rare surgery
-
19 ఏళ్ల యువతికి అరుదైన శస్త్రచికిత్స
నెల్లూరు(బారకాసు) : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నిప్పోసెంటర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల పావని ఆడుకుంటూ పడిపోయింది. దీంతో ఆమె ఎడమ కాలి తొడ విరిగిపోయింది. వెంటనే పావనిని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూపించారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఆమెకు సర్జరీ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరింది. చివరికి ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకొచ్చి ఆర్థోపెడిక్ విభాగంలో చూపించారు. అక్కడి వైద్యులు పావనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. పావనికి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అయిందని గుర్తించారు. యువతి తల్లిదండ్రుల అంగీకారం మేరకు పావనికి నెల క్రితం ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం ఆపరేషన్ చేసింది. నెల పాటు యువతికి ఆస్పత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించి నడిచే స్థితికి తీసుకొచ్చారు. దీంతో పావనిని వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను కార్పొరేట్ హాస్సిటల్లో నిర్వహిస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, అయితే జీజీహెచ్‌లో పూర్తి ఉచితంగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు. ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ రవిశంకర్, ప్రొఫెసర్ చంద్రశేఖర్‌నాయుడు, వైద్యులు మధు, కిరణ్, భాస్కర్, దివ్య, గులాబీ సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి పావనికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం పావని తండ్రి సురేష్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి డాక్టర్ కళారాణి పాల్గొన్నారు. -
అత్యంత అరుదైన గ్యాస్ట్రిక్ టెరటోమా కణితి తొలగింపు
గుంటూరుమెడికల్ : గుంటూరు జీజీహెచ్ చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య నిపుణులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి పది నెలల చిన్నారి ప్రాణాలు కాపాడారు. అత్యంత అరుదైన కణితిని చిన్నారి కడుపు నుంచి తొలగించి రికార్డు సృష్టించారు. పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగాధిపతి(పీడియాట్రిక్ సర్జరీ) డాక్టర్ చందా భాస్కరరావు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం జాలాదికి చెందిన గోగులమూడి నాగార్జున, లావణ్య దంపతుల పది నెలల రియాన్స్ ఈ నెల ఒకటో తేదీ నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత పెరగసాగింది. తల్లిదండ్రులు 6న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పీడియాట్రిక్ వైద్యులు రెండు రోజుల పాటు చిన్నారికి చికిత్స అందించి ఈ నెల 8న పీడియాట్రిక్ సర్జరీ వైద్య విభాగానికి రిఫర్ చేశారు. అన్ని రకాల పరీక్షలు చేసి ఉదర కోశ రాక్షస కణితి(గ్యాస్ట్రిక్ టెరటోమా) ఉన్నట్లు నిర్ధారించారు. 20 సెంటీ మీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతుతో, చిన్నారి పొట్టను చాలా వరకు ఆక్రమించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి ట్యూమర్లు కేవలం 112 మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 15న ఐదున్నరగంటల సేపు ఆపరేషన్ చేసి కణితిని పూర్తిగా తొలగించారు. సుమారు రూ.10 లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్టు వివరించారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు డాక్టర్ జయపాల్, డాక్టర్ సుమన్, డాక్టర్ మౌనిక, డాక్టర్ బారిష్, డాక్టర్ పరశురామ్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నాగభూషణం, డాక్టర్ వహిద పాల్గొన్నట్లు వెల్లడించారు. -
22 రోజుల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే కుడివైపు ముక్కులో మాస్ పెరుగుదల ఉన్న 22 రోజుల శిశువుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జీజీహెచ్ ఇఎన్టీ విభాగ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ శిశువుకు ఎముకల ఫైబ్రోమా వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపీ పరికరంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కుడి నాసల్లోని మాస్‌ను తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడంతో క్లిష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. ముక్కులో మాస్‌తో ఇబ్బంది పడుతున్న శిశువును పాత ప్రభుత్వాస్పత్రి నుంచి ఇక్కడికి రిఫర్ చేయగా, ఆమెకు పుట్టుకతోనే ఉన్న వ్యాధి నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఇఎస్‌టీ విభాగాధిపతి డాక్టర్ రవి తెలిపారు. ఇఎన్టీ వైద్యులు డాక్టర్ లీలాప్రసాద్, డాక్టర్ ఆదిత్య, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి సూర్యశ్రీ, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. -
అరుదైన శస్త్రచికిత్స... చచ్చుబడిపోయిన కాళ్లు యథాస్థితికి
సాక్షి, విశాఖపట్నం: ఏ కారణం లేకుండా చిన్న వయసులోనే 11 ఏళ్ల పాపకు చచ్చుబడిపోయి వంకరైన కాళ్లను ‘టెండన్ ట్రాన్సఫర్’ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు కేజీహెచ్ వైద్యులు. ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటకు చెందిన 11 ఏళ్ల బంగారు యశోదకు చిన్న వయస్సులోనే కుడి కాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 5న కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ విజయకుమార్‌తో కలిసి డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఇలాంటి ‘టెండన్ ట్రాన్స్ఫర్’ సర్జరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 30 నుంచి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరిపీ చికిత్స అందించాలి. అందులో భాగంగానే ఫిజియోథెరిపీ చికిత్స పూర్తయిన తర్వాత గురువారం నాటికి పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు డాక్టర్ పి.వి.సుధాకర్ వెల్లడించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్‌బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మహిళ కడుపులోని గర్భసంచికి అతుక్కుని ఉన్న 4.5 కిలోల కణితిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. రక్తస్రావం, కడుపునొప్పితో విజయవాడకి చెందిన సీహెచ్ ఆదిలక్ష్మి పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి ఇటీవల వచ్చింది. ఆమెకు పరీక్ష చేసిన వైద్యులు కడుపులో పెద్దగడ్డ ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాని నిర్ణయించారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, గైనకాలజీ నిపుణులు డాక్టర్ విజయశీల, డాక్టర్ కరుణలతో కలిసి లేపరోటమీ విధానంతో అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులోని గడ్డను తొలగించారు. లేపరోటమీ, రిలీజ్ ఆఫ్ అథిషన్స్, టీఏహెచ్ విధానం అవలంభించి ఈ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. రోగి ఆదిలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో మత్తు నిపుణులు డాక్టర్ పీఎన్‌రావు, డాక్టర్ రాంబాబు, గైనిక్ పీజీ డాక్టర్ శాంత్రలు పాల్గొన్నారు. -
విశాఖలో అరుదైన శస్త్రచికిత్స
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కోమాలో ఉన్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమెను బతికించారు. డాక్టర్ శివశంకర్ దలై ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరం దరి సీతానగరానికి చెందిన సీహెచ్ సుబ్బలక్ష్మి (50) తీవ్ర తలనొప్పితో కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శివశంకర్ దలై ఆమెకు పరీక్షలు నిర్వహించి.. దమనుల్లో వాపు వచ్చి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. ఆమె అనిరుజం అనే వ్యాధికి గురైందని, దానివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఆమెకు వెంటనే ‘న్యూ ఫ్లో డైవర్షన్ ట్రీట్మెంట్’ పేరుతో ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి.. మెదడులో రక్తస్రావాన్ని నియంత్రించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె మెదడులో రక్త ప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శస్త్రచికిత్సను మొదటిసారిగా మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించినట్టు తెలిపారు. ఆపరేషన్ జరిగిన 96 గంటల్లోనే రోగి కోలుకుందన్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి బంధువులు ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పసికందుకు పునర్జన్మ
చైతన్యపురి: ఆ పసికందు బరువు 2.5 కేజీలు. పుట్టుకతోనే శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు. గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆపరేషన్ చేసేందుకు సహకరించని వయసు, పసికందు బరువు. దీంతో పారమిత ఆస్పత్రి యాజమాన్యం, వైద్యబృందం, హీల్ ఎ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ చొరవతో ప్రత్యేక చికిత్స చేశారు. గుండె రంధ్రాన్ని ప్రత్యేక పరికరంతో కోనార్ డివైజ్ అమర్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. గురువారం చైతన్యపురిలోని పారమిత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యం బృందం మాట్లాడుతూ..తక్కువ వయసుఉన్న పసికందు (21 రోజులు)కు ఇటువంటి ఆపరేషన్ చేయటం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సతీష్, శోభ దంపతులకు జన్మించిన కుమారుడు పుట్టుకతోనే నిమోనియాతో శ్వాస సంబంధిత ఇబ్బందులు రావటంతో నగరంలోని పారమిత చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాబుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్స మొదలుపెట్టారు. శిశువుకు పరీక్షలు చేసిన చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, డాక్టర్ శ్రీరాంలు ఆపరేష్ తప్పనిసరి అని నిర్ధారించారు. పారమిత ఆస్పత్రి ఎండీ డాక్టర్ ధనరాజ్, మెడికల్ డైరెక్టర్ సతీష్‌లు కేసును చాలెంజ్‌గా తీసుకుని రెయిన్బో కార్డియాక్ సెంటర్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌ను సంప్రదించారు. ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. కోనార్ డివైజ్ బటన్‌ను అమర్చి గుండెకు ఉన్న రంధ్రాన్ని మూసేందుకు సమ్మతించా రు. అనారోగ్య పిల్లలకు ఆర్థిక సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ, పారమిత ఆస్పత్రి వర్గాల ఆర్థిక సహకారంతో డాక్టర్ నాగేశ్వర్, శ్వేత బృందం 21 రోజుల పసికందుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని, సొంతంగా ఊపిరి తీసుకుంటోందని, గుండెపనితీరు కూడా బాగుందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలోనే 21 రోజుల పసికందుకు గుండె ఆపరేషన్ చేయటం మొదటిసారి అని పేర్కొన్నారు. తమ బాబుకు గుండె రంధ్రానికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారని తల్లిదండ్రులు సతీష్, శోభలు తెలిపారు. పారమిత ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం, హీల్ ఏ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ ప్రమోద్, ఆపరేషన్ చేసిన డాక్టర్లు నాగేశ్వరరావు, శ్వేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
నాలుగు నెలలు.. కిడ్నీలో ఆరు రాళ్లు
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కేజీల బరువు ఉన్న నాలుగు మాసాల మగ శిశువు రెండు మూత్రపిండాల నుంచి 6 రాళ్లను వైద్యులు విజయవంతంగా తొలగించారు. కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే శిశువు కిడ్నీల నుంచి రాళ్లను తొలగించినట్లు నగరంలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ తరహా చికిత్స ప్రపంచంలోనే మొదటిసారని చెప్పారు. ఈ మేరకు గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండీ, సర్జన్ డాక్టర్ వి.చంద్రమోహన్, రేడియాలజిస్ట్ డాక్టర్ రూప, యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, అనస్థీషియన్ డాక్టర్ పవన్, పీడియాట్రిక్ డాక్టర్ అజయ్లతో కూడిన బృందం చికిత్స వివరాలను వెల్లడించింది. రెండు కిడ్నీల్లో ఆరు రాళ్లు.. అత్తాపూర్‌కు చెందిన అర్షాద్ హుస్సేన్ దంపతులకు ఏప్రిల్ 5వ తేదీన మగ బిడ్డ జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మాంసాహారులు కావడం, గర్భస్థ సమయంలో డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తడం వల్ల పుట్టుకతోనే శిశువు కిడ్నీలో రాళ్ల ఏర్పడ్డాయి. మూడో నెలలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోగా ఆ తర్వాత మూత్ర విసర్జనా నిలిచిపోయింది. వైద్యులు పొట్ట సహా కిడ్నీ ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్స కోసం కేపీహెచ్‌బీలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ప్రీతి ఆస్పత్రి యూరాలజీ సర్జన్ డాక్టర్ చంద్రమోహన్ బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో 3, కుడి కిడ్నీలో 3 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నెలరోజుల క్రితం రిట్రో గ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్) పద్ధతిలో విజయవంతంగా రాళ్లను తొలగించారు. కేవలం గంట వ్యవధిలోనే రెండు కిడ్నీల్లో ఉన్న ఆరు రాళ్లను లేజర్ కిరణాల ద్వారా కరిగించి, మూత్ర నాళం నుంచి కిడ్నీ వరకు స్టంట్‌ను అమర్చారు. పది రోజుల తర్వాత స్టంట్‌ను కూడా తొలగించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ రాళ్లను కరిగించి, బయటికి తీయడం ద్వారా శరీరంపై ఎలాంటి కోతలు, కుట్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ తరహా చికిత్సకు ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో పాటు అనస్థిషియా నిపుణులు, రేడియాలజిస్ట్‌ల సేవలు అవసరం ఉంటుందని డాక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు. ప్రతి లక్ష మంది పిల్లల్లో ముగ్గురికి ‘డీహైడ్రేషన్, పోషకాహారలోపం, అధికంగా మాంసం, మద్యం సేవించడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. పెద్దల్లో చాలా సహజం. కానీ చిన్నపిల్లల్లో అది కూడా నాలుగు నెలల శిశువు కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా అరుదు. జన్యుపరమైన లోపాల వల్ల ప్రతి లక్ష మంది శిశువుల్లో ముగ్గురికి మాత్రమే ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పటివరకు చైనా, టర్కి దేశాల్లో ఏడు, ఎనిమిది నెలల పిల్లలకు ఈ తరహా చికిత్స చేశారు. కానీ నాలుగున్నర కేజీల బరువున్న నాలుగు నెలల శిశువుకు రెండు కిడ్నీల నుంచి ఆరు రాళ్లను తొలగించడం ప్రపంచంలోనే ఇదే ప్రధమం’వైద్యులు అని తెలిపారు. -
కేర్‌లో అరుదైన గుండె చికిత్స
సాక్షి, హైదరాబాద్: నైజీరియాకు చెందిన 13 ఏళ్ల అగతకు అరుదైన శస్త్రచికిత్స చేసి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. ఆ పాప పుట్టుకతోనే అరుదైన గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండేదని, వాటిని సరిదిద్దామని కేర్ ఆస్పత్రి పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గుండె కుడివైపు ఉన్న గదులకు (కుడి కర్ణిక, కుడి జఠరిక) మధ్య ఉన్న కవాటం (ట్రైకస్పిడ్ వాల్వ్) ఆమెకు పుట్టినప్పటి నుంచి సరిగా పనిచేయట్లేదని, ఇలా ఉండటాన్ని ‘ఎబెస్టిన్స్ అనోమలీ’అంటారని పేర్కొన్నారు. సాధారణంగా ఉండాల్సిన స్థానం కన్నా ఈ కవాటం కిందకు ఉందని, ఆ కవాటం కూడా చాలా అసాధారణ స్థితిలో ఉందని చెప్పారు. ఈ సమస్య ప్రతి 2 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని తెలిపారు. దీంతో కుడి కర్ణిక ఎక్కువ విశాలంగా ఉండి అందులోకి ఎక్కువ రక్తం చేరేదని వివరించారు. ఈ కారణంగా కుడి, ఎడమ కర్ణికల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఏర్పడి ఈ రెండింటి మధ్య చెడు, మంచి రక్తం మార్పిడి జరుగుతుండేదని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా గుండె పనితీరు సరిగా ఉండదని, ఒక్కోసారి గుండె వైఫల్యం చెందే ప్రమాదం ఉందని చెప్పారు. కేర్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జీనా మఖీజా నేతృత్వంలో శస్త్రచికిత్స జరిపి ఆమె కవాటాన్ని సరిచేశారు. రెండు కర్ణికల మధ్య గోడకు ఉన్న రంధ్రాన్ని మూసేశారు. శస్త్రచికిత్స జరిగిన రెండో రోజే ఆమెను డిశ్చార్జి చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత 11 రోజుల వ్యవధిలోనే ఆమె పూర్తిగా కోలుకునేలా చేయగలిగామని డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పెద్ద ప్రాణం నిలిపారు
అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్ వైద్యులు కాన్పు కష్టంగా ఉన్న ఓ గర్భిణికి శస్త్ర చికిత్స చేసి, ఆమె ప్రాణాన్ని కాపాడారు. తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఛాలెంజింగ్‌గా తీసుకొని మూడున్నర గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కానీ బిడ్డ ప్రాణం దక్కలేదు. అతికష్టంమీద ప్రాణాలు కాపాడిన గైనిక్ వైద్యులకు బాలింత, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో సర్జరీ విషయాలను గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం తెలియజేశారు. గుంతకల్లుకు చెందిన ఇర్షాద్, యాస్మిన్ దంపతులకు ఇద్దరు సంతానం. ఇప్పటికే రెండు అబార్షన్లు అయ్యాయి. గర్భిణి అయిన యాస్మిన్ గత నెల 23న సర్వజనాస్పత్రిలో చేరింది. హెచ్‌బీ పరీక్షించగా 4 గ్రాములు మాత్రమే ఉండడంతో హైపర్ టెన్షన్‌తో బాధపడుతోంది. అదేరోజు రాత్రి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రేణుక, అనస్తీషియా వైద్యులు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ హరికృష్ణ బృందం సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. బాలింతకు మాయ ఊడి పడడంతోపాటు మరో భాగంలో అతుక్కుపోయింది. ఆసమయంలో మాయను తొలగించలేని పరిస్థితి. పరిస్థితి మరింత విషమించింది. చివరకు గర్భసంచి తొలగించారు. కాసేటిపకి పుట్టిన ఆడశిశువు మృతి చెందింది. యాస్మిన్‌కు బీపీ 90కి పడిపోవడంతో పాటు కోమాలోకి వెళ్లింది. వైద్యులు వెంటనే అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ)లోకి మార్చి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. అదే రోజు రాత్రి మరో 4 యూనిట్ల రక్తం ఎక్కించారు. ఉదయం 4.30 గంటల సమయంలో బాలింత కోలుకుంది. వైద్యులు 24 గంటల పాటు హైలీ యాంటీబయోటిక్స్ అందించారు. ఈ నెల 25న ఆమె పూర్తిగా కోలుకోగా పోస్టునేటల్ వార్డుకు మార్చారు. బాలింతలో దాదాపుగా 3.5 లీటర్ల రక్తం పోయింది. సకాలంలో ఆస్పత్రిలోని రక్తనిధి నుంచి 10 యూనిట్ల రక్తాన్ని అందించారు. అందరి సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. యాస్మిన్, ఇర్షాద్ దంపతులు మాట్లాడుతూ ‘సార్.. ప్రాణాలు దక్కుతాయోలేదో తెలియని పరిస్థితి.. పొరపాటున ఏమైనా జరిగింటే మా ఇద్దరు బిడ్డలు తల్లిని కోల్పోయేవారు.. దేవుళ్లలా ప్రాణం పోశారు..మీకు రుణపడి ఉంటామని తెలిపారు. గైనిక్ వైద్యుల సాహసమే ఇలాంటి కేసులు చాలా అరుదు. గైనిక్ వైద్యులు సాహసంతో బాలింతకు ప్రాణం పోశారు. నిజంగా చెప్పాలంటే మిరాకిల్. గైనిక్, అనస్తీషియా, రక్తనిధి కేంద్రాన్ని అభినందిస్తున్నా. మున్ముందు మరిన్ని సర్జరీలు చేసి ఆస్పత్రికి పేరు తేవాలి. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
సర్వజనాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ రోగికి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సూపరిటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఈఎన్టీ, అనస్తీషియా హెచ్ఓడీలు డాక్టర్ నవీద్, డాక్టర్ నవీన్, అంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తాడిపత్రి వెంకటాంపల్లికి చెందిన చిన్నకేశన్న కేన్సర్‌తో బాధపడేవాడు. కర్నూలులో కీమో థెరపీ చేయించినా ఆయాసం, దగ్గు తరచూ వస్తుండేది. దీంతో కుటుంబ సభ్యులు మే 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఈఎన్టీ వైద్యులు పరీక్షించి స్వరపేటికకు కేన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో సర్జికల్ ఆంకాలజిస్టు, అనస్తీషియా, ఈఎన్టీ వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్య పరీక్షలు చేయగా టీబీ (క్షయ) బయటపడింది. మరో పది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి వైద్యం అందించారు. తిరిగి సర్జరీ చేసేందుకు సిద్ధమవగా ఈసారి ఊపిరితిత్తులు, గుండె సమస్యను గుర్తించారు. అనస్తీషియా, ఈఎన్టీ, సర్జికల్ ఆంకాలజిస్టు మరోసారి సమావేశమై, స్వరపేటికను తొలగించాలని నిర్ణయించారు. మత్తుమందు శరీరం మొత్తం ఇస్తే చనిపోయే ప్రమాదం ఉందని, గొంతు భాగంలో మాత్రమే మత్తు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 26న చిన్నకేశన్నకు ఆంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సుధీర్, అనస్తీషియా వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు రోగి స్పృహలో ఉండగానే గొంతుకు మత్తుమందు అందించి స్వరపేటిక తొలగించారు. మూడున్నర గంటపాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా చేశారు. తన తండ్రికి ఊపిరి పోసిన వైద్యులకు రుణపడి ఉంటానని చిన్నకేశవన్న కుమారుడు రవికుమార్ తెలిపాడు. విలేకరుల సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ జమాల్‌బాషా, అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం పోశారు
అనంతపురం న్యూసిటీ: జిల్లా సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ రోగికి ప్రాణం పోశారు. 72 సంవత్సరాల వృద్ధుడికి మూడు గంటల పాటు శ్రమించి క్యాన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సర్జరీ అనస్తీషియా విభాగం హెచ్ఓడీలు డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ నవీన్, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కె.ఎల్.సుబ్రహ్మణ్యం సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన పి.బాలాజీ అనే వృద్ధుడికి దవడ కింది భాగంలో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 30న అతన్ని కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో దవడ నుంచి కొంత భాగాన్ని తీసి బయాస్సీకి పంపారు. పరీక్షల అనంతరం అది కార్సినోమా (క్యాన్సర్) గడ్డగా తేలింది. అదే సమయంలో రోగి గుండె సంబంధిత వ్యాధి, ఆస్తమా, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆరేళ్ల క్రితం చేసిన బైపాస్ సర్జరీ ఫెయిల్యూర్ దశకు చేరడంతో గుండె 28 శాతం మాత్రమే పనిచేస్తోందని తెలుసుకున్నారు. జనరల్ అనస్తీషియా ఇస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో బాలాజీ కుమారులు రమేష్, గిరిప్రసాద్తో వైద్యులు సంప్రదించారు. వారి అనుమతితో ఈ నెల 24న సర్వజనాస్పత్రిలోనే రోగి ఎడమ కన్ను కింది భాగం నుంచి ఛాతీ వరకు అనస్తీషియా ఇచ్చి మూడు గంటల్లోనే సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఇది చాలా అరుదైన శస్త్రచికిత్సగా ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. దీనిని ఒక సవాల్‌గా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఎస్ఐసీయూలో ఉంచిన రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో వారం అడ్మిషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
డాక్టర్ల బృందానికి ఎంపీ, కలెక్టర్ ప్రశంస తిరువళ్లూరు: లివర్‌కు సమీపంలో చేరి న వ్యర్థపు నీటి సంచిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు సమర్థవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించి తమ సత్తాను చాటారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన కరుణాకరన్ భార్య వళ్లి(47).ఈమె తరచూ కడుపునొప్పి రావడంతో తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంది. అయినా నొప్పి తగ్గకపోగా మరింత పెరగడంతో అనుమానం కలిగిన డాక్టర్లు ఆమెకు స్కానింగ్ తీశారు. స్కానింగ్‌లో లివర్‌కు సమీపంలోనే వ్యర్థపు నీరు తిత్తి ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అనంతరం తిరువళ్లూరు వైద్యశాలలోనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన సూపరింటెండెంట్ నాగేంద్రప్రసాధ్ తన సహచర వైద్యులు ఆశోకన్, మురళి, నందకుమార్. శివకుమార్‌లతో కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో లివర్‌కు సమీపంలో చేరిన వ్యర్థపు నీటిని, తిత్తిని తొలగించి విజయవంతంగా పూర్తి చేశారు. తిరువళ్లూరు వైద్యులు చేసిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్, కలెక్టర్ ముత్తు, ఆర్డీవో దివ్యశ్రీ బాధిత మహిళను పరామర్శించారు. అనంతరం ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. -
11 రోజుల శిశువు గుండెకు అరుదైన శస్త్రచికిత్స
♦ పుట్టుకతోనే అసాధారణ గుండె కవాటాన్ని కలిగి ఉన్న శిశువు ♦ గర్భంలో ఉండగానే గుర్తింపు, ప్రసవించిన పదకొండో రోజు చికిత్స ♦ శిశువుకు 3 ఎంఎం సైజు స్టంట్ అమర్చిన అపోలో వైద్యులు సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే అసాధారణ గుండె కవాటం (ఎబ్స్టైన్స్ అనొమలి) కలిగి ఉన్న 11 రోజుల శిశువుకు అపోలో ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. అతి తక్కువ బరువు, వయసున్న శిశువు గుండె రక్తనాళానికి 3 ఎంఎం సైజు స్టంట్‌ను అమర్చి చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన హుస్సేన్, సోనియా భార్యాభర్తలు. సోనియా గర్భం దాల్చడంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న వైద్యులను ఆశ్రయించింది. కడుపులోని బిడ్డ శారీరక ఎదుగుదలను అంచనా వేసేందుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించింది. కడుపులోని బిడ్డ గుండెకు కాంప్లెక్స్ హోల్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారి సూచనల మేరకు ఆమె అపోలో వైద్యులను ఆశ్రయించింది. ఫిటల్ ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష చేసిన వైద్యులు.. శిశువు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పుపుస కవాటం మూసుకుపోయినట్లు గుర్తించారు. ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో అబార్షన్ చేసి మృత శిశువును బయటికి తీస్తారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం వల్ల తల్లి ప్రాణాలకే ప్రమాదం. వైద్యులు ఇదే అంశాన్ని హుస్సేన్, సోనియాకు తెలపగా వారు ప్రసవానికే మొగ్గు చూపారు. సోనియా ఎనిమిదో మాసం(సెప్టెంబర్ మొదటి వారం)లోమగ బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే పుట్టిన శిశువు బరువు 1.2 కేజీలు. పుట్టుకతోనే శిశువు గుండె, ఊపిరితిత్తులకు మధ్య ఉండే ధమని మూసుకుపోవడంతో శిశువు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రత్యేక మందులతో ఊపిరితిత్తులకు రక్తం ద్వారా ఆక్సిజన్‌ను అందించేలా చికిత్స అందించారు. ప్రసవించిన 11వ రోజే చికిత్స: అపోలో ఆస్పత్రికి చెందిన సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గిరీశ్ వారియర్, క్రిటికల్ కేర్ నిపుణురాలు డాక్టర్ మీనా త్రెహన్, పీడియాట్రిషన్ డాక్టర్ షర్మిలాతో కూడిన వైద్య బృందం శిశువుకు సెప్టెంబర్ 14న కార్డియో పల్మనరీ బైపాస్ పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. శిశువు కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3 ఎంఎం సైజు స్టంట్‌ను మూసుకుపోయిన రక్తనాళంలో విజయవంతంగా అమర్చింది. ప్రస్తుతం శిశువు కోలుకోవడంతో సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శిశువుకు ఇదే చివరి శస్త్రచికిత్స కాదని, శారీరక ఎదుగుదల, వయసును బట్టి మరో రెండు, మూడు సార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని వైద్యులు స్పష్టం చేశారు. అతి తక్కువ బరువు, వయసు ఉన్న శిశువు గుండె రక్తనాళానికి స్టంట్‌ను అమర్చడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
అతని పొట్టనిండా నాణేలే
కడుపులోంచి 173 నాణేల వెలికితీత కర్ణాటక రాష్ర్టం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)లో ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అతని కడుపు నుంచి 173 నాణేలు వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో స్థిరపడ్డాడు. అతనికి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు తనకు తెలీకుండానే నాణేలు మింగాడు. దీంతో కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తాయి. దీంతో అతని బంధువులు 15 రోజుల క్రితం బళ్లారి విమ్స్‌లో చేర్పించారు. ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి, 173 రూపాయి, ఐదు, పది రూపాయల నాణేలను బయటకు తీశారు. రోగికి ఎలాంటి ప్రాణాప్రాయమూ లేదని వైద్యులు తెలిపారు. - సాక్షి, బళ్లారి -
కడుపులో కపాలం....
నాగ్‌పూర్ : ఆ మధ్య నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు మధ్యప్రదేశ్‌కు చెందిన కాంతాబాయ్ గుణవంత్ ఠాక్రే అనే 60ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి....36 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్న అస్థిపంజరాన్ని వెలికి తీసిన సంగతి తెలిసిందే. ఆ ఆస్థిపంజరం తాలూకు చిత్రాలను తాజాగా వైద్యులు విడుదల చేశారు. 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చినా... అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం ఎదగడం) కావడంతో కాంతాబాయ్కు గర్భస్రావం జరిగింది. అయితే పిండం అవశేషాలను తీసేందుకు వీలుగా ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడింది. ఇన్నాళ్లూ ఆలస్యం చేసింది. అయితే కొన్ని నెలలుగా కడుపునొప్పి రావడంతో వైద్యులకు చూపించుకోవడంతో వారీ ఆపరేషన్ చేశారు. -
గర్భంలో అస్థిపంజరం!
60 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు ఇటీవల అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 60 ఏళ్ల మహిళలో 36 ఏళ్లుగా ఉన్న అస్థిపంజరాన్ని తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని పిపారియాకు చెందిన కాంతాబాయ్ గుణవంత్ ఠాక్రే 1978లో గర్భం దాల్చినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం ఎదగడం) కావడంతో గర్భస్రావం జరిగింది. పిండం అవశేషాలను వెలికితీసేందుకు ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉన్నా ఆమె భయపడింది. కానీ, రెండు నెలలుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో చూపించుకోగా బాధితురాలి ఉదరంలో ముద్ద లాంటి పిండం అస్థిపంజరాన్ని ఎమ్మారైలో గుర్తించి 14న నాలుగు గంటలపాటు శ్రమించి పిండం అవశేషాలను తొలగించారు. -
ఇద్దరు చిన్నారులకు అరుదైన కేన్సర్ చికిత్స
హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్‌లో ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. పిల్లల తల్లిదండ్రులతో కలసి డాక్టర్ రాఘవేంద్రరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. కాలేయ కేన్సర్‌తో 9 నెలల చిన్నారి చరణ్, మూడేళ్ల బాలాజీలకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులను ఇతర సమస్యలతో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్య పరీక్షలో వ్యాధి బయటపడిందని డాక్టర్ రాఘవేంద్రరావు చెప్పారు. చిన్నారులకు సరైన సమయంలో నిపుణులైన వైద్యుల సాయంతో సురక్షితంగా చికిత్స చేసినట్టు వివరించారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి ఆధునిక పరికరాల సాయంతో ఆపరేషన్ చేయటంతో విజయవంతమైందని ఆయన విశదీకరించారు. ఆధునిక జీవన శైలితో పాటు జన్యుపరమైన కారణాలతో ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులు పెరిగిపోతున్నాయని రాఘవేంద్రరావు వెల్లడించారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో కాలేయ వ్యాధుల సంఖ్య అధికమవుతోందని ఆయన వివరించారు. మానవ శరీరంలో జీర్ణ క్రియతో పాటు కీలక విధుల్ని నిర్వర్తించే కాలేయానికి తలెత్తే ఇబ్బందుల్లో కేన్సర్ ముఖ్యమైన సమస్యని విశదీకరించారు. కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విశ్లేషించారు.