థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పిడుగుల నుంచి రక్షణకు పటిష్ట వ్యవస్థలు
అయినా అవి విఫలం కావడంతోనే భద్రాద్రి కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగుపాటు
డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలే కారణమని అనుమానాలు
రూ.వేల కోట్లతో నిర్మించిన కొత్త విద్యుత్ కేంద్రాల భద్రతపై సందేహాలు
శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదం నుంచి జెన్‌కో ఏమీ నేర్చుకోలేదని విమర్శలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్‌లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్‌పిట్‌ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్‌కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ వ్యవస్థలన్నీ విఫలం...
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్‌లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్‌యార్డ్‌గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్‌కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.
వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్‌యార్డ్‌కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్‌యార్డ్‌పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చే స్తారు.
ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్‌లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది.
సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు..
పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్‌ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్‌ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.
అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.
ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలం
జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్‌కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్‌ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment