సాక్షి, విశాఖపట్నం: ఏ కారణం లేకుండా చిన్న వయసులోనే 11 ఏళ్ల పాపకు చచ్చుబడిపోయి వంకరైన కాళ్లను ‘టెండన్ ట్రాన్సఫర్’ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు కేజీహెచ్ వైద్యులు. ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది.
తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటకు చెందిన 11 ఏళ్ల బంగారు యశోదకు చిన్న వయస్సులోనే కుడి కాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 5న కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఆయన డాక్టర్ విజయకుమార్‌తో కలిసి డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఇలాంటి ‘టెండన్ ట్రాన్స్‌ఫర్’ సర్జరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 30 నుంచి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరిపీ చికిత్స అందించాలి. అందులో భాగంగానే ఫిజియోథెరిపీ చికిత్స పూర్తయిన తర్వాత గురువారం నాటికి పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు డాక్టర్ పి.వి.సుధాకర్ వెల్లడించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment