KGH Visakhapatnam
-
అరుదైన శస్త్రచికిత్స... చచ్చుబడిపోయిన కాళ్లు యథాస్థితికి
సాక్షి, విశాఖపట్నం: ఏ కారణం లేకుండా చిన్న వయసులోనే 11 ఏళ్ల పాపకు చచ్చుబడిపోయి వంకరైన కాళ్లను ‘టెండన్ ట్రాన్సఫర్’ ఆపరేషన్ ప్రక్రియ ద్వారా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు కేజీహెచ్ వైద్యులు. ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ, ఆంధ్ర మెడికల్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స విజయవంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం సూరపురాజుపేటకు చెందిన 11 ఏళ్ల బంగారు యశోదకు చిన్న వయస్సులోనే కుడి కాలు నరాలు చచ్చుబడిపోయి వంకరగా మారిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 5న కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ హెచ్‌వోడీ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన డాక్టర్ విజయకుమార్‌తో కలిసి డిసెంబర్ 6న సర్జరీ చేశారు. ఇలాంటి ‘టెండన్ ట్రాన్స్ఫర్’ సర్జరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 30 నుంచి 35 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరిపీ చికిత్స అందించాలి. అందులో భాగంగానే ఫిజియోథెరిపీ చికిత్స పూర్తయిన తర్వాత గురువారం నాటికి పూర్తి స్థాయిలో రికవరీ అయినట్లు డాక్టర్ పి.వి.సుధాకర్ వెల్లడించారు. ఇలాంటి చికిత్సలు అరుదుగా విజయవంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
రెండు రోజుల్లో పుట్టిన రోజు.. ఈ చిరునవ్వులు రాలిపోయాయి
ఆ చిరునవ్వులు ఇక లేవు..మృత్యుఒడిలో మాయమైపోయాయి. నిత్యం చలాకీగా సందడి చేసే ఆ నవ్వుల పూదోట వాడిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో విషాదం నింపింది. నేను లేని లోకంలో నిను చూసేది ఎవరు అనుకుందో ఏమో ఆ తల్లి తన కంటిపాపనూ తీసుకుపోయింది. సాక్షి,విశాఖపట్నం: కుటుంబ కలహా లతో వివాహిత రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్ బెహరా న్యూ పోర్టులో డెలివరీ విభాగంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి బెహరా(26), కుమారుడు రోనిత్ కుమార్ (2)తో కలిసి చుక్కవానిపాలెంలోని సువర్ణ శ్రీనివాసం అపార్ట్మెంట్లో రెండేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల్లో వారి కుమారుడు రోనిత్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవలసి ఉంది. ఈ వేడుకలపై భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవలు జరగుతున్నాయని వారి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జయంతి బెహరా తన కుమారుడిని తీసుకొని అపార్ట్మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న రోనిత్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సంతోష్ బెహరా విధుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం అయినట్లు కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేజీహెచ్‌తో పాటు మరో 17 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 100 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని వెల్లడించారు.చదవండి: కరోనా సోకిందనడానికి ఈ లక్షణాలే ఆధారం ‘నిన్నటి నుంచి క్లినికల్ ట్రయల్స్ వలంటీర్లు ఎంపిక ప్రారంభించాం. మొదట 10 మంది ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉన్నవారు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. సోమవారం నుంచి తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం అవుతున్నాం. మొత్తం అయిదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ వ్యాక్షిన్ ఇచ్చి, వారి రక్త నమూనాలు నమోదు చేస్తాం. ఆరు నెలలు పాటు ఎంపికైన 100మందిలో 75 మందికి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు శాంపిల్స్ అన్ని పంపిస్తాము’. అని డాక్టర్ సుధాకర్ తెలిపారు.చదవండి:శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ) -
‘నేను ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు’
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చోటుచేసుకున్న విషవాయువు దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక ఎల్జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తమని తాము కాపాడుకోవడానికి అనేకమంది రోడ్ల పైకి పరుగులు తీసుకుంటూ వచ్చారు. చాలా మంది ఈ విషవాయువు ప్రభావంతో స్పృహ తప్పి రోడ్డుపైనే పడిపోయారు. వారందరిని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలో తాము అనుభవించిన బాధను కొంత మంది బాధితులు పంచుకున్నారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) ‘నేను చనిపోతా అనుకున్నాను. నేను ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. అందరు తమ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీశారు. చాలా మందిని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని విశాఖ గ్యాస్ లీకేజీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక మహిళ తెలిపింది. మరో బాధితురాలు మాట్లాడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో పిల్లలు తాను నిద్రలేచామని, చూసేటప్పటికి పరిస్థితి అంతా అమోయమంగా ఉందని తెలిపింది. ఆ గందరగోళంలో పిల్లలు తన నుంచి తప్పిపోయారని, తరువాత స్పృహ కోల్పొయానని తెలిపింది. కళ్లు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నాని, ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపింది. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?) ‘మాకు ఒకరకమైన వాసన వచ్చింది. మాకు మంటలు కూడా కనిపించాయి. ఆ సమయంలో మాకు కడుపుతో తిప్పినట్లు అనిపించి వాంతులు కూడా అయ్యాయి. అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. తరువాత మేం హాస్పటల్‌కి చేరుకన్నాం’ అని మరో భాదితులు తెలిపారు. అయితే అక్కడ ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి సైరన్‌ను మ్రోగించడంతో అందరూ రోడ్లపైకి వచ్చేశారు. దీని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు కాల్వలో పడి మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు, ప్రభుత్వ సిబ్బంది ఆంబులెన్స్‌ల ద్వారా చాలా మందిని ఆసుపత్రికి తరలించారు. ప్లాంట్‌కి దగ్గరలో ఉన్న ఐదు గ్రామలపై ఈ గ్యాస్ ప్రభావం అధికంగా పడింది. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు) -
ఇదీ అసలు కథ
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ బాస్ ఏం చెప్పారో అవే మాటలు నిందితుడు శ్రీనివాసరావు నోటి వెంట చెప్పించేందుకు ‘సిట్’ బృందం తమదైన పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందురోజు ఎవరికంటా పడకుండా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి పోలీస్ శైలిలో కోటింగ్ ఇచ్చి తాము చెప్పినట్లే మీడియాకు చెప్పాలని కోచింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకున్న మూడోరోజు ప్రైవేటు వైద్యుడు సూచించాడంటూ కేజీహెచ్‌కు తరలిస్తూ హైడ్రామా ఆడారు. పోలీస్‌స్టేషన్ లోపలినుంచి గుమ్మం వరకు తనంతట తానుగా నడిచి వచ్చిన అతడు ఉన్నట్టుండి కూలబడి పోయాడు. ('పిచ్చి’ కుట్రలు) పోలీసులు రెండు చేతులు పట్టుకుని జీపు ఎక్కించడం.. ఆ వెంటనే నేను ప్రజలతో మాట్లాడాలి.. అంటూ అతను కేకలు వేయడం.. అక్కడనుంచి మీడియాను ఏమారుస్తూ కేజీహెచ్‌కు తరలించడం. అక్కడ అతనితో మీడియాకు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. తాను జగన్ అభిమానని, జగన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని, అతనితో పోలీసులు చెప్పించేందుకు విఫల యత్నం చేశారు. చివరకు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. (‘బాస్’ల నివేదిక సిద్ధం) వెలుగులోకి వచ్చిన హైడ్రామా... ఈ కథ వెనుక పోలీసులు ఆడిన హైడ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి సీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా నిందితుణ్ని గాజువాక సబ్ డివిజన్ పరిధిలోని ఓ మారుమూల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెల్లవారు జామువరకు పోలీసులు తమదైన శైలిలో కోటింగ్, కోచింగ్ ఇచ్చి ‘రేపు కేజీహెచ్‌కు తీసుకెళ్తాం.. మీడియాకు మేము చెప్పినట్టు చెప్పు’ అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (జగన్‌ను చంపేయాలనుకున్నా) మీడియా వెళ్లిపోయిన తర్వాత వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తగా... కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగించాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే అతని కదలికలు పూర్తిగా రికార్డు చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో కూడా కెమెరాల పర్యవేక్షణలోనే విచారణ సాగిస్తున్నారు. ఇక్కడ తమదైన శైలిలో నిందితుడిపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అర్ధరాత్రి తర్వాత లైట్లన్నీ ఆర్పేసి ఆ తర్వాత నిందితుడ్ని వేరే స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ తమ బాస్ చెప్పిన ఆ నాలుగు మాటలు చెప్పించేందుకు లాఠీలకు పని చెప్పారని చెబుతున్నారు. -
శ్రీను.. కొత్త సీను
మంగళవారం నిందితుడు, ఎయిర్‌పోర్టు క్యాంటీన్ సిబ్బందితోపాటు.. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి, చీఫ్ సెక్యూరిటీ అధికారి వేణుగోపాల్లను కూడా తొలిసారి పోలీసులు విచారించారు. ముఖ్యంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. సాక్షి, విశాఖపట్నం: ఘటన జరిగి ఆరురోజులైంది. నిందితుడు కస్టడీ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఆర్థిక లావాదేవీలు.. వాడిన సెల్ఫోన్ల సేకరణ.. కాల్ డేటా విశ్లేషణంటూ సగం పుణ్యకాలం గడిచిపోయింది. తొలిరోజు ఏ సమాధానాలైతే చెప్పాడో కస్టడీలో మూడో రోజు కూడా అదే సమాధానాలు నిందితుడి నోటి వెంట వస్తుండడంతో విచారణాధికారులు విస్తుపోతున్నారు. ఓ వైపు కస్టడీ గడువు తరుముకొస్తున్నా..ఈ ఘటనకు వెనుక ఉన్న కుట్రకోణాన్ని మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం బయటకు తీయలేకపోతోంది. చిక్కు ముడిని విప్పలేకపోతోంది. విచారణ సాగుతున్న తీరు చూస్తుంటే పక్కా వ్యూçహాత్మకంగానే సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసా..గుతోంది. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో హైడ్రామాలు సాగుతున్నాయి. వరుసగా మూడోరోజు కూడా నిందితుడు శ్రీనివాసరావును విచారించారు. ఆదివారం చికెన్ బిర్యానీ, సోమవారం శాకాహార భోజనం తీసుకున్న నిందితుడు మంగళవారం ఉన్నట్టుండి ఛాతినొప్పి వస్తుందంటూ వేలాడపడడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో స్థానిక ప్రైవేటు వైద్యుడు దేముడుబాబును రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్ రేటు సాధారణంగానే ఉందని, కానీ నిందితుడు ఆందోళనతో ఉన్నాడని, చేతులు, ఛాతి నొప్పిగా ఉన్నాయని అంటున్నాడని కేజీహెచ్‌కు తీసుకెళ్లడం మంచిదని దేవుడుబాబు సిఫార్సు చేశారు. ఆ వెంటనే హుటాహుటిన ప్రత్యేక బందోబస్తు మధ్య కేజీహెచ్‌కు తరలించి మళ్లీ బీపీ, పల్స్, షుగర్‌తో పాటు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించారు. స్టేషన్ వద్ద తాను ప్రజలతో మాట్లాడాలన్న నిందితుడు.. ఆస్పత్రి వద్ద తనకు ప్రాణహాని ఉందంటూ గగ్గోలు పెట్టాడు. కాగా గడిచిన రెండురోజులు బాగానే తింటున్నాడని, ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పిన సిట్ అధికారులు మంగళవారం సరిగా భోజనం చేయడం లేదని చెప్పడం విస్మయానికి గురిచేశారు. అంతేకాదు సోమవారం అర్ధరాత్రి బాత్రూమ్కు వెళ్తూ మీడియాకు నవ్వుతూ కన్పించిన నిందితుడు తెల్లారేసరికి నీరసంగా కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. రెండరోజు అర్ధరాత్రి 2.30 గంటల వరకు విచారణ పేరిట హైడ్రామా నడిచింది. కాగా మూడోరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా, సిట్ ప్రత్యేకాధికారి ఫకీరప్ప, సిట్ అధికారి నాగేశ్వరరావు స్టేషన్‌కు రాగా, కొత్తగా విధుల్లో చేరిన డీసీపీ–2 నయీమ్‌లు కూడా విచారణ టీమ్‌లో చేరారు. వీరంతా కలిసి రాత్రి 8 గంటల వరకు ఏకబికిన విచారణ సాగించారు. మంగళవారం రోజంతా నిందితుడు నుంచి ఎలాంటి అదనపు సమాచారాన్ని రాబట్టలేకపోయారని తెలియవచ్చింది. సిట్ ఎదుట ఎయిర్‌పోర్టు డైరెక్టర్, సీఎస్‌వో ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.ప్రకాష్‌రెడ్డి, సీఎస్‌వో వేణుగోపాల్‌లు సిట్ ఎదుట హాజరు కాగా, వారి నుంచి ఆరోజు ఘటనపై స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. మరో వైపు నిందితుడు వాడిన సెల్ఫోన్లు రికవరీ చేయడంతో పాటు కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాసరావు ఎక్కువగా మాట్లాడిన వారి నుంచి వివరాలు రాబట్టేందుకు మూడు ప్రత్యేక బృందాలు గుంటూరు, హైదరాబాద్‌తో పాటు గ్వాలియర్ కూడా పంపారు. మరో వైపు నిందితుడు జేబులో లభ్యమైన లేఖను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ స్థానిక మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా ఘటన సమయంలో జగన్ ధరించిన షెర్ట్ ఇప్పించాలని కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. సోమవారం కేసులో ఎలాంటి పురోగతి లేదని చెప్పగా, మంగళవారం విచారణ ఏమాత్రం పురోగతి లేదని సీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పుకొచ్చారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో వైద్య పరీక్షలకు పంపడం మినహా ఈరోజు ఎలాంటి దర్యాప్తు ముందుకు సాగలేదని పరోక్షంగా పేర్కొన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న దుండగుడు శ్రీనివాసరావు నుంచి మూడోరోజూ పోలీసులు ఎటువంటి వివరాలు రాబట్టలేకపోయారు. పైగా మధ్యాహ్నం నుంచి కొత్త డ్రామా చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీనివాసరావును జనరల్ చెకప్‌లో భాగంగా ప్రైవేట్ వైద్యుడితో పరీక్షలు చేయించారు. అదే సమయంలో తనకు ఛాతీ నొప్పి వస్తోందని.. ఎడమ చెయ్యి నొప్పెడుతోందని ఏడుపు లంకించుకోవడంతో.. కేజీహెచ్‌కు తరలించి ఎక్స్‌రేలు తీయించి.. పరీక్షలు జరిపించి ఎటువంటి సమస్యా లేదని తేల్చారు. కానీ పోలీస్ స్టేషన్ నుంచి కేజీహెచ్‌కు తరలించడం.. అక్కడ ఆ వార్డు నుంచి ఈ వార్డుకు పలుమార్లు తిప్పడం చూస్తే.. ఇదంతా కావాలని ఆడుతున్న నాటకంలా కనిపించింది. మీడియాకు, ముఖ్యంగా టీవీ చానళ్లకు నిందితుడి బైట్లు, అతని వాయిస్‌లు లభించేలా చేయడానికి అలా తిప్పారన్న ఆరోపణలు వినిపించాయి. అందుకు తగినట్లే నిందితడు ‘తాను జగన్ అభిమానిని’ అన్న పాత పాటతోపాటు.. తనకు ప్రాణహాని ఉందని, రక్షించాలని కేకలు వేశాడు. -
విషాద యాత్ర
పన్నెండు రోజులు... కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం... అంతా సవ్యంగానే సాగింది. కాశీ వంటి తీర్థయాత్రలను విజయవంతంగా చేసుకుని వచ్చారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఓ బస్సులో బయలుదేరిన వీరంతా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్దకు చేరుకున్నారు. సముద్రస్నానాలు చేశారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని చివరిగా సింహాద్రప్పన్నను దర్శించి ఇళ్లకు చేరాలనుకుని బయలుదేరారు. ఇన్నాళ్ల ప్రయాణం వల్ల వచ్చిన బడలిక... వాతావరణం చల్లగా ఉండటం... కాస్త కడుపులో ఆహారం పడటంతో... అంతా చిన్నగా కునుకు తీస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టింది. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అంతా బస్సులోనే ఇరుక్కున్నారు. తేరుకుని చూసేసరికి గాయాలతో అందరి ఒళ్లూ రక్తసిక్తమై ఉంది. తమతో ప్రయాణిస్తున్న ఓ ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో 46మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ యలమంచిలి వాసుల విషాద యాత్ర. భోగాపురం (విజయనగరం జిల్లా), యలమంచిలి రూరల్, మాకవరపాలెం : సుదీర్ఘ యాత్ర సవ్యంగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి విషాదం నింపింది. తమతో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సులోనే ప్రాణాలు కోల్పోగా 46 మంది తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఐకమత్యంగా వెళ్లిన వారంతా... ఒక్క సంఘటనతో కకావికలమయ్యారు. ఇదీ బుధవారం మధ్యాహ్నం భోగాపురం మండలం జాతీయ రహదారి పోలిపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఫలితం. యలమంచిలి, ఎస్.రాయవరం, మాకవరపాలెం, చిన్నగుమ్ములూరు, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన 43 మంది తోడుగా ఇద్దరు వంటపనివారను తీసుకుని ఈ నెల రెండో తేదీన కాశీయాత్రకు ఎస్ఎస్ టీఆర్ ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. పది రోజులపాటు దిగ్విజయంగా యాత్రలు పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లారేసరికి పూసపాటిరేగ సమీపానికి చేరుకోగానే చింతపల్లి వద్ద సముద్రంలో స్నానాలు చేసుకున్నారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసి అక్కడినుంచి సింహాచలం వెళ్లి వరాహనర్సింహస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ వద్ద ఒక్కసారిగా యూ టర్న్ తీసుకునేందుకు ఆగగా... దాని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఆ ధాటికి అదుపు తప్పిన లారీ ఎదురుగా యాత్రికులతో వస్తున్న బస్సును ఢీకొంది. బస్సు రెండు పల్టీలు కొట్టి తలకిందులైంది. అనుకోని సంఘటనతో యాత్రికులంతా ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ప్రమాదం వార్త తెలుసుకున్న సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే విస్తరణ పనులు చేపడుతున్న వారికి సమాచారం అందించి మూడు జేసీబీలను తీసుకువచ్చి లారీలో, బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక పోతిరెడ్డి పాలేనికి చెందిన కరణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి(52)లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ఎస్పీ పాలరాజు ప్రమాద స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్, అంబులెన్స్, బొలెరో ఇలా అన్ని వాహనాల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 28 మందిని, విశాఖ కేజీహెచ్‌లో 9మందిని, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 7గురిని తరలిం చారు. వారంతా ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వెల్లకట్టలేని గ్రామీణుల సేవలు ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లా పాపలతో హాహాకారాలు చేస్తున్న యాత్రికులను స్థానిక యువకులు బస్సులోంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి సమాచారం అందడంతో వైద్యాధికారి సునీల్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయాలపాలై రక్తం కారుతూ ఉన్న వారికి ప్రథమ చికిత్స చేశారు. వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు నుంచి సిబ్బంది వచ్చి కట్టర్ల ద్వారా బస్ సీట్లను, బాడీని కట్ చేసి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయ ధర్మకర్త కర్రోతు పైడిరాజు విద్యుత్ సరఫరాను అందించారు. స్థానికులు జనరేటర్ తీసుకువచ్చి, రోడ్డుపైన పడిఉన్న క్షతగాత్రులకు ఫ్యాను సౌకర్యం కలగజేసి ఉపశమనాన్ని అందించారు. -
బయో వ్యర్థాలతో ఆటలా..!
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన బయో వ్యర్థాలను కేజీహెచ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడే పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. బాటిల్స్‌లో సేకరించిన రక్త నమూనాలు, సిరంజిలు, పెప్పెట్లు వంటివి ఆవరణలో కాల్చేయడంతోపాటు తుప్పల్లో, డొంకల్లో పారేస్తున్నారు. అసలు వీటిని అంత నిర్లక్ష్యంగా ఎవరు బయటకు తీసుకొస్తున్నారో అంతుచిక్కడం లేదు. భవంతుల వెనుక ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని తగలబెట్డడం వల్ల ఎవరికీ తెలియడం లేదు. అటుగా వెళ్లిన రోగులు, వారి బంధువులు వీటిని చూసి భయపడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. బయో వ్యర్థాలను జాగ్రత్తగా తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని... అధికారులు తగిన చర్యలు తీసుకొని సంబంధిత సిబ్బందిని హెచ్చరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
మన్యాన్ని వీడని మహమ్మారి
► 2009లో వెలుగు చూసిన ఆంత్రాక్స్ ► మరో రెండు గ్రామాల్లో వ్యాధి లక్షణాలు ► పాడేరు ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు ► ప్రాథమిక సేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు ► పశుమాంసం తినడం వల్లే అంటున్న వైద్య సిబ్బంది పాడేరు: ప్రాణాంతక ఆంత్రాక్స్ మహమ్మారి మన్యాన్ని వీడటం లేదు. 2009 నుంచి ఏదో ఒక ప్రాంతంలో ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్, అత్తికల్లు, ఆడారిలడి, ముక్కిపుట్టు, బరడ గ్రామాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపింది. అప్పట్లో 20 మందికి పైగా దీని బారిన పడ్డారు. కాళ్లు,చేతులపై పెద్ద పెద్ద గాయాలు ఏర్పడి శరీరమంతా కబళించడంతో సుమారు పది మంది చనిపోయారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ భీముడువలస వాసులనూ ఇది పీడించింది. ఇక్కడ ఎవరూ చనిపోనప్పటికీ కొన్ని పశువులను కబళించింది. నాటి నుంచి అక్కడక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. ఇటీవల హుకుంపేట మండలం పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోక ముందే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ వెన్నెలకోటలో ఆరుగురు, గొయ్యిగుంటలో 13 మంది దీని బారిన పడ్డారు. వెన్నెలకోటకు చెందిన కొర్రా సుందరరావు, కొర్రా కృష్ణారావు, కొర్రా సీందు, గెమ్మెలి గంగన్నదొర, కిల్లో దన్ను, గెమ్మెలి భాస్కరరావు, గొయ్యిగుంటకు చెందిన కిల్లో పుల్లయ్య, మర్రినాగేశ్వరరావు, కొర్రా సుబ్బరావు, కిల్లో సుబ్బారావు, కిల్లో సుందరరావు, కిల్లో చిట్టిబాబు, పాంగి చంటి, పాంగి సుబ్బారావు, మర్రి పల్సో, కిల్లో చిట్టిబాబు, కొర్రా కామేశ్వరరావులతో పాటు మహిళలు కిల్లో సావిత్రి, మర్రి కుదే ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో గెమ్మెలి గంగదొర కుడి కాలు అడుగుభాగం పూర్తిగా కుళ్లిపోయింది. ఇతని పరిస్థితి విషమంగా ఉంది. చర్మవ్యాధిగా కనిపించే ఈ మహమ్మారి కొద్ది రోజుల్లోనే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుండటంతో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్ డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందం రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేపట్టింది. గతంలో కూడా వైద్యనిపుణులు ముంచంగిపుట్టు ప్రాంతంలో ఆంత్రాక్స్‌పై పరిశోధనలు జరిపారు. కట్టుదిట్టమైన చర్యలతో ఆ ప్రాంతంలో ఈ వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది. పశుమాంసం తినడం వల్లే .. నిల్వ ఉన్న పశుమాంసం తినడం వల్లే ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్టు వైద్యబృందాల పరిశీలనలో వెల్లడవుతోంది. ఆంత్రాక్స్ వెలుగు చూసిన ప్రతి గ్రామంలోనూ దీనిపై అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం నిర్ధారణ అయింది. ఏజెన్సీలోని కొన్ని తెగల పీవీటీజీలకు పూర్వం నుంచి పశుమాంసం తినడం అలవాటు. వారపుసంతల్లోనూ దీనిని చాటుమాటుగా విక్రయిస్తుంటారు. చనిపోయినవాటిని తినడం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందన్న వాదన ఉంది. నిల్వ ఉంచిన, చనిపోయిన పశువుల మాంసం తిని వివిధ గ్రామాల వారు డయేరియా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడిన వెన్నెలకోట, గొయ్యిగుంట గ్రామాల్లో రెండు వారాల్లో వ్యాధులతో 30 పశువులు, 20మేకలు చనిపోయాయి. వాటి మాంసం ఆదివాసీలు తిన్నారు. నాటి నుంచే చర్మంపై కురుపులు, పొక్కులు వచ్చాయని ఆయా గ్రామస్తులు అంగీకరిస్తున్నారు. ఏళ్లమామిడి గ్రామం నుంచి వెన్నెలకోట చుట్టంచూపుగా వచ్చిన పాంగి అప్పారావు కూడా ఈ మాంసం తిని చర్మవ్యాధులకు గురయ్యాడు. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానం వైద్యనిపుణుల బృందం క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానిస్తోంది. వారం రోజులుగా పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. రక్తనమూనాలను ప్రయోగశాలకు తరలించారు. జి.మాడుగుల మండలం వెన్నెలకోట, గొయ్యిగుంటల్లో ఆంత్రాక్స్ లక్షణాలతో మరో 19 మంది బాధపడుతున్నట్టు వెలుగులోకి రావడంతో అధ్యయనానికి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల బృందం మంగళవారం ఈ గ్రామాల్లో పర్యటించనుంది. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే 10 కిలోమీటర్ల పరిధిలో పశువులకు వ్యాక్సినేషన్ చేపడతామని పశుసంవ ర్థకశాఖ ఏడీ ఎం.కిశోర్ తెలిపారు.