చికిత్స అనంతరం శిశువుతో తల్లిదండ్రులు. చిత్రంలో ఆస్పత్రి వైద్యబృందం
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కేజీల బరువు ఉన్న నాలుగు మాసాల మగ శిశువు రెండు మూత్రపిండాల నుంచి 6 రాళ్లను వైద్యులు విజయవంతంగా తొలగించారు. కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే శిశువు కిడ్నీల నుంచి రాళ్లను తొలగించినట్లు నగరంలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ తరహా చికిత్స ప్రపంచంలోనే మొదటిసారని చెప్పారు. ఈ మేరకు గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండీ, సర్జన్ డాక్టర్ వి.చంద్రమోహన్, రేడియాలజిస్ట్ డాక్టర్ రూప, యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, అనస్థీషియన్ డాక్టర్ పవన్, పీడియాట్రిక్ డాక్టర్ అజయ్‌లతో కూడిన బృందం చికిత్స వివరాలను వెల్లడించింది.
రెండు కిడ్నీల్లో ఆరు రాళ్లు..
అత్తాపూర్‌కు చెందిన అర్షాద్ హుస్సేన్ దంపతులకు ఏప్రిల్ 5వ తేదీన మగ బిడ్డ జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మాంసాహారులు కావడం, గర్భస్థ సమయంలో డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తడం వల్ల పుట్టుకతోనే శిశువు కిడ్నీలో రాళ్ల ఏర్పడ్డాయి. మూడో నెలలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోగా ఆ తర్వాత మూత్ర విసర్జనా నిలిచిపోయింది. వైద్యులు పొట్ట సహా కిడ్నీ ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్స కోసం కేపీహెచ్‌బీలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ప్రీతి ఆస్పత్రి యూరాలజీ సర్జన్ డాక్టర్ చంద్రమోహన్ బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో 3, కుడి కిడ్నీలో 3 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
నెలరోజుల క్రితం రిట్రో గ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ (ఆర్‌ఐఆర్‌ఎస్) పద్ధతిలో విజయవంతంగా రాళ్లను తొలగించారు. కేవలం గంట వ్యవధిలోనే రెండు కిడ్నీల్లో ఉన్న ఆరు రాళ్లను లేజర్ కిరణాల ద్వారా కరిగించి, మూత్ర నాళం నుంచి కిడ్నీ వరకు స్టంట్‌ను అమర్చారు. పది రోజుల తర్వాత స్టంట్‌ను కూడా తొలగించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ రాళ్లను కరిగించి, బయటికి తీయడం ద్వారా శరీరంపై ఎలాంటి కోతలు, కుట్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ తరహా చికిత్సకు ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో పాటు అనస్థిషియా నిపుణులు, రేడియాలజిస్ట్‌ల సేవలు అవసరం ఉంటుందని డాక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు.
ప్రతి లక్ష మంది పిల్లల్లో ముగ్గురికి
‘డీహైడ్రేషన్, పోషకాహారలోపం, అధికంగా మాంసం, మద్యం సేవించడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. పెద్దల్లో చాలా సహజం. కానీ చిన్నపిల్లల్లో అది కూడా నాలుగు నెలల శిశువు కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా అరుదు. జన్యుపరమైన లోపాల వల్ల ప్రతి లక్ష మంది శిశువుల్లో ముగ్గురికి మాత్రమే ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పటివరకు చైనా, టర్కి దేశాల్లో ఏడు, ఎనిమిది నెలల పిల్లలకు ఈ తరహా చికిత్స చేశారు. కానీ నాలుగున్నర కేజీల బరువున్న నాలుగు నెలల శిశువుకు రెండు కిడ్నీల నుంచి ఆరు రాళ్లను తొలగించడం ప్రపంచంలోనే ఇదే ప్రధమం’వైద్యులు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment