ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం
రూ.కోట్లలో నష్టం
యూనిట్–1, 2లోవిద్యుదుత్పత్తి నిలిపివేత
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్టేజ్ –1 వద్ద ఉండే ‘జీటీ’ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎగిసిపడిన మంటలు సుమారు అర్ధగంటకు పైగా చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, ప్లాంట్ కీలక అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు.
ఎట్టకేలకు రాత్రి 8.05 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండే ప్రదేశం వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే 1, 2 యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపి వేసినట్లు సమాచారం. అయితే చిన్న సాంకేతిక లోపంతో యూనిట్–1ను అధికారులు ఉదయమే నిలిపివేశారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం యూనిట్–1కు సంబంధించినదా? లేక యూనిట్–2లోదా? అనేది తేలాల్సి ఉంది. అగ్ని ప్రమాదంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ప్లాంట్ ఏరియాలో పిడుగుపాటు నివారణకు స్విచ్ యార్డ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండగా, దానికి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పిడుగు పడిందని అధికారులు చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా? లేక పిడుగుపాటా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఈ బిచ్చన్నను వివరణ కోరగా పిడుగుపాటా? అనేది ఇప్పుడే చెప్పలేమని, విచారణానంతరమే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. యూనిట్ –1లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment