గుంటూరుమెడికల్ : గుంటూరు జీజీహెచ్ చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య నిపుణులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి పది నెలల చిన్నారి ప్రాణాలు కాపాడారు. అత్యంత అరుదైన కణితిని చిన్నారి కడుపు నుంచి తొలగించి రికార్డు సృష్టించారు. పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగాధిపతి(పీడియాట్రిక్ సర్జరీ) డాక్టర్ చందా భాస్కరరావు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం జాలాదికి చెందిన గోగులమూడి నాగార్జున, లావణ్య దంపతుల పది నెలల రియాన్స్ ఈ నెల ఒకటో తేదీ నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు.
తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత పెరగసాగింది. తల్లిదండ్రులు 6న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పీడియాట్రిక్ వైద్యులు రెండు రోజుల పాటు చిన్నారికి చికిత్స అందించి ఈ నెల 8న పీడియాట్రిక్ సర్జరీ వైద్య విభాగానికి రిఫర్ చేశారు. అన్ని రకాల పరీక్షలు చేసి ఉదర కోశ రాక్షస కణితి(గ్యాస్ట్రిక్ టెరటోమా) ఉన్నట్లు నిర్ధారించారు. 20 సెంటీ మీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతుతో, చిన్నారి పొట్టను చాలా వరకు ఆక్రమించింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి ట్యూమర్లు కేవలం 112 మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 15న ఐదున్నరగంటల సేపు ఆపరేషన్ చేసి కణితిని పూర్తిగా తొలగించారు. సుమారు రూ.10 లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్టు వివరించారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు డాక్టర్ జయపాల్, డాక్టర్ సుమన్, డాక్టర్ మౌనిక, డాక్టర్ బారిష్, డాక్టర్ పరశురామ్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నాగభూషణం, డాక్టర్ వహిద పాల్గొన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment