అది జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ గ్రామం... ప్రశాంతతకు మారు పేరు. కానీ, అక్కడ ఓ ఇంటిలో మాత్రం పదిహేడేళ్లుగా అశాంతి రాజ్యమేలుతోంది. అంతులేని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది. విధి వారితో ఆటలాడుకుంది. మనసులనే కాదు.. మనుషులనూ కకావికలం చేసింది. ఉన్నవారిని జీవచ్ఛవాలుగా మార్చింది.
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్ : తలుపు తట్టగానే ఓ 44 ఏళ్ల మహిళ దీనం గా వచ్చి ఎవరని పలకరించింది. వచ్చిన పని చెప్పగానే, మౌనంగా మంచంకేసి చూపించింది. అక్కడ జీవచ్ఛవంలా పడి ఉన్నాడు ఓ యువకుడు. అతని పేరు బొబ్బిలి రమేశ్. వ యస్సు 40 ఏళ్లు. 1996 వరకు అతను కూడా అందరు యువకులలాగే చలాకీగా ఉన్నాడు. జీవితంపై రంగుల కలలు కన్నాడు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశపడ్డాడు. తల్లిదండ్రుల పేదరికానికి తను పరిష్కారం కావాలనుకున్నాడు.
కానీ ఇంటర్ ఫెయిల్ కావడం అతని పాలిట శాపమైంది. తండ్రికి సహాయంగా పొలానికి వెళ్లిన రమేశ్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. పొలం వద్ద కొత్త ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తున్నారు. ఇందుకోసం తీగలు సరి చేయడానికి స్తంభం ఎక్కాడు. అంతకు ముందే కరెంటు సరఫరా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ, దురదృష్టం అతడిని వెంటాడింది. అతడు స్తంభం ఎక్కగానే కరెంటు సరఫరా అయింది. అంతే, రమేశ్ విసురుగా కింద పడిపోయాడు. అలా పడిపోయిన రమేశ్ ఇక లేవలేదు. జీవచ్ఛంలా మారి మంచానికి పరిమితమయ్యాడు. నడుము నుంచి కింద వరకు శరీరం చచ్చుబడిపోయింది.
చెదిరిన కుటుంబం
ఈ సంఘటన కుటుంబాన్ని కుదిపేసింది. ఒక్కగానొక్క కొడుకు ఇలా కావడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. కొడుకును బతికించుకోవడానికి ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. చికిత్స కోసం ఉన్న నాలుగు ఎక రాల పొలాన్ని అమ్ముకున్నారు. ఒక్కగానొక్క ఆధారం కరిగిపోయింది కానీ ఫలితం లభించలేదు. అయిన వాళ్ల దగ్గర అప్పులు చేశారు. తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో సాయం చేసేవారూ కరువయ్యారు. ఇది వారిని మరింత కుంగదీసింది. ఆ దిగులుతోనే తల్లిదండ్రులు కన్నుమూశారు.
తండ్రి, తల్లి, అన్నీ అక్కే
రమేశ్ పరిస్థితి మెరుగుపడలేదు. ఇటు కన్నవారూ కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక అతడికి సపర్యలు చేసే బాధ్యత అక్క ఇందిర మీద పడింది. ఆమె ఈ బాధ్యతను పెద్ద మనసుతో స్వీకరించింది. పెళ్లి కూడా చేసుకోకుండా తమ్ముడి కోసం తన జీవితాన్ని ధారపోసింది. పదిహేడేళ్లుగా కన్నీళ్లను దిగమింగుతూ అతడి అలనా పాలనా చూస్తోంది. బీడీలు చుడుతూ, వీలైతే కూలీకి వెళ్తూ బతుకు బండిని లాగుతోంది. వీళ్ల బాధను పంచుకునే వాళ్లు కూడా కరువయ్యారు.
నిస్సహాయంగా
‘‘వెన్ను పూస విరిగిపోయింది. ఛాతి భాగం నుంచి అరికాలి వరకు స్పర్శ ఉండదు. కూర్చోరాదు. నడవరాదు. ఎప్పుడూ వాటర్ బెడ్‌పైనే పడుకుంటాను. మలమూత్ర విసర్జన కూడా తెలవదు. ఎప్పుడూ యూరిన్ పైప్ ఉంటుంది. హైదరాబాద్‌లోని నిమ్స్, ముంబయిలోని కెమ్స్ ఆస్పత్రులలో ట్రీట్‌మెంట్ చేయించుకున్నాను. 17 ఏళ్లుగా మంచం పైనే గడుపుతున్నాను’’ అని ధీనంగా చెప్పాడు రమేశ్. మనసున్న దాతలు కాస్త సాయం చేస్తే కొంతలో కొంత ఆసరగా ఉంటుందని వేడుకుంటున్నాడు.
మాటలకే పరిమితం
రమేశ్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఊరు ఊరంతా సానుభూతి చూపించింది. ‘‘నీకేం భయం లేదు. మేమున్నాం, సాయం చేస్తాం’’ అని నేతలెందరో అభయమిచ్చారు. వారి హామీలు మాటల వరకే పరిమితమయ్యాయి. ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘోరానికి ఎంతో బాధపడుతూ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరాలు గడిచిపోయాయి. రమేశ్ మరింత అనారోగ్యానికి గురువుతున్నా, ఇప్పటి వరకు ఏ సాయమూ అందలేదు.
జీవచ్ఛవాల బతుకు పోరు
Published Sun, Jan 19 2014 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement