తెలంగాణలోనే తొలిసారిగా విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స
‘సున్తీ’ ఇన్ఫెక్షన్ వల్ల బాల్యంలోనే పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియా యువకుడు
ముంజేతి నుంచి చర్మం, కణజాలం, ధమని సేకరించి పూర్తిగా పునర్నిర్మించిన ‘మెడికవర్’ వైద్యులు
లైంగిక స్పందనల కోసం ఇంప్లాంట్ సైతం అమరిక.. తిరిగి పనిచేస్తున్న ‘అవయవం’
మాదాపూర్: బాల్యంలో సోకిన ఇన్ఫెక్షన్ కారణంగా పురుషాంగాన్ని పూర్తిగా కోల్పోయిన ఓ 19 ఏళ్ల సొమాలియా జాతీయుడికి హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. తెలంగాణ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన మైక్రోవాసు్క్యలర్ సర్జరీ (ఒక రకమైన ప్లాస్టిక్ సర్జరీ) ద్వారా విజయవంతంగా పురుషాంగాన్ని పునఃసృష్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం విలేకరుల సమావేశంలో ఆస్పత్రి సీనియర్ యూరాలజిస్ట్–ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఏవీ.రవికుమార్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధువినయ్ కుమార్ వెల్లడించారు.
ఎన్ని దేశాలు తిరిగినా..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడికి నాలుగేళ్ల వయసులో జరిగిన సున్తీ ఆపరేషన్ అనంతరం ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగం కోల్పోయాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం వివిధ దేశాలు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరకు హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జన్లను సంప్రదించాడు.
ముంజేతి ధమనితో..
యువకుడికి పురుషాంగాన్ని పునః సృష్టించాలని నిర్ణయించిన వైద్యులు.. అందుకోసం అతని ముంజేతి నుంచి చర్మం, కణజాలం, రేడియల్ ధమనిని ఫ్లాప్ సర్జరీ ద్వారా సేకరించారు. అనంతరం వాటిని పురుషాంగం ప్రదేశంలో విజయవంతంగా పునర్నిర్మించారు. పురుషాంగానికి లైంగిక స్పందనలను కలిగించేందుకు ఒక ఇంప్లాంట్ (పరికరం)ను అమర్చారు. ఈ మొత్తం శస్త్రచికిత్సకు 10 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం ఆ యువకుడు తిరిగి పూర్తిస్థాయిలో మూత్రవిసర్జన చేసే సామర్థ్యాన్ని పొందాడని డాక్టర్ దాసరి మధువినయ్ కుమార్ వివరించారు. ఇకపై అతను సాధారణ లైంగిక జీవనాన్ని కూడా గడపొచ్చని చెప్పారు.
కొత్త జీవితం పొందా..
అవయవ లోపంతో నన్ను నేను అసంపూర్ణమైన వ్యక్తిగా భావిస్తూ ఏళ్ల తరబడి ఎంతో మానసిక క్షోభ అనుభవించా. ఇప్పుడు నేను నా గుర్తింపును, విశ్వాసాన్ని, అందరిలా సాధారణ జీవితాన్ని పొందే అవకాశాన్ని తిరిగి పొందా. నాకు కొత్త జీవితాన్ని అందించిన వైద్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. – సోమాలియా యువకుడు
Comments
Please login to add a commentAdd a comment