ప్రతీకాత్మక చిత్రం
మెదక్‌రూరల్ : రెండు సబ్జెక్టులలో ఫెయిలవడంతో మనస్తాపానికి గురై ఒంటిపైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన మెదక్ మండలం రాయిన్‌పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాగుల ఆంజనేయులు, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె గొదావరి మెదక్ పట్టణంలోని సిద్ధార్థ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(బైపీసీ) పరీక్షలు రాసింది.
ఏప్రిల్ 13న విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో గోదావరి రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలభై శాతం కాలిన గాయాలు కావడంతోపాటు నరాలు బిగుసుకుపోవడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ 20 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గోదావరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment