
ఆ చిరునవ్వులు ఇక లేవు..మృత్యుఒడిలో మాయమైపోయాయి. నిత్యం చలాకీగా సందడి చేసే ఆ నవ్వుల పూదోట వాడిపోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో విషాదం నింపింది. నేను లేని లోకంలో నిను చూసేది ఎవరు అనుకుందో ఏమో ఆ తల్లి తన కంటిపాపనూ తీసుకుపోయింది.
సాక్షి,విశాఖపట్నం: కుటుంబ కలహా లతో వివాహిత రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్ బెహరా న్యూ పోర్టులో డెలివరీ విభాగంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య జయంతి బెహరా(26), కుమారుడు రోనిత్ కుమార్ (2)తో కలిసి చుక్కవానిపాలెంలోని సువర్ణ శ్రీనివాసం అపార్ట్‌మెంట్‌లో రెండేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల్లో వారి కుమారుడు రోనిత్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవలసి ఉంది.
ఈ వేడుకలపై భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో గొడవలు జరగుతున్నాయని వారి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జయంతి బెహరా తన కుమారుడిని తీసుకొని అపార్ట్‌మెంట్ పైకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న రోనిత్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సంతోష్ బెహరా విధుల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment