11 రోజుల శిశువు గుండెకు అరుదైన శస్త్రచికిత్స
♦ పుట్టుకతోనే అసాధారణ గుండె కవాటాన్ని కలిగి ఉన్న శిశువు
♦ గర్భంలో ఉండగానే గుర్తింపు, ప్రసవించిన పదకొండో రోజు చికిత్స
♦ శిశువుకు 3 ఎంఎం సైజు స్టంట్ అమర్చిన అపోలో వైద్యులు
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే అసాధారణ గుండె కవాటం (ఎబ్‌స్టైన్స్ అనొమలి) కలిగి ఉన్న 11 రోజుల శిశువుకు అపోలో ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. అతి తక్కువ బరువు, వయసున్న శిశువు గుండె రక్తనాళానికి 3 ఎంఎం సైజు స్టంట్‌ను అమర్చి చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన హుస్సేన్, సోనియా భార్యాభర్తలు. సోనియా గర్భం దాల్చడంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న వైద్యులను ఆశ్రయించింది. కడుపులోని బిడ్డ శారీరక ఎదుగుదలను అంచనా వేసేందుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించింది. కడుపులోని బిడ్డ గుండెకు కాంప్లెక్స్ హోల్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
వారి సూచనల మేరకు ఆమె అపోలో వైద్యులను ఆశ్రయించింది. ఫిటల్ ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష చేసిన వైద్యులు.. శిశువు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పుపుస కవాటం మూసుకుపోయినట్లు గుర్తించారు. ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో అబార్షన్ చేసి మృత శిశువును బయటికి తీస్తారు. ఈ సమయంలో అబార్షన్ చేయడం వల్ల తల్లి ప్రాణాలకే ప్రమాదం. వైద్యులు ఇదే అంశాన్ని హుస్సేన్, సోనియాకు తెలపగా వారు ప్రసవానికే మొగ్గు చూపారు.
సోనియా ఎనిమిదో మాసం(సెప్టెంబర్ మొదటి వారం)లోమగ బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే పుట్టిన శిశువు బరువు 1.2 కేజీలు. పుట్టుకతోనే శిశువు గుండె, ఊపిరితిత్తులకు మధ్య ఉండే ధమని మూసుకుపోవడంతో శిశువు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. దీంతో ప్రత్యేక మందులతో ఊపిరితిత్తులకు రక్తం ద్వారా ఆక్సిజన్‌ను అందించేలా చికిత్స అందించారు.
ప్రసవించిన 11వ రోజే చికిత్స: అపోలో ఆస్పత్రికి చెందిన సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గిరీశ్ వారియర్, క్రిటికల్ కేర్ నిపుణురాలు డాక్టర్ మీనా త్రెహన్, పీడియాట్రిషన్ డాక్టర్ షర్మిలాతో కూడిన వైద్య బృందం శిశువుకు సెప్టెంబర్ 14న కార్డియో పల్మనరీ బైపాస్ పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. శిశువు కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3 ఎంఎం సైజు స్టంట్‌ను మూసుకుపోయిన రక్తనాళంలో విజయవంతంగా అమర్చింది. ప్రస్తుతం శిశువు కోలుకోవడంతో సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
శిశువుకు ఇదే చివరి శస్త్రచికిత్స కాదని, శారీరక ఎదుగుదల, వయసును బట్టి మరో రెండు, మూడు సార్లు శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని వైద్యులు స్పష్టం చేశారు. అతి తక్కువ బరువు, వయసు ఉన్న శిశువు గుండె రక్తనాళానికి స్టంట్‌ను అమర్చడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు.