Bhadradri Thermal Power Station
-
అగ్గే.. పిడుగు కాదు!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీఎస్)లోని యూనిట్–1కు చెందిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి పిడుగుపాటు కారణం కాదని జెన్కో దర్యాప్తులో తేలింది. పిడుగు పడిన సమయంలోనే యాధృచ్చికంగానే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో..దాని లోపల మంటలు ఉత్పన్నమయ్యాయని, ఇందుకు బాహ్య కారణాలు లేవని నిర్ధారించింది. శనివారం బీటీఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణాలను విశ్లే షిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. కారణాన్ని పట్టించిన రిలే వ్యవస్థ ట్రాన్స్ఫార్మర్లలో ‘రిలే’అనే రక్షణ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి వాటి నివారణకు సంబంధిత రక్షణ వ్యవస్థలను అప్పటికప్పుడు రిలే వ్యవస్థ క్రియాశీలం చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావడానికి అంతర్గత లోపాలు కారణమా? బాహ్య సమస్యలు కారణమా? అనే విషయాన్ని ఏ రకమైన రిలేలు ప్రమాద సమయంలో ఆపరేట్ అ య్యాయో పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. » బీటీఎస్‌లో ప్రమాదం జరిగినప్పుడు ‘87జీటీ, 64ఆర్’అనేæ రెండు వేర్వేరు రిలే వ్యవస్థలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయి. » ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనపుడు మాత్రమే ఈ రెండు రిలేలు ఆపరేట్ అవుతాయి. » ట్రాన్స్ఫార్మర్కు బాహ్యంగా ఏదైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే యాక్టివేట్ అయ్యే ‘87 హెచ్వీ’అనే రిలే వ్యవస్థ ఆ సమయంలో స్పందించలేదు. దీంతో అంతర్గత సమస్యలతోనే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైందని జెన్కో ఇంజనీరింగ్ నిపుణులు నిర్ధారించారు. ఆజ్యం పోసిన ఆయిల్ లీకేజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీఎస్‌లో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కి సంబంధించిన జనరేటింగ్ స్టేషన్లో 16కేవీ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి అవుతుంది. దీనిని 400కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలుంటుంది. ఈ పనిని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్ చేస్తుంది. » జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయిన విద్యుత్ ఆర్‌వైబీ(రెడ్ ఎల్లో బ్లూ) అనే మూడు ఫేజుల కండర్ల(తీగల) ద్వారా ట్రాన్స్ఫార్మర్ వరకు సరఫరా అయ్యి బుష్‌ల ద్వారా లోపలికి వెళుతుంది. » ట్రాన్స్ఫార్మర్ లోపల చుట్టబడిన కాయిల్స్ ఆయిల్లో మునిగి ఉంటాయి. » ఆర్‌వైబీ అనే మూడు ఫేజులుండగా, బీ–ఫేజ్ కాయిల్స్‌లో ఫాల్ట్ ఏర్పడి మంటలు చోటు చేసుకున్నట్టు ‘రిలే’వ్యవస్థల స్పందన ద్వారా నిర్ధారించారు. » ఎప్పుడైతే బీ–ఫేజ్‌కు ప్రమాదం జరిగిందో.. ఆర్ ఫేజ్ మధ్య విద్యుత్ ఓల్టేజీ భారీగా పెరిగి ట్రాన్స్ ఫార్మర్లోని ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ నుంచి బుష్‌ల ద్వారా ఆయిల్ బయటకు వచ్చి లీక్ అయ్యింది. » ఆయిల్ లీక్ కావడంతో అగి్నకి ఆజ్యం పోసినట్టు అయ్యి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ కారణాలను విశ్లేషించిన తర్వాత ప్రమాదం పిడుగు వల్ల కాకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏర్పడిన అంతర్గత లోపాలతోనే జరిగినట్టు జెన్కో నిపుణులు తేల్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.30కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ఇప్పటికే ఓ నిర్థారణకు వచ్చారు. ట్రాన్స్ఫార్మర్ను పూర్తిగా విప్పి పరిశీలించిన తర్వాత నష్టంపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రభుత్వానికి జెన్కో తెలియజేసింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో అంతర్గత లోపాలు ఏర్పడడానికి నిర్మాణ, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు కారణం కావొచ్చని భావిస్తున్నారు. -
బీటీపీఎస్‌లో పిడుగుపాటు?
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్టేజ్ –1 వద్ద ఉండే ‘జీటీ’ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎగిసిపడిన మంటలు సుమారు అర్ధగంటకు పైగా చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, ప్లాంట్ కీలక అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. ఎట్టకేలకు రాత్రి 8.05 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రదేశం వద్దే అగ్ని ప్రమాదం జరగడంతో.. అధికారులు వెంటనే 1, 2 యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపి వేసినట్లు సమాచారం. అయితే చిన్న సాంకేతిక లోపంతో యూనిట్–1ను అధికారులు ఉదయమే నిలిపివేశారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం యూనిట్–1కు సంబంధించినదా? లేక యూనిట్–2లోదా? అనేది తేలాల్సి ఉంది. అగ్ని ప్రమాదంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్లాంట్ ఏరియాలో పిడుగుపాటు నివారణకు స్విచ్ యార్డ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండగా, దానికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పిడుగు పడిందని అధికారులు చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా? లేక పిడుగుపాటా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఈ బిచ్చన్నను వివరణ కోరగా పిడుగుపాటా? అనేది ఇప్పుడే చెప్పలేమని, విచారణానంతరమే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. యూనిట్ –1లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. -
సరికొత్త వెలుగులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) రాష్ట్రానికి వెలుగులు అందించడం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక–మణుగూరు సరిహద్దులో 1,080 మెగావాట్ల (270‘‘4) విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌లో శుక్రవారం మొదటి యూనిట్ నుంచి సీవోడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రక్రియ విజయవంతం అయింది. దీంతో బీటీపీఎస్ నుంచి రాష్ట్రానికి ఇక నుంచి నిరంతరాయంగా వెలుగులు అందనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్ మొదటి యూనిట్ నుంచి గంటకు 19.556 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కానున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్ బీటీపీఎస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్ మొదటిది. బీహెచ్ఈఎల్ సంస్థకు జెన్కో నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీవోడీ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి యూనిట్ నుంచి 2019 సెప్టెంబరు 19న సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా సీవోడీ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ విజయవంతం గా పూర్తి చేశారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతం కావడంతో సీవోడీ ప్రక్రియ పూర్తయింది. ఇక రెండు, మూడు యూనిట్ల నిర్మాణం సైతం 70 శాతం పూర్తయినట్లు జెన్కో అధికారులు తెలిపారు. కొత్త సేవలపై హర్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) ఆరు దశాబ్దాలుగా రాష్ట్రానికి వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. అయితే ఇందులో 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కాలం చెల్లిన ఓఅండ్ఎం (1,2,3,4 దశలు) ప్లాంట్లను గత మార్చి 31న మూసివేశారు. వీటిని నిర్మించి 50 ఏళ్లు దాటడంతో నిబంధనల మేరకు మూసివేశారు. అయితే కేటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో సమస్య తీరింది. 2018 డిసెంబర్ 26న కేటీపీఎస్ 7వ దశ సీవోడీ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రస్తుతం (720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 1, 2, 3, 4 దశలు మూసేశాక) ఇక్కడి నుంచి 7వ దశతో కలుపుకొని 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. తాజాగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రస్తుతం 2,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చినట్లయింది. కాగా బీటీపీఎస్ విజయవంతం కావడంతో సిబ్బందికి సీఎండీ ప్రభాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. -
‘భద్రాద్రి’ ప్లాంట్ కు పచ్చజెండా
పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు- పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న భద్రా ద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) స్థానిక ప్రజలు పచ్చజెండా ఊపారు. పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ఉప్పాక సీతారాంపురంలో పోలీసు పహరా నడుమ జరి గింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండడంతో దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు వద్ద 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్, పాల్వంచలో 7వ దశ కింద కేటీపీఎస్ లో 800 మెగావాట్లు, నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతి సబ్ క్రిటికల్ టెక్నాలజీ బదులు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతిలో ప్లాంట్ నిర్మించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు సూచించారు. కాలుష్యం నియంత్రణకు రూ.29 కోట్లు, ఏటా లాభాల్లో 2 శాతం ఖర్చు చేస్తామని జెన్కో సీఎండీ చెప్పారు. దీంతో ప్లాంట్ నిర్మాణానికి అన్నివర్గాల నుంచి సుముఖత వ్యక్తమైంది. 5 నెలలపాటు పనులు చేసిన తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహించడంతో పనులను జెన్కో నిలిపేసిన విషయం తెలిసిందే. చివరకు ప్రజాభిప్రాయ సేకరణలో సానుకూల ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకుంది. -
‘సూపర్’కే మొగ్గు
♦ 17న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ♦ ‘సబ్ క్రిటికల్’పై వ్యతిరేకత ♦ టెక్నాలజీ మార్చాల్సిందే అంటున్నప్రజలు మణుగూరు : భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) విషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మిస్తున్న ప్లాంట్‌కు సంబంధించి ఈనెల 17న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్లాంట్ నిర్మాణంలో వాడే సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనే రగడ మొదలైంది. కాలుష్యం వెదజల్లే ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’ని దేశంలో ఎక్కడా వాడకూడదని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు, కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించాయి. దీనికి బదులు కాలుష్యం తక్కువ వెదజల్లే ‘సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’ వాడాలని నిర్ణయించారు. అయితే దీనికి విరుద్ధంగా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ జెన్కో ఉపయోగిస్తోంది. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహంతో పనులు నిలిపేశాయి. సూపర్ క్రిటికల్ ఎందుకంటే... లక్షల టన్నుల బొగ్గును మండించినప్పుడు భారీగా కాలుష్యం వస్తుంది. అయితే ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’లో డ్రమ్‌తో కూడిన స్టీమ్ జనరేటర్ ద్వారా నీరు లేదా ఆవిరి వివిధ దశల్లో ప్రాసెస్ అవుతోంది. ఎక్కువ దశల వల్ల కాలుష్యం ఎక్కువ విడుదల అవుతుంది. ఇక ‘సూపర్ క్రిటికల్’ పద్ధతిలో డ్రమ్ లేకుండా జనరేటర్ కలిగిన బా యిలర్ ఉంటుంది. ఇది అవసరానికి తగినట్లు ఆటోమేటిగ్గా ఆపరేట్ అవుతుంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. దీనినే వాడాలని కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించింది. ‘సూపర్’ టెక్నాలజీ వాడాలి కాలుష్యం తక్కువగా విడుదల చేసే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించి పవ ర్ ప్లాంట్ నిర్మించాలి. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వదిలేయాలి. జెన్కో అధికారులు టెక్నాలజీ మార్పునకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. - పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే చర్చ స్పష్టంగా ఉండాలి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్రం ఆగ్రహించడంతో పనులు నిలిపేసిన జెన్కో తీరి గ్గా ప్రజాభిప్రాయ సేకరణకు దరఖాస్తు చేసుకుంది. దీనిని తూతూమంత్రంగా ముగించాలని చూస్తే సహిం చేది లేదు. అన్నింటిపై స్పష్టంగా చర్చ జరపాలి. - వట్టం నారాయణ, ఆదివాసీ నాయకుడు