జెన్‌కో అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ప్రమాదానికి లోనైన యూనిట్–1ను పునరుద్ధరించి విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. మధిరలో జెన్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్‌ఈఎల్ నిపుణుల బృందం వస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఆ తర్వాతే నష్టంపై పూర్తి అంచనాకు రాగలుగుతామన్నారు.
బీటీపీఎస్‌కు రూ.25 కోట్ల నష్టం!
జాగ్రత్తలన్నీ తీసుకున్నా పిడుగు పడిందన్న అధికారులు
జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ పునరుద్ధరణకు 45 నుంచి 60 రోజులు!
మణుగూరు టౌన్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి పిడుగు పడటంతో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ జెన్‌కో అధికారులు అంచనాకు వచ్చారు. జెన్‌కో థర్మల్ విభాగం డైరెక్టర్ బి.లక్ష్మయ్య, సీఈ బి.రత్నాకర్... బీటీపీఎస్ సీఈ బిచ్చన్నతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ పిడుగు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా పిడుగుపడినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకుగల కారణాలపై విచారణ చేపడుతున్నామన్నారు. మరోవైపు 270 మెగావాట్ల ఒకటో యూనిట్‌లోని జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్, ఇతర పరికరాలు దగ్ధమవగా పునరుద్ధరించడానికి 45 నుంచి 60 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను విడదీసే పనిలో నిమగ్నమయ్యారు.
తప్పిన భారీ ప్రమాదం..
జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 80 వేల లీటర్ల లిక్విడ్ ఆయిల్ ఉండగా పిడుగుపాటుతో దాని బుష్‌ల నుంచి ఆయిల్ లీక్ అయి మంటలు ఎగసిపడ్డాయని అధికారులు చెబుతున్నారు. మంటలు దగ్గరలోని జనరేటర్‌కు వ్యాపించి ఉంటే మొత్తం యూనిట్–1 దగ్ధమై ఊహించలేని ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment