శస్త్రచికిత్స చేయించుకున్న పావనితో వైద్యాధికారులు, వైద్యులు
నెల్లూరు(బారకాసు) : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నిప్పోసెంటర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల పావని ఆడుకుంటూ పడిపోయింది. దీంతో ఆమె ఎడమ కాలి తొడ విరిగిపోయింది. వెంటనే పావనిని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూపించారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఆమెకు సర్జరీ చేసింది.
అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరింది. చివరికి ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకొచ్చి ఆర్థోపెడిక్ విభాగంలో చూపించారు. అక్కడి వైద్యులు పావనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. పావనికి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అయిందని గుర్తించారు. యువతి తల్లిదండ్రుల అంగీకారం మేరకు పావనికి నెల క్రితం ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం ఆపరేషన్ చేసింది. నెల పాటు యువతికి ఆస్పత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించి నడిచే స్థితికి తీసుకొచ్చారు.
దీంతో పావనిని వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను కార్పొరేట్ హాస్సిటల్‌లో నిర్వహిస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, అయితే జీజీహెచ్‌లో పూర్తి ఉచితంగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు.
ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ రవిశంకర్, ప్రొఫెసర్ చంద్రశేఖర్‌నాయుడు, వైద్యులు మధు, కిరణ్, భాస్కర్, దివ్య, గులాబీ సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి పావనికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం పావని తండ్రి సురేష్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి డాక్టర్ కళారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment