పెట్రోల్ పోసుకుని కారులో సజీవ దహనం
బంధువు బ్లాక్‌మెయిల్ చేయడంతో మనస్తాపం చెందిన ప్రేమికులు
ఘట్‌కేసర్: ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని ఓ వ్యక్తి వేధించడంతో ప్రేమ జంట బలైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ పరశురాం, బంధువులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్ (25) బతుకుదెరువు నిమిత్తం 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జమీలాపేటకు వెళ్లి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ దుకాణం నడుపుతున్నాడు. చౌదరిగూడకు చెందిన ఇంటర్ చదివే ఓ మైనర్ బాలికను శ్రీరామ్ ప్రేమించాడు.
బ్లాక్‌మెయిల్ చేసిన దగ్గరి బంధువు...
శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్‌మెయిల్ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం షాపింగ్ వెళ్లాలని శ్రీరామ్ తన స్నేహితుడి దగ్గర ఎర్టిగా కారును తీసుకున్నాడు.
సోమవారం సాయంత్రం ప్రేమ వ్యవహారం, బ్లాక్‌మెయిల్ విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రికి ‘అంకుల్’ అని సంబోధిస్తూ సూసైడ్ నోట్ రాసి, తన అన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా పంపించాడు. అనంతరం ఎర్టిగా వాహనంలో ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్ సమీపంలో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద కారులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంటలకు తాళలేక శ్రీరామ్ కారు డోరు తెరుచుకొని సర్వీస్ రోడ్డు ఫుట్‌పాత్‌పై పడి మృతిచెందాడు. బాలిక కారు ముందు సీటులో కూర్చొని గుర్తు పట్టలేని మాంసం ముద్దలా కాలి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పారు. మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment