విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆస్పత్రి వైద్యులు, చిత్రంలో రోగి చిన్నకేశన్న
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ రోగికి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సూపరిటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఈఎన్‌టీ, అనస్తీషియా హెచ్‌ఓడీలు డాక్టర్ నవీద్, డాక్టర్ నవీన్, అంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తాడిపత్రి వెంకటాంపల్లికి చెందిన చిన్నకేశన్న కేన్సర్‌తో బాధపడేవాడు. కర్నూలులో కీమో థెరపీ చేయించినా ఆయాసం, దగ్గు తరచూ వస్తుండేది. దీంతో కుటుంబ సభ్యులు మే 23న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఈఎన్‌టీ వైద్యులు పరీక్షించి స్వరపేటికకు కేన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో సర్జికల్ ఆంకాలజిస్టు, అనస్తీషియా, ఈఎన్‌టీ వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్య పరీక్షలు చేయగా టీబీ (క్షయ) బయటపడింది. మరో పది రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి వైద్యం అందించారు. తిరిగి సర్జరీ చేసేందుకు సిద్ధమవగా ఈసారి ఊపిరితిత్తులు, గుండె సమస్యను గుర్తించారు.
అనస్తీషియా, ఈఎన్‌టీ, సర్జికల్ ఆంకాలజిస్టు మరోసారి సమావేశమై, స్వరపేటికను తొలగించాలని నిర్ణయించారు. మత్తుమందు శరీరం మొత్తం ఇస్తే చనిపోయే ప్రమాదం ఉందని, గొంతు భాగంలో మాత్రమే మత్తు ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 26న చిన్నకేశన్నకు ఆంకాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ, ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్ సుధీర్, అనస్తీషియా వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు రోగి స్పృహలో ఉండగానే గొంతుకు మత్తుమందు అందించి స్వరపేటిక తొలగించారు. మూడున్నర గంటపాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా చేశారు. తన తండ్రికి ఊపిరి పోసిన వైద్యులకు రుణపడి ఉంటానని చిన్నకేశవన్న కుమారుడు రవికుమార్ తెలిపాడు. విలేకరుల సమావేశంలో ఆర్‌ఎంఓ డాక్టర్ జమాల్‌బాషా, అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment