రాఘవేందర్. మాది రంగారెడ్డి జిల్లా దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని. అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం పైన మార్కులు కానీ.. ఫెయిల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్‌క్లాస్ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్ ఇయర్లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్‌నగర్‌లో డీఈడీ కోచింగ్‌కు కూడా వెళ్లాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను. అయితే, ‘ఫెయిల్’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్‌కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్ అని ఉంది. ఎవరైతే నన్ను చూసి నవ్వారో.. వాళ్లే.. ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను. మా అమ్మ కళ్లలో ఆనందం చేసి.. వెంటనే మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది. ఒకసారి ఓడిపోతే.. ఇంటర్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి. చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు -
వాట్సాప్‌లో మెసేజ్.. అన్నా.. నేను చనిపోతున్నా..!
పెద్దారవీడు(ప్రకాశం జిల్లా): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైనుంచి దూకి అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకం మిగిల్చిన ఈ విషాద సంఘటన పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వజ్రాల అశోక్‌రెడ్డి(17) మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదివాడు. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. పరీక్షలు రాసిన తర్వాత నంద్యాల పట్టణంలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అశోక్‌రెడ్డి ఉత్తీర్ణుడు కాలేదు. గురువారం నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, అన్న, అక్కతో గడిపాడు. అన్న ఆదినారాయణరెడ్డి ట్రాక్టర్ తీసుకుని పొలం పనులకు వెళ్లాడు. ఇంతలోనే అశోక్‌రెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైకి ఎక్కి తన అన్నతో పాటు జమనపల్లె గ్రామంలోని స్నేహితులకు ‘నేను చనిపోతున్నా’ అని వాట్సాప్‌లో మెసేజ్ పంపించాడు. తన సోదరుడు వచ్చేలోపు అశోక్‌రెడ్డి డ్యామ్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యామ్ లోతు దాదాపు 400 అడుగులు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటరెడ్డి, రమణమ్మ గుండెలవిసేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
బంపర్ ఆఫర్..!
ప్రకాశం, కందుకూరు రూరల్: రాను రాను ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. దీంతో అడ్మిషన్లు చేసేందుకు కళాశాలలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ పాస్ అయి, ఎంసెట్ రాసిన విద్యార్థులను మా కళాశాలలో చేరండని ఫోన్లు ద్వారా, నేరుగా ఇళ్లకు వెళ్లి అడుగుతున్నారు. కళాశాలలో చేర్పించే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తోడేస్తున్నారు. అయినా అడ్మిషన్లు సరిగా కాకపోవడంతో నేరుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటర్లో ఎన్ని సబ్జెక్టులు పోయినా సరే పరీక్ష సెంటర్ చెప్పండి మేము పాస్ చేయిస్తాం. అయితే మా కళాశాలలో చేర్పించండని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కళాశాలల నుంచి వచ్చే పీఆర్వోలు, ఆయా కళాశాలల అధ్యాపకులు ఇలాంటి ఆఫర్లు ఇస్తుండడంతో తల్లిదండ్రులు నోరెళ్ల పెడుతున్నారు. ఇంటర్ పాస్ అయిన వారిని మేము పాస్ చేయిస్తామని ఇంజినీరింగ్ కళాశాలల వారు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ అడ్మిషన్ల కోసం నగదు కూడా కట్టించుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇంజినీరింగ్ కళాశాలల వారు ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లేనని అర్థమవుతోంది. ఫెయిల్ అయినా ఇంటర్ విద్యార్థుల పరీక్ష సెంటర్లను ఇంజినీరింగ్ కళాశాలల వారు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంజినీరింగ్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫోన్ నంబర్లను ఆయా జూనియర్ కళాశాలల నుంచి సేకరించి నేరుగా ఫోన్లు చేస్తున్నారు. మా కళాశాలలో ఈ కోర్సులు ఉన్నాయి... ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఫీజులు అవసరం లేదు... స్కాలర్ షిప్ వస్తుంది అన్నీ కళాశాల వారే చూసుకుంటారని ఫోన్లు చేస్తున్నారు. ఈ ఫోన్ల తాకిడికి తల్లిదండ్రులు తట్టుకోలేక ఫోన్లు స్విచ్‌లు ఆఫ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫోన్లే కాకుండా మెసేజ్‌లు కూడా రోజుకు ఇరవై.. ముప్పై వస్తున్నాయి. -
ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి
మెదక్‌రూరల్ : రెండు సబ్జెక్టులలో ఫెయిలవడంతో మనస్తాపానికి గురై ఒంటిపైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన మెదక్ మండలం రాయిన్‌పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాగుల ఆంజనేయులు, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె గొదావరి మెదక్ పట్టణంలోని సిద్ధార్థ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(బైపీసీ) పరీక్షలు రాసింది. ఏప్రిల్ 13న విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో గోదావరి రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలభై శాతం కాలిన గాయాలు కావడంతోపాటు నరాలు బిగుసుకుపోవడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 20 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గోదావరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'
రాజ్‌కోట్: ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు మూడు పీహెచ్‌డీలు. ఆ మూడు ఓ ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు అంకితాలు. ఈ రోజుల్లో ఒక్క డాక్టరేట్ ఉండటమే కష్టమవుతుండగా ఆయన మాత్రం ఏకంగా మూడు డాక్టరేట్లు పొందాడు. ఆయనే జగదీశ్ త్రివేది(49). గుజరాత్ లోని సురేంద్రనగర్ కు చెందిన ఆయన మూడు పీహెచ్‌డీలు పూర్తి చేసి ప్రముఖ నవలా రచయిత దేవ్శంకర్ మెహతా, ప్రముఖ హాస్యకారుడు షాబుద్దిన్ రాథోడ్, ప్రముఖ మత గురువు మోరారీ బాపునుకు ఈ మూడింటిని అంకితం చేశాడు. అంతేకాదు.. జగదీశ్ త్రివేది కూడా ఒక పెద్ద హాస్యకారుడు. 'నేను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు నవ్వారు. నేను సైన్స్ చదవలేనని నాకు తెలుసు. అందుకే వెంటనే ఆర్ట్స్ కు మారిపోయాను. నేను ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండు పీహెచ్‌డీలు పూర్తి చేసి నేను డల్ స్టూడెంట్ కాదని నిరూపించాను' అని ఆయన చెప్పాడు. -
సారీ మమ్మీ...
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో పాటు మరో పరీక్ష కూడా సరిగా రాయలేకపోవడంతో ఓ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఉప్పల్ చిలుకానగర్‌లో ఉండే బాలాచారి, శ్యామల దంపతులకు వి.భానుప్రకాశ్ (17), అఖిల్ అనే ఇద్దరు కుమారులున్నారు. భానుప్రకాశ్ హబ్సిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో భానుప్రకాశ్ ఫిజిక్స్‌లో తప్పాడు. అప్పటి నుంచి తీవ్ర వేదనకు గురవుతున్నాడు. సోమవారం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫిలాని (బిట్‌శాట్) ప్రవేశ పరీక్ష ఉంది. ఈ పరీక్ష కేంద్రం సెక్రటరియేట్ మై హోం సరోవర్ ప్లాజా భవనంలోని ఎడిక్విటీ కెరీర్ టెక్నాలజీస్‌లో ఉండటంతో.. తండ్రి బాలాచారి ఉదయం 8.30కి భానుప్రకాశ్‌ను సెంటర్ వద్ద వదిలి వెళ్లారు. 11.30కి పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు భానుప్రకాశ్.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి తల్లికి ఫోన్ చేసి ‘సారీ మమ్మీ ఈ పరీక్ష కూడా బాగా రాయలేకపోయా’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె ప్రయత్నించగా ఫోన్ కలువలేదు. సాయంత్రం 3.30కి ఎస్డీరోడ్‌లోని తాజ్‌మహాల్ హోటల్ ఎదురుగా ఉన్న శ్రీనాథ్ కమర్షియల్ కాంప్లెక్స్ భవనం 6వ అంతస్తుకు చేరుకున్న భానుప్రకాశ్ అక్కడి నుంచి కిందికి దూకాడు. వెంటనే స్థానికులు గమనించి మహంకాళి పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భానుప్రకాశ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికీ తరలించారు. మహంకాళి ఎస్సై విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తండ్రి బాలాచారి, కుటుంబ సభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
జీవచ్ఛవాల బతుకు పోరు
అది జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం... ప్రశాంతతకు మారు పేరు. కానీ, అక్కడ ఓ ఇంటిలో మాత్రం పదిహేడేళ్లుగా అశాంతి రాజ్యమేలుతోంది. అంతులేని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. విధి వారితో ఆటలాడుకుంది. మనసులనే కాదు.. మనుషులనూ కకావికలం చేసింది. ఉన్నవారిని జీవచ్ఛవాలుగా మార్చింది. జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్ : తలుపు తట్టగానే ఓ 44 ఏళ్ల మహిళ దీనం గా వచ్చి ఎవరని పలకరించింది. వచ్చిన పని చెప్పగానే, మౌనంగా మంచంకేసి చూపించింది. అక్కడ జీవచ్ఛవంలా పడి ఉన్నాడు ఓ యువకుడు. అతని పేరు బొబ్బిలి రమేశ్. వ యస్సు 40 ఏళ్లు. 1996 వరకు అతను కూడా అందరు యువకులలాగే చలాకీగా ఉన్నాడు. జీవితంపై రంగుల కలలు కన్నాడు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రుల పేదరికానికి తను పరిష్కారం కావాలనుకున్నాడు. కానీ ఇంటర్ ఫెయిల్ కావడం అతని పాలిట శాపమైంది. తండ్రికి సహాయంగా పొలానికి వెళ్లిన రమేశ్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. పొలం వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. ఇందుకోసం తీగలు సరి చేయడానికి స్తంభం ఎక్కాడు. అంతకు ముందే కరెంటు సరఫరా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ, దురదృష్టం అతడిని వెంటాడింది. అతడు స్తంభం ఎక్కగానే కరెంటు సరఫరా అయింది. అంతే, రమేశ్ విసురుగా కింద పడిపోయాడు. అలా పడిపోయిన రమేశ్ ఇక లేవలేదు. జీవచ్ఛంలా మారి మంచానికి పరిమితమయ్యాడు. నడుము నుంచి కింద వరకు శరీరం చచ్చుబడిపోయింది. చెదిరిన కుటుంబం ఈ సంఘటన కుటుంబాన్ని కుదిపేసింది. ఒక్కగానొక్క కొడుకు ఇలా కావడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. కొడుకును బతికించుకోవడానికి ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. చికిత్స కోసం ఉన్న నాలుగు ఎక రాల పొలాన్ని అమ్ముకున్నారు. ఒక్కగానొక్క ఆధారం కరిగిపోయింది కానీ ఫలితం లభించలేదు. అయిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సాయం చేసేవారూ కరువయ్యారు. ఇది వారిని మరింత కుంగదీసింది. ఆ దిగులుతోనే తల్లిదండ్రులు కన్నుమూశారు. తండ్రి, తల్లి, అన్నీ అక్కే రమేశ్ పరిస్థితి మెరుగుపడలేదు. ఇటు కన్నవారూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక అతడికి సపర్యలు చేసే బాధ్యత అక్క ఇందిర మీద పడింది. ఆమె ఈ బాధ్యతను పెద్ద మనసుతో స్వీకరించింది. పెళ్లి కూడా చేసుకోకుండా తమ్ముడి కోసం తన జీవితాన్ని ధారపోసింది. పదిహేడేళ్లుగా కన్నీళ్లను దిగమింగుతూ అతడి అలనా పాలనా చూస్తోంది. బీడీలు చుడుతూ, వీలైతే కూలీకి వెళ్తూ బతుకు బండిని లాగుతోంది. వీళ్ల బాధను పంచుకునే వాళ్లు కూడా కరువయ్యారు. నిస్సహాయంగా ‘‘వెన్ను పూస విరిగిపోయింది. ఛాతి భాగం నుంచి అరికాలి వరకు స్పర్శ ఉండదు. కూర్చోరాదు. నడవరాదు. ఎప్పుడూ వాటర్ బెడ్‌పైనే పడుకుంటాను. మలమూత్ర విసర్జన కూడా తెలవదు. ఎప్పుడూ యూరిన్ పైప్ ఉంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్, ముంబయిలోని కెమ్స్ ఆస్పత్రులలో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 17 ఏళ్లుగా మంచం పైనే గడుపుతున్నాను’’ అని ధీనంగా చెప్పాడు రమేశ్. మనసున్న దాతలు కాస్త సాయం చేస్తే కొంతలో కొంత ఆసరగా ఉంటుందని వేడుకుంటున్నాడు. మాటలకే పరిమితం రమేశ్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఊరు ఊరంతా సానుభూతి చూపించింది. ‘‘నీకేం భయం లేదు. మేమున్నాం, సాయం చేస్తాం’’ అని నేతలెందరో అభయమిచ్చారు. వారి హామీలు మాటల వరకే పరిమితమయ్యాయి. ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘోరానికి ఎంతో బాధపడుతూ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోయాయి. రమేశ్ మరింత అనారోగ్యానికి గురువుతున్నా, ఇప్పటి వరకు ఏ సాయమూ అందలేదు.