ఇద్దరు చిన్నారులకు అరుదైన కేన్సర్ చికిత్స
హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్లో ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. పిల్లల తల్లిదండ్రులతో కలసి డాక్టర్ రాఘవేంద్రరావు వివరాలను మీడియాకు వెల్లడించారు.
కాలేయ కేన్సర్తో 9 నెలల చిన్నారి చరణ్, మూడేళ్ల బాలాజీలకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఇద్దరు చిన్నారులను ఇతర సమస్యలతో ఆస్పత్రికి తీసుకువచ్చారని, వైద్య పరీక్షలో వ్యాధి బయటపడిందని డాక్టర్ రాఘవేంద్రరావు చెప్పారు. చిన్నారులకు సరైన సమయంలో నిపుణులైన వైద్యుల సాయంతో సురక్షితంగా చికిత్స చేసినట్టు వివరించారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి ఆధునిక పరికరాల సాయంతో ఆపరేషన్ చేయటంతో విజయవంతమైందని ఆయన విశదీకరించారు.
ఆధునిక జీవన శైలితో పాటు జన్యుపరమైన కారణాలతో ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులు పెరిగిపోతున్నాయని రాఘవేంద్రరావు వెల్లడించారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో కాలేయ వ్యాధుల సంఖ్య అధికమవుతోందని ఆయన వివరించారు. మానవ శరీరంలో జీర్ణ క్రియతో పాటు కీలక విధుల్ని నిర్వర్తించే కాలేయానికి తలెత్తే ఇబ్బందుల్లో కేన్సర్ ముఖ్యమైన సమస్యని విశదీకరించారు. కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విశ్లేషించారు.