భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై స్పష్టత
జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత లోపాలేనని తేల్చిన
‘రిలే’ రక్షణ వ్యవస్థ కారణాలను విశ్లేషిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జెన్‌కో నివేదిక
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీఎస్)లోని యూనిట్–1కు చెందిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం కావడానికి పిడుగుపాటు కారణం కాదని జెన్‌కో దర్యాప్తులో తేలింది. పిడుగు పడిన సమయంలోనే యాధృచ్చికంగానే జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ అంతర్గత లోపాలతో..దాని లోపల మంటలు ఉత్పన్నమయ్యాయని, ఇందుకు బాహ్య కారణాలు లేవని నిర్ధారించింది. శనివారం బీటీఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణాలను విశ్లే షిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది.
కారణాన్ని పట్టించిన రిలే వ్యవస్థ
ట్రాన్స్‌ఫార్మర్లలో ‘రిలే’అనే రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి వాటి నివారణకు సంబంధిత రక్షణ వ్యవస్థలను అప్పటికప్పుడు రిలే వ్యవస్థ క్రియాశీలం చేస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం కావడానికి అంతర్గత లోపాలు కారణమా? బాహ్య సమస్యలు కారణమా? అనే విషయాన్ని ఏ రకమైన రిలేలు ప్రమాద సమయంలో ఆపరేట్ అ య్యాయో పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.
» బీటీఎస్‌లో ప్రమాదం జరిగినప్పుడు ‘87జీటీ, 64ఆర్’అనేæ రెండు వేర్వేరు రిలే వ్యవస్థలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయి.
» ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనపుడు మాత్రమే ఈ రెండు రిలేలు ఆపరేట్ అవుతాయి.
» ట్రాన్స్‌ఫార్మర్‌కు బాహ్యంగా ఏదైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యే ‘87 హెచ్‌వీ’అనే రిలే వ్యవస్థ ఆ సమయంలో స్పందించలేదు. దీంతో అంతర్గత సమస్యలతోనే జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైందని జెన్‌కో ఇంజనీరింగ్ నిపుణులు నిర్ధారించారు.
ఆజ్యం పోసిన ఆయిల్ లీకేజీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీఎస్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కి సంబంధించిన జనరేటింగ్ స్టేషన్‌లో 16కేవీ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి అవుతుంది. దీనిని 400కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలుంటుంది. ఈ పనిని జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్ చేస్తుంది.
» జనరేటింగ్ స్టేషన్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్ ఆర్‌వైబీ(రెడ్ ఎల్లో బ్లూ) అనే మూడు ఫేజుల కండర్ల(తీగల) ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ వరకు సరఫరా అయ్యి బుష్‌ల ద్వారా లోపలికి వెళుతుంది.
» ట్రాన్స్‌ఫార్మర్ లోపల చుట్టబడిన కాయిల్స్ ఆయిల్‌లో మునిగి ఉంటాయి.
» ఆర్‌వైబీ అనే మూడు ఫేజులుండగా, బీ–ఫేజ్ కాయిల్స్‌లో ఫాల్ట్ ఏర్పడి మంటలు చోటు చేసుకున్నట్టు ‘రిలే’వ్యవస్థల స్పందన ద్వారా నిర్ధారించారు.
» ఎప్పుడైతే బీ–ఫేజ్‌కు ప్రమాదం జరిగిందో.. ఆర్ ఫేజ్ మధ్య విద్యుత్ ఓల్టేజీ భారీగా పెరిగి ట్రాన్స్ ఫార్మర్‌లోని ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి బుష్‌ల ద్వారా ఆయిల్ బయటకు వచ్చి లీక్ అయ్యింది.
» ఆయిల్ లీక్ కావడంతో అగి్నకి ఆజ్యం పోసినట్టు అయ్యి ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది.
ఈ కారణాలను విశ్లేషించిన తర్వాత ప్రమాదం పిడుగు వల్ల కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడిన అంతర్గత లోపాలతోనే జరిగినట్టు జెన్‌కో నిపుణులు తేల్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.30కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ఇప్పటికే ఓ నిర్థారణకు వచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను పూర్తిగా విప్పి పరిశీలించిన తర్వాత నష్టంపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రభుత్వానికి జెన్‌కో తెలియజేసింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత లోపాలు ఏర్పడడానికి నిర్మాణ, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు కారణం కావొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment